గుండె పదిలంగా ఉంటే చాలు - ఏ వ్యాధులన్నా, వందేళ్లు బతికేస్తారట!
గుండె ఆరోగ్యవంతంగా ఉన్నవారిలో కార్డియోవాస్క్యూలార్ డిసిజ్, డయాబెటిస్, క్యాన్సర్, డిమెన్షియా వంటి సీరియస్ అనారోగ్యాలను పదిసంవత్సరాల పాటు వాయిదా వెయ్యడం సాధ్యమే.
శరీరంలో గుండె ఒక్కటీ ఆరోగ్యంగా ఉంటే చాలట ఆయుష్సును మరో దశాబ్ద కాలానికి పొడిగింవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. గుండెను ఫిట్‌గా ఉంచుకుంటే.. ఆరోగ్యానికి కీడు చేసే సమస్యలను నివరించే అవకాశాలు మెరగవుతాయని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు.
గుండె ఆరోగ్యంగా ఉన్నవారిలో కార్డియోవాస్క్యూలార్ డిసిజ్, డయాబెటిస్, క్యాన్సర్, డిమెన్షియా వంటి సీరియస్ అనారోగ్యాలను పది సంవత్సరాల పాటు వాయిదా వెయ్యడం సాధ్యమే అని న్యూఓర్లిన్స్ లోని టులేన్ యూనివర్సిటికి చెందిన డాక్టర్ల బృందం వెల్లడించింది. ఈ విషయంలో స్త్రీ, పురుష, ఆర్ధిక, సామాజిక వర్గాలలతో నిమిత్తం లేకుండా అందరిలోనూ సాధ్యమేనట.
గడిచిన కొన్ని దశాబ్ధలుగా సగటు మానవ ఆయుర్ధాయం గణనీయంగా పెరిగినప్పటికీ.. జీవితం ఆరోగ్యంగా సాగుతుందని చెప్పలేం. వాస్తవానికి డయాబెటిస్, హృదయ సంబంధ సమస్యలు (సీవీడి), క్యాన్సర్, డిమెన్షియా వంటి రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే మధ్య వయస్కులు, వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటోందనేది నిపుణుల అభిప్రాయం. అయితే ఇవన్నీ కూడా నిమ్నస్థాయి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారిలో ఎక్కువ. యూకే బయో బ్యాంక్ స్టడీ నుంచి తీసుకున్న డేటా విశ్లేషణ ద్వారా టులేన్ విశ్వవిద్యాలయ నిపుణులు వివరాలను వెల్లడి చేశారు.
40 నుంచి 69 సంవత్సరాల వయసులో ఉన్న1,35,199 మంది వాలంటీర్లను ఈ అధ్యయనానికి వినియోగించారు. వారి ఆహారం, శారీరక శ్రమ, పొగాకు వినియోగం, నిద్ర, బాడీ మాస్ ఇండెక్స్, కొలెస్ట్రాల్, బ్లడ్ గ్లూకోజ్, రక్తపోటు గురించిన సమాచారాన్ని సేకరించి వీటి ఆధారంగా వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా గుండె, సంబంధిత రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నవారిని ఒక గ్రూపుగా, మధ్యస్థంగా ఉన్నవారిని రెండో గ్రూపుగా, తక్కువగా ఉన్నవారిని మూడో గ్రూపుగా విభజించారు.
50 సంవత్సరాల వయసున్న పురుషుల్లో గుండె, సంబంధిత రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నవారిలో పైన చెప్పుకున్న 4 ప్రధాన దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి తప్పించుకుని 6.9 సంవత్సరాలు ఎక్కువ జీవించే అవకాశం ఉందని నిర్ధారించారు. అయితే స్కోర్ మధ్యస్థంగా ఉన్నవారు ఈ అధ్యయనంలో పాల్గొన్న వాలంటీర్లలో అత్యధికంగా ఉన్నారు. తక్కువ కార్డియోవాస్కులర్ హెల్త్ స్కోర్ ఉన్నవారితో పోలిస్తే నాలుగు ఏళ్ల పాటు జబ్బులు లేకుండా ఆరోగ్యంగా జీవించినట్టు తెలిసింది.
ఇక మహిళల్లో తక్కువ కార్డియోవాస్క్యూలర్ హెల్త్ స్కోర్ కలిగిన వారితో పోలిస్తే ఎక్కువ స్కోర్ కలిగిన మహిళలు దాదాపుగా దశాబ్ధం పాటు ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారట. కార్డియోవాస్క్యూలర్ ఆరోగ్యం మధ్యస్తంగా ఉన్నవారితో తక్కువ స్కోర్ ఉన్న వారిని పోలిస్త మద్యస్థ స్కోర్ నమోదు చేసిన వారు దాదాపుగా 6.3 సంవత్సరాల పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారట.
మొత్తానికి ఈ అధ్యయనం ద్వారా కార్డియోవాస్క్యూలార్ హెల్త్ ఆయుష్షు మాత్రమే కాదు ఆరోగ్యవంతమైన జీవితానికి కారణం అవుతోందని తేలింది. ఈ అధ్యయనం వల్ల కార్డియోవాస్క్యూలార్ ఆరోగ్యం కాపాడుకోవడం వల్ల జీవన నాణ్యత తో పాటు ఆయుష్షు పెరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకొనే బాధ్యత పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఇందుకు గుండెకు మేలు చేసే ఆహారాన్ని తప్పకుండా తీసుకోండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.