Janaki Kalaganaledu March 2nd: రామ, జానకికి ఫస్ట్ నైట్- జ్ఞానంబ ప్రవర్తనపై అనుమానపడిన గోవిందరాజులు
జ్ఞానంబ ఆరోగ్య పరిస్థితి తనకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామ తల్లి గురించి ఆలోచనల్లోనే ఉంటాడు. జానకి వచ్చి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారని అడుగుతుంది. ఎవరి కోసం ఎవరిని బాధపెట్టాలో అర్థం కావడం లేదని రామ అంటాడు. వాళ్ళ మాటలన్నీ జ్ఞానంబ వింటూ ఉంటుంది. ఇంట్లో అందరికీ పరీక్షలు చేయించాము, నాది సరిపోతుందని తేలింది అందుకే ఇస్తానని చెప్తున్నానని జానకి అనడం విని జ్ఞానంబ షాక్ అవుతుంది.
రామ: మీ కిడ్నీ ఇచ్చిన మరుక్షణం మీ లక్ష్యాన్ని వదులుకున్నట్టే ఇంతకాలం మీరు పడిన కష్టం నీళ్ళలో పోసినట్టే
జానకి: పర్లేదు అత్తయ్యగారు సంతోషంగా ఉంటే అంతకమించి ఇంకేం లేదు
రామ: మీ ఆశయాన్ని అమ్మ కోసం ఎలా వదులుకోమని చెప్పాలి
జానకి: తను నాకు అత్తయ్య కిడ్నీ ఇస్తే ఒక ప్రాణం నిలబడుతుంది. ఐపీఎస్ అవడం మాత్రమే కోరుకుంటే పోయేది అత్తయ్యగారు ప్రాణం మాత్రమే కాదు ఇంట్లో ఇంకా చాలా మంది ప్రాణాలు పోతాయి. ఇక దీని గురించి ఇంకేం మాట్లాడొద్దు
Also Read: రాజ్యలక్ష్మి మొసలి కన్నీరు నమ్మేసిన విక్రమ్- పెళ్లి చూపులకు రెడీ అయిపోయిన దివ్య
రామ: అమ్మ ఒప్పుకోదు మీరు ఐపీఎస్ అవడం నాది మాత్రమే కాదు అమ్మ కోరిక కూడా
జానకి: అత్తయ్యని నేను ఒప్పిస్తాను
జానకి జ్ఞానంబ దగ్గరకి వచ్చి ఒక విషయం చెప్పాలని అంటుంది. కానీ జ్ఞానంబ మాత్రం నాకు నువ్వు ఇవ్వాల్సింది రామ బిడ్డని చూడటం ఇంకేమీ కాదని చెప్తుంది. నా గురించి నా చావు గురించి ఆలోచించొద్దు. కాదని నువ్వు ఇవ్వాలని అనుకున్నా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనని జ్ఞానంబ తెగేసి చెప్తుంది. పోయేలోపు రామ బిడ్డని చూడాలనే నా కోరిక తీర్చు అంతక మించి ఇంకేమీ వద్దని ఖరాఖండీగా చెప్పేస్తుంది. రామ వాళ్ళ మాటలు వింటూనే ఉంటాడు. జానకి ఎంత చెప్పినా కూడా జ్ఞానంబ వినదు దీంతో బాధగా వెళ్ళిపోతుంది.
జ్ఞానంబని తలుచుకుని జానకి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మల్లిక బట్టలు ఆరేస్తూ చీర చింపేస్తుంది. ఆ తప్పుని మలయాళం మీదకి తోసేస్తుంది. అప్పుడే గోవిందరాజులు వచ్చి నువ్వు చీర చింపు ఉండచుట్టడం చూశానని చెప్తాడు. అందుకు శిక్షగా వాడు తోమాల్సిన అంట్లు అన్నీ నువ్వే తోమమని అంటాడు. జ్ఞానంబ డాక్టర్ చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటే జానకి మళ్ళీ వచ్చి సర్ది చెప్పడానికి వస్తుంది కానీ వినదు. నిజంగా మీ స్థానంలో మా అమ్మ ఉంటే నాకు అవకాశం ఇవ్వకుండా ఉంటుందా? నా కిడ్నీ ఇస్తాను అంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు అని అడుగుతుంది.
జ్ఞానంబ: నీ లక్ష్యం చంపుకుని నాకు కిడ్నీ ఇవ్వడం ఇష్టం లేదు అందుకే వద్దని అంటున్నా
జానకి: నేనే ఇస్తానని అంటున్నా కదా
జ్ఞానంబ: కాలిపోయే బొగ్గుని నేను వెలుతురు నువ్వు తెలిసి తెలిసి ఎలా ఆర్పేయమంటావ్. నీ చిన్నతనం నుంచి పెట్టుకున్న లక్ష్యం ఆ పోలీసు ఉద్యోగం అది నాకోసం ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నావ్. తల్లిలా ఆలోచించాను కాబట్టి నా బిడ్డ భవిష్యత్ బాగుండాలని అనుకుంటున్నా. రేపు నువ్వు పోలీసాఫీసర్ అయితే వంశానికి వెలుగు అవుతావ్ మరో నాలుగు తరాలకి ఆదర్శం అవుతావ్. నేను నీ తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నా
జానకి: క్షమించండి అత్తయ్య మీ ప్రేమని అనుమానించాను నాకు నా ఆశయం కంటే మీ ప్రేమ, ఈ కుటుంబం సంతోషం ముఖ్యం
జ్ఞానంబ: నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు, నాకు మనవడు కావాలి. నిజంగా నా సంతోషాన్ని కోరుకునే దానివి అయితే నాకు వారసుడిని చూసే అదృష్టం ఇవ్వు. నువ్వు రామ దూరంగా ఉంటున్నారని నాకు అర్థం అయ్యింది. ఆ దూరాన్ని ఈ రాత్రితో చెరిపేయ్ మనవడు కావాలనే నా కోరిక తీర్చు
జ్ఞానంబ జానకిని అందంగా ముస్తాబు చేసి రామ గదికి పంపిస్తుంది. పండంటి బిడ్డని కానీ తన చేతుల్లో పెట్టమని ఇదే తన చివరి కోరిక అని చెప్తుంది. గోవిందరాజులు జ్ఞానంబని ఏమైందని అడుగుతాడు. ముహూర్తాలు చూడకుండా ఎందుకు ఇలా చేశావని అంటాడు. రోజులు దగ్గర పడే కొద్ది బాధ్యతలు తీర్చుకోవాలి కదా అని అనేసరికి గోవిందరాజులు షాక్ అవుతాడు.