Butterfly Pea Flowers : ఆ పూలను పారేయకండి.. వాటితో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయో తెలుసా?
ప్రకృతి ప్రసాదించే ప్రతి దానిలో మనుషులకు ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో శంఖు పూలు కూడా ఒకటి.
Butterfly Pea Flowers : శంఖు పుష్పాలను ఎక్కువగా శివపూజలో ఉపయోగిస్తారు. సిటీలలో చెప్పలేము గానీ.. పల్లెటూర్లలో ఈ మొక్కలు మీరు ఎక్కువగా చూస్తారు. కొందరు భక్తి కోసం పెంచుకుంటే.. మరి కొందరు ఇంటి అలంకరణలో భాగంగా పెంచుకుంటారు. ఎందుకంటే ఈ పూలు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. వాటి రూపం శంఖు ఆకారంలో ఉంటే.. రంగు నీలంగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా శివపూజలో ఉపయోగిస్తారు.
అయితే ఈ పువ్వులు కేవలం పూజలు, అలంకారానికే కాదు. వీటిని ఆయుర్వేదంలో పలు రోగాలకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తున్నారు. శారీరక రుగ్మతలే కాకుండా.. మానసిక రుగ్మతలను తగ్గించడంలో కూడా ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. హెల్తీ స్కిన్ అందించి.. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో వాటికవే సాటి.
జీర్ణ సమస్యలకు చెక్..
మీకు జీర్ణ సమస్యలున్నాయా? అయితే మీరు మీ డైట్లో శంఖుపూలను చేర్చుకోండి. ఇవి మీ శరీరంలో జీర్ణ రసాలను ప్రేరేపించి.. తీసుకున్న ఆహారం సాఫీగా జీర్ణం కావడానికి, పోషకాలను సరిగ్గా గ్రహించేలా చేస్తాయి.
అంతేకాదు.. ఇది తేలికపాటి భేదిమందు లక్షణాలు కలిగి ఉంటుంది. కటి ప్రాంతంలో మంటను తగ్గించడానికి, కడుపు పూతలు, పొత్తి కడుపు వద్ద నొప్పులు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు సప్లిమెంట్‌గా ఆయుర్వేదంలో దీనిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.
స్కిన్ కేర్..
శంఖుపూలు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి పూర్తిగా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో నిండి.. ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని టాక్సిన్స్ నుంచి రక్షిస్తుంది. మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది. అంతేకాకుండా దీనిలో యాంటీప్రూరిటిక్ లక్షణాలు చర్మంపై దురద, చికాకు, మంట నుంచి ఉపశమనం అందిస్తాయి.
మీరు తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలతో బాధపడుతుంటే.. దీనిని కచ్చితంగా ఉపయోగించండి. ఇది యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు కూడా అందిస్తుంది. తప్పకుండా వైద్యుని సూచనలు తీసుకోవాలి.
మానసిక స్థితికై..
శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు.. అది మానసిక స్థితిపై కాస్త ప్రభావం చూపిస్తుంది. అలాగే ల్యాప్‌టాప్‌పై అధికంగా పనిచేసినప్పుడు, ఫోన్‌ను అతిగా వాడినప్పుడు, టెలివిజన్ స్క్రీన్ ఎక్కువ సేపు చూడడం వల్ల కూడా మానసికంగా అలసిపోతారు. ఆఖరికి అదేపనిగా చదువుతున్నప్పుడు కూడా మానసికంగా నీరసపడిపోతారు. అలాంటి సమయంలో మీకు శంఖుపూలు విశ్రాంతినిస్తాయి.
మీరు బాగా అలసిపోయినప్పుడు శంఖుపూల పొడిని.. ఒక చెంచా తీసుకుని దానిని నీరు లేదా పాలతో కలిపి తాగండి. ఇది మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దీనిలో మెదడుకు విశ్రాంతిని అందించే లక్షణాలు మెండుగా ఉన్నాయి. మెదడు పనితీరును పెంచి.. మెరుగైన జ్ఞాపకశక్తిని అందిస్తుంది. ఏకాగ్రత కోల్పోకుండా చూస్తుంది.
స్ట్రెస్ ఎక్కువగా ఉందా?
ఆందోళన, నిరాశ నుంచి మీరు బయటపడేందుకు ఈ శంఖుపూలు ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇవి మానసిక ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ యాంగ్జైటీ, యాంటీ స్ట్రెస్, యాంటి డిప్రెసెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది మీ మానసిక స్థితితో పాటు.. నిద్రను మెరుగుపరుస్తుంది.
మెరుగైన నిద్ర.. మీలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మెదడులో డోపమైన స్రావాన్ని పెంచేందుకు సహాయం చేస్తుంది. డోపమైన్స్ మీ మనస్సును రిలాక్స్‌గా ఉంచే న్యూరో ట్రాన్స్మీటర్లను సమతుల్యం చేస్తాయి. మీరు ఈ స్ట్రెస్ నుంచి బయటపడేందుకు.. దీనిని తీసుకోవాలనుకుంటే.. ఎంత మోతాదులో తీసుకోవాలో అనే దానిపై క్లారిటీ ఉండాలి. కాబట్టి మీరు మీ దగ్గర్లోని ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి. వారి సూచనల మేరకు శంఖుపూలు తీసుకోండి.
తలనొప్పి బాధిస్తుంటే..
శంఖుపూలు, శంఖు పూల పొడి మీకు తలనొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. తలనొప్పి అనేది చాలా సాధారణమైనది. కానీ ఇది అనేక కారణాల వల్ల వస్తుంది. కొందరిలో తరచుగా ఈ నొప్పి బాధిస్తుంది. మీ నరాలను శాంతింపజేసి.. వాటి పనితీరును మెరుగుపరచడంలో శంఖు పూలు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి.
శంఖుపూలు ప్రశాంతమైన నిద్రను అందించి.. నొప్పిని దూరం చేస్తాయి. మీ నాడీ వ్యవస్థలో ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి మీరు వైద్యుని సూచనల మేరకు దీనిని తీసుకోండి.
Also Read : చలికాలంలో ఈ సింపుల్ వ్యాయామాలతో మోకాళ్ల నొప్పులు దూరం చేసుకోవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.