Mango Media: మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి, ఆ వీడియో తొలగించాం... మ్యాంగో మీడియా ప్రకటన
రామ్ వీరపనేనికి చెందిన మ్యాంగో మీడియా సంస్థ క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రముఖ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ పై కొంతమంది కులస్థులు దాడి యత్నించారు. తమ కులానికి చెందిన మహిళలను కించపరిచే వీడియోలను ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలను యూట్యూబ్ ఛానెల్ నుంచి వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మ్యాంగో మీడియా సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది.
క్షమించండి...
ఆ ప్రకటనలో మ్యాంగో సంస్థ 20 ఏళ్లకు పైగా ఎలక్ట్రానిక్, డిజిటల్ కంటెంట్ పబ్లిషింగ్ వ్యాపారంలో ఉందని చెప్పింది. తాము ఎథికల్ ప్రాక్టిసెస్ పాటించే సంస్థ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నట్టు తెలిపింది. జనవరి 24, 2022న కొంతమంది వ్యక్తులు తమ ఆఫీసుకు వచ్చారని, వారు గౌడ కులస్థులమని చెప్పుకున్నారని తెలిపింది. ఒక వీడియో క్లిప్ కు సంబంధించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని, అందులో తమ కుల మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని వారు వెల్లడించారని, ఆ వీడియోను తొలగించాల్సిందిగా కోరినట్టు చెప్పింది. స్త్రీలను కించపరిచే సన్నివేశాలు చూపించే ఉద్దేశం తమకు లేదని అది తమ సిద్ధాంతానికి వ్యతిరేకమని ప్రకటనలో రాసుకొచ్చింది. వారు కోరినట్టే ఆ వీడియోను అదే రోజున తొలగించామని, ఆ వీడియో వల్ల మాకు తెలియకుండా ఏ మహిళలనైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరింది.
సోషల్ మీడియాలో ఆ కులానికి చెందిన వారి నుంచి తమకు విపరీతంగా మెసేజ్ లు వస్తున్నాయని కూడా తెలిపింది మ్యాంగో సంస్థ. కొందరు చాలా ఆవేదనగా పోస్టులు పెడుతున్నారని వారిలో ప్రతి ఒక్కరికీ తాము క్షమాపణులు కోరుతున్నట్టు ప్రకటించింది.
తొలగించిన ఆ వీడియో క్లిప్ లో ఈ కులస్థులను వేశ్యలుగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అందుకే వారికి చాలా ఆగ్రహం వచ్చి మ్యాంగ్ మీడియా సంస్థపైకి దాడి చేసేందుకు వెళ్లినట్టు సమాచారం.
సింగర్ సునీతను మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని గతేడాది పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. 2021 జనవరి 9న వీరిద్దరి పెళ్లి హైదరాబాద్ వైభవంగా జరిగింది. రామ్ కు మొదటి భార్యతో పిల్లలు లేరు, సునీతకు మాత్రం ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి
Also Read: జనవరి 28 ఎపిసోడ్: సంతోషంలో జగతి, మహేంద్ర.. వసుపై రిషి స్పెషల్ కేర్.. గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్