Raadhika: కొత్త ప్రయాణం మొదలైందన్న సీనియర్ నటి, ఆయనకు థ్యాంక్స్ చెప్తూ పోస్టు!
కొత్త ప్రయాణం మొదలైందంటూ సీనియర్ నటి రాధిక చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె దేని గురించి చెప్పారంటే?
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధిక శరత్ కుమార్. సుమారు నాలుగున్న దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో నటిగా రాణిస్తోంది. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె ఎన్నో పాత్రలు పోషించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. 1978లో భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘కిళక్కే పోగుమ్’ సినిమా ద్వారా హీరోయిన్ గా వెండి తెరపైకి అడుగు పెట్టింది. ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు వెనుదిరిగి చూసే పరిస్థితి రాలేదు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి పలు పాత్రల్లో నటిస్తూనే ఉంది. తన సినీ ప్రయాణంలో రాధిక శరత్ కుమార్ స్వయంగా పలు సినిమాలను నిర్మించింది.
తొలిసారి ఫారిన్ మూవీలో నటిస్తున్న రాధిక
ప్రస్తుతం రాధిక కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇంతకీ తన కొత్త ప్రయాణం ఏంటంటే? ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో నటించిన ఆమె, తొలిసారి ఫారిన్ సినిమాలో నటిస్తోంది. అదీ ఓ ఫ్రెంచ్ సినిమాలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. రీసెంట్ గా ఫ్రాన్స్ కు వెళ్లిన ఆమె చిత్రబృందంతో జాయిన్ అయ్యింది. ‘‘సినీ కెరీర్‌లో సరికొత్త జర్నీ మొదలయ్యింది. ఫ్రెంచ్ సినిమాలో నటిస్తున్నాను. తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నాను. గతంలో ఎప్పుడూ లేని కొత్త అనుభూతి కలిగింది. ఈ సినిమా విషయంలో నా భర్త శరత్‌కుమార్ ఎంతో ప్రోత్సహించారు. ఆయనకు థ్యాంక్స్” అంటూ రాసుకొచ్చింది. సినిమా షూటింగ్ ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
View this post on Instagram
రాధికకు శుభాకాంక్షల వెల్లువ
తన అద్భుతమైన నటనతో భారతీయ ప్రేక్షకులను అలరించిన రాధిక ఇప్పుడు విదేశీ చిత్రంలోనూ నటించడం పట్ల ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ ఏడాది నాలుగు సినిమాల్లో నటించింది రాధిక. అన్ని చిత్రాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. రీసెంట్ గా ఆమె నటించిన ‘చంద్రముఖి-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ధ్రువ నక్షత్రం’లోనూ రాధిక కీలకపాత్ర పోషించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక రాధిక నటిస్తున్న తొలి ఫారిన్ చిత్రం ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
Read Also: దీపిక-రణ్‌వీర్ వెడ్డింగ్ వీడియో చూశారా? పెళ్లైన 5 ఏళ్లకు బయటకు వచ్చింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial