Sanjay Leela Bhansali: బాలీవుడ్ అగ్ర హీరోయిన్లతో ‘హీరామండి’ ఫస్ట్ గ్లింప్స్ - భన్సాలీ ఎమోషనల్
సంజయ్ లీలా భన్సాలీ తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి’. నెట్ ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్న ఈ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. పలువురు బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు.
సంజయ్ లీలా భన్సాలీ. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు. చారిత్రాత్మక కథలను, రియలిస్టిక్ కథలను సినిమాలుగా మలచడంలో ఆయన తర్వాతే మరెవరైనా. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, దేవదాస్, ‘బాజీరావ్ మస్తానీ’ లాంటి సినిమాలు ఆయన ప్రతిభకు మచ్చుతునకలు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘హీరామండి’. నెట్ ఫ్లిక్స్ కోసం ఆయన ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ తో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెడుతున్నారు. తాజాగా ‘హీరామండి’కి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ అగ్ర నటీమణులు సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాల, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్ మహారాణుల మాదిరిగా దర్శనం ఇచ్చారు. ఒకే ఫ్రేమ్ లో అందాల తారలను దించేశారు.
View this post on Instagram
వేశ్యా ఆచారం ఆధారంగా తెరకెక్కిన ‘హీరామండి’
మొఘల్స్ కాలంలో రాజ వంశీయులకు, రాజ కుటుంబీలకు గొప్ప స్థితిలో ఉన్న వేశ్యలు అన్ని రకాల పనులను దగ్గరుండి చూసుకునే వారు. వారికి రకరకాల సపర్యలు చేస్తూనే పడక సుఖాన్ని కూడా అందించే వారు. అప్పట్లో ఉన్న ఈ సంప్రదాయాన్ని మరోసారి గుర్తు చేయబోతున్నారు భన్సాలీ. 15 - 16వ శతాబ్ధం కాలంలో ఉన్న వేశ్యా ఆచారం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్, పాక్ విడిపోయాక లాహోర్ కు సమీపంలో ఉన్న షాహి మొహల్లా అనే ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటనలను బేస్ చేసుకుని ఈ సిరీస్ కథ రూపొందించారు. సుమారు పదేళ్ల క్రితమే ఈ కథతో ఓ సినిమా చేయాలని కరీనా కపూర్ ను కలిశారట భన్సాలీ. కథ మరీ బోల్డ్ గా ఉండటంతో తను చేయలేనని చెప్పినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలాంటి స్టోరీతోనే ‘గంగూబాయి కతియావాడి' రూపొందించినట్లు చెప్పిన భన్సాలీ.. “తన సినిమాల్లో మహిళ పోషించే పాత్రే ఆ సినిమాపై ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఒక కథలో మహిళ పోషించే పాత్ర పైనే తన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి పాత్రలు లేకుండా నేను సినిమాలు చేయలేను. మస్తానీ అనే పాత్ర లేకుండా అసలు తాను బాజీరావ్ మస్తానీ చేసే వాడినే కాదు. ‘హీరామండి’ కోసం 14 ఏళ్లుగా శ్రమిస్తున్నాను” అని వెల్లడించారు.
త్వరలో నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్
అటు ‘హీరామండి’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల సందర్భంగా నెట్ ఫ్లిక్స్ కో సీఈఓ టెడ్ శారండోస్ భన్సాలీపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మకత కలిగిన బెస్ట్ కంటెంట్ అందించే క్రియేటర్స్ కథలకే తాము ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ అత్యుత్తమ వెబ్ సిరీస్ ‘హీరామండి’ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నట్లు వెల్లడించారు.
Read Also: తమిళ హీరో కార్తితో పరుశురామ్ సినిమా, టైటిల్ ఇదేనా?