(Source: ECI/ABP News/ABP Majha)
Knee Pain Exercises : చలికాలంలో ఈ సింపుల్ వ్యాయామాలతో మోకాళ్ల నొప్పులు దూరం చేసుకోవచ్చు
Knee Pain Exercises : చలికాలంలో మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణాలు ఏవైనా కావొచ్చు. అయితే ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేస్తే.. ఈ సమస్యను కొంతమేర తగ్గించుకోవచ్చు.
Knee Pain Exercises : వయసుతో సంబంధం లేకుండా.. శారీరక సమస్యలే కాకుండా.. మానసిక స్థితి వల్ల కూడా వచ్చే సమస్యల్లో మోకాళ్ల నొప్పులు ఒకటి. కేవలం శారీరక శ్రమ వల్లనే కాదు.. ఒత్తిడి వల్ల కూడా మోకాళ్లనొప్పులు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఈ సమస్య.. మిమ్మల్ని సరిగ్గా కూర్చోనీయదు.. నిలబడనీయదు.. పడుకోనీయదు. ఏమి చేసినా.. కాళ్లు లాగేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
చలికాలంలో సాధారణ నొప్పుల నుంచి.. ఎన్నో ఆరోగ్య సమస్యలు బయట పడుతూ ఉంటాయి. వాతావరణంలో మార్పులతో పాటు.. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల శీతాకాలంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి కాళ్లు పట్టేసి నడవడం కూడా చేతకాదు. అయితే ఈ సమస్యను కొన్ని వ్యాయామాలతో దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వీటికోసం మీరు జిమ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే ఈ సింపుల్ ఆసనాలు చేస్తూ.. మోకాళ్ల ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ వ్యాయామాలు ఎలా చేయాలి? రోజుకు ఎన్నిసార్లు చేస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గోడ కుర్చీ..
గోడ కుర్చీ అంటే గోడకు కుర్చీ వేయడం అనుకునేరు. గోడకు ఆని మీరు కుర్చీ ఆకారంలో చేసే ఆసనాన్ని గోడ కుర్చీ అంటారు. గోడకు దగ్గరగా నిల్చొని.. దానికి వ్యతిరేకంగా నించోండి. మీ వెనుక సపోర్ట్ తీసుకుంటూ.. తుంటి భాగాన్ని కిందకి తీసుకెళ్తూ.. మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో ఉండేలా వంచండి. మీరు స్క్వాట్ పొజిషన్లో గోడకు కూర్చోంటారు. ఈ ఆసనంలో 10 సెకన్లు ఉండండి. లేదంటే.. మీరు ఎంత సేపు ఉండగలరో అనే దానిని బట్టి ఆసనం వేయొచ్చు.
లెగ్ రైజింగ్..
మీరు దీనిని వీలు కుదిరినప్పుడల్లా చేయొచ్చు. ఇంట్లో ఉండే కాదు.. ఆఫీస్లో ఉండి కూడా మీరు ఈ ఆసనం చేయొచ్చు. కొన్ని లెగ్ రైజింగ్స్ పడుకుని చేయొచ్చు. అయితే సీటెడ్ లెగ్ రైజ్స్లో మీరు కూర్చీలో కూర్చొని చేయొచ్చు. మీరు కుర్చీలో కంఫర్టబుల్గా కూర్చొని.. ఒక పాదాన్ని నేలపై ఉంచి.. మరో కాలును నేరుగా గాలిలో పైకి ఎత్తి.. నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని సెకన్లు ఈ స్థానంలో ఉండి.. అనంతరం యథా స్థానానికి తీసుకెళ్లాలి. అనంతరం మరో కాలితో కూడా ఇదే ప్రక్రియను రిపీట్ చేయొచ్చు.
కామ్షెల్స్..
ఇది చాలా సింపుల్ వ్యాయామనే చెప్పవచ్చు. దీనిని చేయడం కోసం.. మీ మోకాళ్లను యోగా మ్యాట్పై లేదా మంచంపై కూడా చేయొచ్చు. మీరు శవాసనంలో పడుకుని.. ఒక వైపునకు మీ పూర్తి శరీరాన్ని తిప్పండి. మీ పాదాలు కలుపుతూ మోకాళ్లు బెండ్ చేయండి. ఇప్పుడు పైనున్న మోకాలని ఎత్తి.. మళ్లీ యథాస్థానానికి తీసుకురావాలి. ఈ క్రమంలో మీ పాదాలు కచ్చితంగా కలిసే ఉండాలి. ఇలా కొన్ని సెకన్లపాటు.. చేయాలి. అనంతరం మరో మోకాలితో ఇదే ప్రక్రియ చేయాలి. రెండు కాళ్లతో 20 సార్లు ఈ వ్యాయామం చేయవచ్చు.
లెగ్ సైకిల్
ఈ ఆసనం పేరు లెగ్ సైకిల్. కానీ దీనిని చేయడానికి సైకిల్ అవసరం లేదు. మీరు విశ్రాంతి ఆసనంలో పడుకోవాలి. అనంతరం మీ రెండు కాళ్లను గాలిలోకి తీసుకురావాలి. ఇప్పుడు మీ మోకాళ్లను వంచి.. ఆపై మీరు సైకిల్ నడుపుతున్నట్లుగా మీ కాళ్లను వృత్తాకార కదలికల్లో రొటేట్ చేయాలి. మీ కంఫర్ట్కి అనుగుణంగా.. మీరు మీ వేగాన్ని పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. మీ ఓపికను బట్టి.. దీనిని పునరావృతం చేయవచ్చు.
స్టాండింగ్ హామ్ స్ట్రింగ్ కర్ల్..
దీనినే వెయిటెడ్ ఫ్లెక్షన్ అని కూడా అంటారు. ఈ వ్యాయామం చేయడం కోసం మీకు ఓ ఛైర్ కావాలి. ఒక కుర్చీని వెనుకవైపు పట్టుకుని నిలబడండి. సపోర్ట్ కోసం నిని పట్టుకోండి. అప్పుడు ఒక కాలును 90 డిగ్రీల కోణంలో వెనక్కి వంచండి. ఇలాగే మరోకాలితో రిపీట్ చేయండి. ఇలా 5 సెకన్లు కాలును వంచి.. యథాస్థితికి రావాలి. ఇది మీకు త్వరితగతిన ఉపశమనం అందిస్తుంది. ఇప్పుడు మీరు చేసే వ్యాయామలన్నీ.. మీకు మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తాయి. కాబట్టి మీరు కానీ.. మీ ఇంట్లో వారు కానీ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే.. ఈ వ్యాయామాలు చేయండి. చేయించేయండి.
Also Read : ఏవండోయ్.. చలికాలంలో మీరు తాగే టీలో ఆ ఒక్కటి వేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.