Krishnam Raju: కృష్ణంరాజు జల్సాలు చూసి తట్టుకోలేని ఓ స్నేహితుడు ఏం చేశాడో తెలుసా?
కృష్ణంరాజు జల్సాలు చూసి తట్టుకోలేకపోయిన ఓ స్నేహితుడు.. కృష్ణంరాజు తండ్రికి ఆకాశరామన్న పేరుతో ఓ లెటర్ రాశాడట.
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఎదగాలంటే చాలా కష్టపడుతుంటారు. అందుకే ఒక్కొక్కరికీ ఒక్కో స్టోరీ ఉంటుంది. కానీ కృష్ణంరాజుకి అలాంటి సినిమా కష్టాలు ఎదురుకాలేదు. ఎందుకంటే ఆయన సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగారు. డబ్బుకి ఎలాంటి లోటు లేదు. అందుకే మొదటినుంచి కూడా ఆయన జల్సాగా గడిపేవారు. కాలేజ్ లో చదువుకునే సమయంలో ఆయన బైక్స్ మీద, కార్లలో తిరిగేవారు. అప్పట్లో ఆయన కారులో వెళ్తుంటే.. కొత్తగా వచ్చిన లెక్చరర్ ఏమోనని అందరూ అనుకునేవారట.
కృష్ణంరాజు జల్సాలు చూసి తట్టుకోలేకపోయిన ఓ స్నేహితుడు.. కృష్ణంరాజు తండ్రికి ఆకాశరామన్న పేరుతో ఓ లెటర్ రాశాడట. తండ్రి కష్టపడి డబ్బులు పంపుతుంటే.. కొడుకు జల్సాగా తిరుగుతున్నాడని.. డబ్బుని నీళ్లలా ఖర్చు పెడుతున్నాడని.. ఇప్పటికైనా కృష్ణంరాజుని కంట్రోల్లో పెట్టుకోకపోతే చేయి దాటిపోతాడని ఆ లెటర్ లో రాసి ఉందట.
నిజానికి ఏ తండ్రి అయినా.. ఇలాంటి లెటర్ చదివిన తరువాత ఆవేశంతో ఊగిపోతారు. కానీ కృష్ణంరాజు తండ్రి వీర వెంకట సత్యనారాయణ అలా చేయలేదట. ఈ ఆకాశరామన్న ఉత్తరాన్ని కృష్ణంరాజుకి పంపించి.. 'నీ గురించి ఎవరో ఇలా ఉత్తరం రాశారు.. కానీ నేను ఆ మాటలు నమ్మడం లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఎప్పటికీ తప్పు చేయవు. ఒక తండ్రిగా నీకు కావాల్సినవన్నీ సమకూర్చడం నా బాధ్యత. నీ లైఫ్ లో ఏ విషయం గురించి నేను జోక్యం చేసుకొని. కానీ నీపై ఈర్ష్య పడే ఇలాంటి స్నేహితులకు దూరంగా ఉండు' అని లెటర్ పంపించారట.
అది చదివిన కృష్ణంరాజు చాలా ఎమోషనల్ అయ్యారట. అప్పటినుంచి ఎలాంటి తప్పు చేయకుండా.. తండ్రికి గౌరవం తీసుకొచ్చేలా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన పిల్లల విషయంలో కూడా కృష్ణంరాజు ఇలానే ప్రవర్తించేవాడినని.. వాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చానని పలు సందర్భాల్లో తెలిపారు.
కృష్ణంరాజు బ్యాక్ గ్రౌండ్:
కృష్ణంరాజు విద్యాభ్యాసం మొగల్తూరులో మొదలైంది. ఎనిమిదో తరగతి వరకూ అక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత నర్సాపురం టైలర్ హైస్కూల్‌లో చేరారు. మళ్ళీ అక్కడ ఎనిమిదో తరగతిలో చేరారు. తొమ్మిది వరకు చదివారు. అల్లరి పెరగడం, బూతులు అలవాటు కావడంతో కొన్నాళ్ళు కాకినాడ పంపించారు. అక్కడ ఎస్.ఎస్.ఎల్.సి తప్పారు. దాంతో మళ్ళీ నర్సాపురం టైలర్ స్కూల్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత వై.ఎన్.ఆర్. కాలేజీలో చేరారు. అందులో పి.యు.సి. తప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ భద్రుకా కాలేజీ ఆఫ్ కామర్స్‌లో చేరారు. పి.యు.సి పాస్ అయ్యాక బీకామ్ చేశారు.
మద్రాస్ నగరంలో కృష్ణం రాజుకు ప్రత్యగాత్మ పరిచయమయ్యారు. ఆయనే 'చిలక గోరింక'తో కృష్ణం రాజును హీరోగా పరిచయం చేశారు. 1966లో విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో చాలా నిరాశ చెందారు. కొన్నాళ్ళు నటనకు విరామం ఇచ్చారు. నటుడు సీహెచ్ నారాయణరావు వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. నటన గురించి పలువురు రాసిన పుస్తకాలు చదివారు. మధ్యలో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయలేదు. వాటిని వదులుకున్నారు.
నిర్మాతగా కృష్ణం రాజు తొలి సినిమా 'కృష్ణవేణి'. గోపీకృష్ణా మూవీస్ సంస్థ స్థాపించి ఆయన నిర్మించిన మొదటి చిత్రమది. నటుడిగా ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చింది. అయితే... అది లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఆ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఆ తర్వాత 'భక్త కన్నప్ప' చేశారు. ఆ తర్వాత కృష్ణం రాజు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. నటుడిగా పేరు, వరుస అవకాశాలు తీసుకు వచ్చింది 'భక్త కన్నప్ప'.
Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!
Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్