Tollywood Drugs Case: ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్.. నాడు బాలీవుడ్.. నేడు టాలీవుడ్ కేసులో!
నటి రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబరు 6న విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాసింది. అయితే, అధికారులు ఇందుకు నిరాకరించారు. దీంతో ఆమె ముందుగానే విచారణకు హాజరైంది.
మాదక ద్రవ్యాల కేసులో చోటుచేసుకున్న లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31న దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ఆరంభమైన ఈ విచారణ.. సెప్టెంబరు 22తో ముగుస్తుంది. గురువారం నటి, నిర్మాత చార్మిను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా చార్మి, ఆమె ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను అధికారులను ప్రశ్నించారు.
ఈడీ ఈ నెల 6న రకుల్ ప్రీత్ సింగ్‌ను విచారించాల్సి ఉంది. అయితే, రకుల్ మూడు రోజులు ముందుగానే ఈడీ ముందుకు వచ్చింది. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని, కొంత గడువు కావాలని రకుల్ ఈడీని కోరింది. ఈ మేరకు గురువారం ఈ మెయిల్ పంపింది. తనకు మరో డేట్ కేటాయించాలని తెలిపింది. రకుల్ ప్రీత్ సింగ్ లేఖపై ఈడీ స్పందిస్తూ గడువు పొడిగించడం సాధ్యం కాదని తెలిపింది. దీంతో రకుల్ శుక్రవారం హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. ఇందుకు ఈడీ అంగీకారించడంతో రకుల్ శుక్రవారం ఉదయం విచారణకు హాజరైంది. ఈడీ చెప్పిన సమయం కంటే ముందుగానే ఆమె కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మీడియాకు చిక్కకుండా వెనుక గేటు నుంచి ఆమెను తీసుకెళ్లారు.
రకుల్‌తోపాటు చార్టెడ్ అకౌంటెంట్, లాయర్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. రకుల్ కూడా తనతో కొన్ని ఫైళ్లను తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈడీ రకుల్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు. అయితే, 2017లో జరిగిన ఎక్సైజ్ విచారణలో రకుల్ పేరు లేదు. కానీ, ఆమెకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన ఈడీ ఆమెను కూడా విచారించేందుకు సిద్ధమైంది. అయితే, గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డ్రగ్స్ కేసుపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) నిర్వహించిన విచారణకు కూడా రకుల్ హాజరైంది. ఆమెతోపాటు బాలీవుడు నటులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలి ఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్లను కూడా ఎన్‌సీబీ విచారించింది. తాజాగా ఈడీ ముందు లొంగిపోయిన కెల్విన్.. రకుల్ పేరును చెప్పడం వల్లే ఈడీ ఆమెను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు డ్రగ్స్ వినియోగంతో సంబంధం లేదు. కేవలం వాటిని కొనుగోలు చేయడానికి జరిగిన లావాదేవీలు గురించే విచారణ జరగనుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3, 4 కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఆ మేరకు అదనపు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఈడీ పూరీ జగన్నాథ్ ఆరేళ్ల ట్రాన్సాక్షన్స్ కావాలని కోరింది. ఈ సందర్భంగా పూరీ తన మూడు అకౌంట్లలో 2015 - 2021 మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ఈడీకి అందించినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా సినీ ప్రముఖుల ఖాతాలను కూడా ఈడీ తనిఖీ చేయనుంది. ముంబయి నార్కొటిక్ బ్యూరో
మాదక ద్రవ్యాల తరలింపుపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గతంలో మొత్తం 62 మందిని ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ కూడా అందర్నీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే పాత నేరస్తుల్ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. మరో వైపు ఈడీ వర్గాలు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. డ్రగ్స్ ఎలా తెప్పించేవారు..? డబ్బులు ఎలా చెల్లించారు..? అన్న వాటిపై పూర్తి సమాచారం ఈడీ అధికారులు సేకరించారని.. ఆ ఆధారల ప్రకారమే సినీ ప్రముఖులను ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది.
డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలన్నీ హవాలా మార్గంలో జరిగినట్లుగా భావిస్తున్నారు. అలాగే నేరం చేసినట్లుగా నిరూపితమైతే ఆస్తులు జప్తు చేస్తే అవకాశం ఉంది. పబ్ నిర్వహించే ఓ సినీ ప్రముఖుడు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను తెప్పించి సినీ వర్గాలకు సరఫరా చేసినట్లు తెలిసింది. దీంతో అతడి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డ్రగ్స్ కేసు మళ్లీ తెరుచుకోవడంతో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈడీ కేసు పరోక్షంగా తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల విచారణకు కూడా పరోక్షంగా సహాయపడనుంది. ప్రస్తుతం వారికి ఎలాంటి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని చార్జిషీట్‌లో పోలీసులు పేర్లు పెట్టలేదు. ఈడీ విచారణ తర్వాత చార్జిషిట్లను సవరిస్తూ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. ఇప్పుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఈడీ తేల్చితే వారిపై ఎక్సైజ్ శాఖ కూడా కొత్తగా చర్యలు తీసుకోక తప్పదు. దీంతో టాలీవుడ్ స్టార్ల పరిస్థితి దయనీయంగా మారుతుంది. రెండు రకాలుగా ఇరుక్కొనే పరిస్థితి నెలకొంటుంది. మున్ముందు ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.