Malayalam Horror Movies: ఓటీటీ ప్రేక్షకులను వణికిస్తున్న 5 లేటెస్ట్ మలయాళీ హర్రర్ మూవీస్ - వీటిని అస్సలు మిస్ కావద్దు
Malayalam Horror Movies: గత కొంతకాలంగా మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక హారర్ లవర్స్‌కు కూడా నచ్చేలా కొన్ని మలయాళ సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.
Malayalam Horror Movies On OTT: ఈరోజుల్లో దేశవ్యాప్తంగా మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే లేటెస్ట్ మాత్రమే కాకుండా ఎప్పుడో విడుదలయిన మలయాళ సినిమాలను కూడా వెతికి మరీ చూస్తున్నారు మూవీ లవర్స్. ఇక మాలీవుడ్‌లో కొన్ని అండర్‌రేటెడ్ హారర్ చిత్రాలు కూడా పలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో మీరూ చూసేయండి..
భ్రమయుగం
గత కొంతకాలంగా మమ్ముట్టి స్టోరీ సెలక్షన్‌కు అటు మాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. అలాంటి ఒక డిఫరెంట్ హారర్ మూవీతోనే తాజాగా అందరినీ అలరించారు ఈ సీనియర్ హీరో. అదే ‘భ్రమయుగం’. 1800 నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భారతన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా ‘సోనీ లివ్’లో అందుబాటులో ఉంది.
రోమాంచం
హారర్ కామెడీ చిత్రాలంటే ఏ భాష ప్రేక్షకులు అయినా అమితంగా ఇష్టపడతారు. అలాంటి ఒక కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళ చిత్రమే ‘రోమాంచం’. జీతూ మాధవన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తన రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా తెరకెక్కించాడు. ఇందులో కొందరు ఫ్రెండ్స్ కలిసి ఔజా బోర్డ్‌ను ఆడతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ. సౌబిన్ షాహిర్, అర్జున్ అశోకన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో స్ట్రీమ్ అవుతోంది.
నైన్ (9)
సైన్స్ ఫిక్షన్, హారర్ కలిపిన కథలు చాలా అరుదుగా వస్తాయి. ‘9’ కూడా అదే కేటగిరిలోకి వస్తుంది. పృథ్విరాజ్ సుకుమారన్ స్టోరీ సెలక్షన్‌కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ హీరో లీడ్ రోల్ చేసిన ‘9’.. ఎన్నో ట్విస్టులతో, మధ్యమధ్యలో హారర్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జెనూస్ మహమ్మద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలోక్ కృష్ణ, వామికా గబ్బి, మమతా మోహన్‌దాస్, ప్రకాశ్ రాజ్.. ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో అందుబాటులో ఉంది.
కినావల్లి
2018లో విడుదలయిన మలయాళ హారర్ చిత్రమే ‘కినావల్లి’. మామూలుగా హారర్ సినిమాల్లో లాజిక్స్ చూడకూడదు. అందులోనూ ‘కినావల్లి’ లాంటి ఫ్యాంటసీ హారర్ చిత్రాల్లో లాజిక్స్ అన్న మాటే మర్చిపోవాలి. శ్యామ్ సీతల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా కొంతమంది ఫ్రెండ్స్ చుట్టూనే తిరుగుతుంది. 2013లో విడుదలయిన ‘పీ మాక్’ అనే థాయ్ హారర్ చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఇది ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో స్ట్రీమ్ అవుతోంది.
భూతకాలం
‘భ్రమయుగం’ను డైరెక్ట్ చేసిన రాహుల్ సదాశివన్.. ‘భూతకాలం’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. మలయాళ పరిశ్రమలోనే హారర్ జోనర్‌కు ఈ సినిమా కొత్త అర్థాన్ని తీసుకొచ్చిందని అక్కడి ప్రేక్షకులు అంటూ ఉంటారు. షేన్ నిగమ్, రేవతి తల్లీకొడుకులుగా నటించిన ‘భూతకాలం’ ఇప్పటికే చాలామంది ఆడియన్స్‌ను తెగ ఇంప్రెస్ చేసింది. నేరుగా ఓటీటీలో విడుదలయిన ఈ మూవీ.. ప్రస్తుతం ‘సోనీ లివ్’లో అందుబాటులో ఉంది. ‘భూతకాలం’లో తన పర్ఫార్మెన్స్‌కు రేవతికి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ కూడా దక్కింది.
Also Read: బేబీ కోసం నరేష్ కన్నీళ్లు - సాయానికి ముందుకు వచ్చిన కల్కీ టీం