Kantara Box Office Collections: కాంతార @ రూ.400 కోట్లు - భారీ వసూళ్లు సాధించిన ఆరు సినిమాల్లో ఐదు దక్షిణాదివే!
దక్షిణాది సినిమాలు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆరు సినిమాల్లో ఐదు దక్షిణాదివే కావడం గమనార్హం.
ఒకప్పుడు దక్షిణాది సినిమాలు అంటే బాలీవుడ్ లో కాస్త చిన్నచూపు ఉండేది. అందుకే దక్షిణాది సినిమాల్లో నటించడానికి కొద్దిమంది తప్ప మిగతా బాలీవుడ్ నటీనటులు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. గత కొద్ది కాలంగా బాలీవుడ్ సినిమాలు వెనకబడుతున్నాయి. అక్కడ నుంచి మంచి హిట్ వచ్చి చాలా కాలమే అయ్యింది. అయితే ఈ టైమ్ లో వచ్చిన కొన్ని దక్షిణాది సినిమాలు ఇండియాలోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ లో చేరాయి. తాజాగా ‘కాంతార’ కూడా ఈ జాబితాలో చేరింది. రూ.400 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
కేజీఎఫ్ 2:
కన్నడ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కేజీఎఫ్ 2'. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్లతో దుమ్ములేపింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1235.2 కోట్లు వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. తల్లికి ఇచ్చిన మాట కోసం ప్రపంచ కుబేరుడిగా ఎదగడానికి హీరో చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేశాయి. ఈ మూవీలో యష్‌తో పాటు, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి కూడా కీలక పాత్రల్లో నటించారు.
'ఆర్.ఆర్.ఆర్':
'బాహుబలి', 'బాహుబలి 2' లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా 1135.8 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో బ్రిటిష్ పాలకుల కు వ్యతిరేకంగా సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు చేసిన పోరాట సన్నివేశాలు అందర్నీ ఆట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమాను జపాన్ లో విడుదల చేశారు. అక్కడ కూడా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది 'ఆర్.ఆర్.ఆర్'.
పొన్నియిన్ సెల్వన్(పిఎస్ 1):
భారతీయ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా దేశవ్యాప్తంగా మంచి హిట్ అందుకుంది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు. ఈ సినిమా మొదటి భాగానికే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సినిమా కథ మొత్తం దక్షిణాది చోళ రాజవంశంలోని తిరుగుబాట్ల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, విక్రమ్, జయం రవి, శోభితా ధూళిపాళ, త్రిష, కార్తీ తదితరులు నటించారు. త్వరలో రెండొవ భాగం విడుదల విడుదల కానుంది.
బ్రహ్మస్త్ర (పార్ట్ 1 శివ):
ఈ ఏడాది విడుదలైన హిందీ సినిమాలలో బాక్స్ ఆఫీసు వద్ద నిలబడిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. మొదటి ఆరు భారీ వసూళ్ల చిత్రాల లిస్ట్ లో ఉన్న ఏకైక హిందీ సినిమా ఇది. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ కలసి నటించారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 430 కోట్లు వసూళ్లు సాధించింది. బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, షారూఖ్ ఖాన్, టాలీవుడ్ హీరో నాగార్జున కూడా నటించారు.
విక్రమ్:
తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్' సినిమా దేశవ్యాప్తంగా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమా లో క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.424.9 కోట్లు వసూళ్లు సాధించింది.
కాంతార:
కన్నడలో సైలెంట్ గా విడుదలైన ఈ 'కాంతార' సినిమా తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా పూర్వకాలపు ఆచారాలు కట్టుబాట్లు గురించి చెప్తూనే ప్రకృతికి మనిషికి ఉన్న విడదీయలేని అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకలోకం జేజేలు పలికింది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు వసూళ్లు సాధించి ఔరా అనిపించుకుంది.
Also Read: అవన్నీ ఫేక్ వార్తలు, వాళ్ళని ఊరికే వదలకూడదు: హీరో శ్రీకాంత్