YSRCP: వంశీ తర్వాత కొడాలి నాని - జగన్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ?
Andhra Pradesh: వల్లభనేని వంశీని టీడీపీ అధికారంలోకి వస్తే అరెస్టు చేస్తారని చాలా మంది ఊహించారు.కానీ చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు అందరూ కొడాలి నాని గురించి ఆలోచిస్తున్నారు. ఆ అరెస్టు కూడా ఉంటుందా ?

Will Kodali Nani be arrested after Vamsi: తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ లో ఉండే మొదటి పేర్లలో కొడాలి నాని, వల్లభనేని వంశీ పేర్లు ఉంటాయి. ఈ ఇద్దరు మాజీ తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయం చేయలేదు. వ్యక్తిగత శత్రుత్వం పెంచుకుంది. రాజకీయాల్లో మాట్లాడకూడని మాటల్ని మాట్లాడారు. చంద్రబాబును, ఎన్టీఆర్ కుటుంబాన్ని ఘోరంగా అవమానించారు. చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడానికి వైసీపీ అధినేత పన్నిన వ్యూహం అదని వైసీపీ వర్గాలు చెబుతాయి కానీ టీడీపీకి మాత్రం వారిద్దరూ మోస్ట్ వాటెంట్ టార్గెట్ అయ్యారు. అయితే ఎన్నికల్లో ఇద్దరు భారీ తేడాతో ఓడిపోయి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనిపించను కూడా కనిపించడం లేదు. తెర వెనుక రాజకీయం చేస్తున్నారు. దీంతో వంశీ దొరికిపోయారు.
ఫిర్యాదుదారుడితో రివర్స్ అయ్యేలా చేసి దొరికిపోయిన వంశీ
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, కార్లు తగులబెట్టడం వంటివి అప్పట్లో సంచలనం సృష్టించాయి. వల్లభనేని వంశీ దగ్గరుండి ఆ దాడిని మానిటర్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును వైసీపీ హయాంలో నామమాత్రంగా నమోదు చేయడమే కాకుండా టీడీపీ నేత అయిన పట్టాభిపైనే కేసులు పెట్టి జైలుకు పంపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన సీసీ ఫుటేజీ ఆధారంగా కేసులు పెట్టారు. సత్యవర్థన్ అనే టీడీపీ ఆఫీసులో పని చేసే ఉద్యోగి ఫిర్యాదులో అట్రాసిటీ కేసులు పెట్టారు. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.అయితే అసలు కేసే లేకుండా చేసేందుకు సత్యవర్థన్ ను ట్రాప్ చేసి.. కోర్టులో నేరుగా వాంగ్మూలం ఇప్పించడంతో టీడీపీని రెచ్చగొట్టినట్లయింది. వెంటనే .. అసలేం జరిగిందో ఆరా తీసి.. పోలీసులు వంశీని అరెస్టు చేసేశారు. మామూలుగా జోక్యం చేసుకోకుండా ఉంటే పోలీసులు తొందరపడేవారు కాదేమో కానీ.. చాన్స్ ఇవ్వడంతో అరెస్టు కావాల్సి వచ్చింది.
నెక్ట్స్ కొడాలి నాని అనే ప్రచారం
తర్వాత కొడాలి నాని అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వంశీ కంటే ఎక్కువగా కొడాలి నాని పై టీడీపీ క్యాడర్ కు కోపం ఉంది. ఆయనపై గుడివాడలో పలు కేసులు నమోదయ్యాయి. అరెస్టు చేయాలనుకుంటే పెద్ద విషయం కాదు. కానీ కొడాలి నాని ఎక్కడ ఉన్నారో బయటకు తెలియడం లేదు. అరెస్టు విషయంలో కక్ష సాధింపులు అనే మాట రాకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా సరైన సమయం కోసం చూస్తోంది. కొడాలి నాని కూడా తెర వెనుక ఏదైనా రాజకీయాలు చేస్తూంటే.. ఆయనను కూడా పట్టేసుకుని అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రజల నుంచి సానుభూతి రాదు - మరి జగన్ సపోర్ట్ ?
వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారకుల్లో వైసీపీ నేతలు కూడా వంశీ, కొడాలి నాని పేరు చెబుతారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వైసీపీపై ప్రజల్లో అసహ్యం పెరిగేలా చేశారని అంటారు. అందుకే వీరి అరెస్టు విషయంపై వైసీపీ క్యాడర్ లో ఎలాంటి స్పందన లేదు. కొంత మంది నేతలు మాత్రం ప్రెస్‌మీట్లలో ఖండించారు. అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం ఎలాంటి ఖండన ప్రకటన రాలేదు. అన్యాయం అని ట్వీట్ కూడా చేయలేదు. దీంతో వంశీ విషయంలో జగన్ సపోర్టు ఉండదని భావిస్తున్నారు. పార్టీ పరంగా సపోర్టుగా కొంత మంది నేతలు మాట్లాడుతున్నారు. కానీ అధ్యక్షుడు వెంటనే స్పందించకపోవడం వంశీకి ఇబ్బందే. రేపు కొడాలి నానీకి ఇదే పరిస్థితి ఎదురయితే.. వారు రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగానూ నష్టపోయినట్లే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

