(Source: ECI/ABP News/ABP Majha)
Natti Kumar: అఖిల్‌ను తొక్కెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? నిర్మాత సంచలన వ్యాఖ్యలు
‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ అని టాక్ వస్తున్న నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హీరో అఖిల్ ను తొక్కేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మాస్ హీరోగా సత్తా చాటేందుకు అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తన గ్రాఫ్ ఓ రేంజిలో పెరిగిపోతుందనుకున్నాడు. కానీ, ఆయన ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డా ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. తొలి షో నుంచే తీవ్ర స్థాయిలో నెగెటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆయన కెరీర్ క్లోజ్ అంటూ ప్రచారం మొదలయ్యింది.
అఖిల్ ను తొక్కేసే ప్రయత్నం జరుగుతోంది!
ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అఖిల్ ను తొక్కేసేందుకు పద్దతి ప్రకారం కుట్రలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమను ఒక్కరే తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. అఖిల్ సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా, కుట్రలో భాగంగానే తమిళ మూవీకి ఇచ్చారని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సంచలన ఆరోపణలు చేశారు. “సినిమా పరిశ్రమలో ఎన్నో రాజకీయాలు, కుట్రలు, ఎత్తుగడలు ఉన్నాయి. వాటిని తట్టుకుని ముందుకెళ్లడం అఖిల్ వల్ల అవుతుందా? అక్కినేని ఫ్యామిలీ వల్ల అవుతుందా? నిజం చెప్పాలంటే అక్కినే ఫ్యామిలీ చాలా సైలెంట్ గా ఉంటుంది. ఆ ఫ్యామిలీకి చెందిన ఓ హీరోను తొక్కేయడానికి ఓ అగ్ర నిర్మాత థియేటర్లను బ్లాక్ చేశాడు. ‘ఏజెంట్’ రిలీజ్ రోజునే ‘పొన్నియన్ సెల్వన్ 2’ కూడా విడుదల అయ్యింది. దర్శకుడు మణిరత్నం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ, తెలుగు సినిమా అనేది నాదృష్టిలో చాలా గొప్ప. ‘ఏజెంట్’ మూవీకి నిన్నటి దాకా డిస్ట్రిబ్యూటర్లకు కూడా దొరకలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు” అన్నారు.
గతిలేని పరిస్థితిలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ మూవీని నడిపిస్తున్నారు
“సినిమా పరిశ్రమలో ఏక ఛత్రాధిపత్యం అనేది మంచిది కాదు. ఎవరు అవునన్నా, కాదన్నా, ‘ఏజెంట్’కు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో? అర్థం కావట్లేదు. సినిమా పరిశ్రమలో గొప్ప స్థాయిలో ఉన్నవారికి పరిస్థితి ఇలా ఉంటే, మాలాంటి వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఇప్పటికే చిన్న సినిమాలను లేకుండా చేశారు. మార్కెట్ పూర్తిగా పడిపోయేలా చేశారు. ‘దసరా’కు బాగానే వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు. మరి డబ్బులు ఏవి? ప్రొడ్యూసర్ కు , కొన్ని వారికే ఇంకా డబ్బులు రాలేదు. నిజమైన నిర్మాతలకు, బయ్యర్లకు ఎందుకు డబ్బులు రావడం లేదు? నిజానికి తమిళ సినిమాల కంటే తెలుగు సినిమాలకే ఇక్కడి వాళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, విశాఖపట్నం లాంటి ప్రాంతంలో అన్ని థియేటర్లలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ రన్ అవుతోంది. అక్కడ ‘ఏజెంట్’ ఏ ఒక్క థియేటర్ లోనూ కనిపించడం లేదు. అక్కడ అన్ని థియేటర్లను బ్లాక్ చేశారు. గతిలేని పరిస్థితిలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాను నడిపిస్తున్నారు. ఏక ఛత్రాధిపత్యం కారణంగా ఇండస్ట్రీ ఆగం అవుతోంది. ఇప్పటికైనా మోనోపల్లికి ఎండ్ కార్డ్ పడాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు” అని నట్టి కుమార్ వెల్లడించారు.
Read Also: ఫిలింఫేర్ అవార్డుల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’కు చుక్కెదురు, అవార్డులన్నీ ఆ మూవీకే!