Jacqueline Extortion Case: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్, రూ.200 కోట్ల కేసులో నిందితురాలంటూ షార్జ్‌షీట్!
Jacqueline Extortion Case: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలు అంటూ ఈడీ తేల్చింది. రూ. 200 కోట్ల కేసు ఛార్జ్ షీట్ లో ఆమె పేరును చేర్చింది.
Jacqueline Extortion Case: సుఖేష్ చంద్ర ప్రధాన నేరగాడిగా ఉన్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నిందితురాలంటూ ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆమె పేరును ఛార్జ్ షీట్ లో చేర్చింది. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. సుఖేష్ చంద్రశేఖర్ దోపిడీదారు అని జాక్వెలిన్ కు ముందే తెలుసని అయినప్పటికీ అతనితో స్నేహంగా ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌తో అత్యంత సన్నిహితంగా..
మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అతని నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది. దాదాపు రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైనా సుఖేష్ గురించి ముందే తెలిసినా.. అతడి నుంచి విలువైన బహుమతులు తీసుకోవడంలో ఎలాంటి సంకోచం వ్యక్తం చేయలేదని ఈడీ అధికారులు తెలిపారు. ఎంతో విలువైన డిజైనర్ బ్యాగులు, వజ్రాలు, బ్రాస్‌లెట్లు, జిమ్ సూట్లు, మినీ కూపర్ ఇలా చాలా విలువైనవి తను తీసుకుందని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన బహుమతులను జాక్వెలిన్‌కు సుఖేష్ ఇచ్చాడని అధికారులు వివరించారు. సుఖేష్ గురించి వార్తలు వచ్చిన సందర్భంలోనే... అతను ఈ శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో జాక్వెలిన్ సుఖేష్‌తో చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపించింది.
జాక్వెలిన్ విదేశాలకు పోకుండా లుక్ అవుట్..
సుఖేష్ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఆమెను పలుమార్లు అధికారులు పిలిచి విచారించారు. ఆ సమయంలోనే జాక్వెలిన్ విదేశాలకు పోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది ఈడీ. ఈ లుక్ అవుట్ నోటీసులపై జాక్వెలిన్ కోర్టును సైతం ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం.. జాక్వెలిన్ విదేశాలకు వెళ్ల వచ్చని అనుమతి మంజూరు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా.. ఈడీ అధికారులు జాక్వెలిన్ ఆస్తులను సైతం అటాచ్ చేశారు. ఆమెకు చెందిన రూ.7.27 కోట్లను అటాచ్ చేశారు అధికారులు. అయితే ఇందులో రూ.7 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లే ఉన్నాయి.
పోలీసులకు ఫిర్యాదు చేసిన అదితి సింగ్..
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి వారి భార్య దగ్గరి నుంచి ఏకంగా రూ. 200 కోట్లు వసూలు చేశాడు సుఖేష్ చంద్రశేఖర్. డబ్బులు తీసుకున్న సుఖేష్.. వారికి బెయిల్ ఇప్పించలేదు. ఇదేంటని వాళ్లు అడిగితే దాటవేస్తూ వచ్చాడు. అలా శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు సుఖేష్‌పై ఫిర్యాదు చేసింది. తమ నుంచి రూ.200 కోట్లు తీసుకున్నట్లు చెప్పింది. 2021లో నమోదైన ఈ కేసులో పోలీసులు సుఖేష్‌ను అరెస్టు చేశారు. అయితే జైల్లో ఉండి కూడా సుఖేష్ తన నేరాలను కొనసాగించినట్లు ఈడీ అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.