Silk Smita Special: అందరూ ఆమె నీలికళ్లే చూశారు...ఆ కళ్లలో కన్నీళ్లు చూడలేదు..
తెలుగు తెరపైకి ఎందరో ఐటెమ్ గాళ్స్ వచ్చారు వెళ్లారు కానీ ఎవ్వర్ గ్రీన్ టాప్ 3లో సిల్క్ ఉంటుంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని తారాజువ్వలా దూసుకుపోయింది. 2 దశాబ్దాల పాటూ శృంగారతారగా వెలిగింది.
కళ్లతోనే భావాలు పలికించడం కొందరికే సాధ్యం. వేంప్ క్యారెక్టర్లు చేసే వారికి మరీ ముఖ్యం. అలాంటి కళ్లు సిల్క్ స్మిత సొంతం. నిషా కళ్లు.. అంతకు మించిన సెక్సీ ఒళ్లుతో స్మిత వేసే స్టెప్పుల కోసం ప్రేక్షకులు ఎగబడ్డారు. ఓ దశలో హీరో ఎవరైనా సిల్క్ లేకుండా సినిమాకు శుభం కార్డు పడేది కాదంటే ఆశ్చర్యం లేదు. వెండితెర శృంగార తారగా నిలిచిపోయిన సిల్క్ స్మిత.... కాలే కడుపుతో కలల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పేరు, డబ్బు, హోదాను ఆర్జించింది కానీ వాటిని నిలబెట్టుకోలేకపోయింది. రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవాలనుకునే ప్రతీ అమ్మాయికీ ఓ పాఠంలా మిగిలింది. ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ఏబీపీ స్పెషల్...
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఎలూరులో ఓ పేద కుటుంబంలో 1960 డిసెంబరు 2న పుట్టింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నాలుగో తరగతి చదువు ఆపేసింది. సినిమాలపై అమితాశక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1980లో వచ్చిన 'పండిచక్రమ్' తమిళ చిత్రం విజయలక్ష్మి పేరునే కాదు... ఆమె జీవనగమనాన్నే మార్చేసింది. ఆ సినిమాలో పాత్రపేరే ఆమె ఇంటిపేరు, ఒంటిపేరయింది. ఈ పేరే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దర్శకులకు విజయాన్నందించే ప్రత్యేక గీతమైంది. అగ్రహీరోల సినిమాలో తప్పనిసరి క్యారెక్టర్ అయింది. కైపెక్కించే చూపుతో కుర్రకారుని తనవైపు తిప్పుకొనే సిల్క్ పై నిర్మాతల కన్నుపడింది. ఆఫర్లిస్తామంటూ వెంటపడ్డారు. స్కిన్ షోకి వెనక్కుతగ్గకపోవడం, మాటలో విరుపు... సిల్క్ పై మరింత వెలుగుపడేలా చేసింది. 2 దశాబ్దాలపాటూ హీరో ఎవరైనా స్మిత పాట ఉండాల్సిందే. ఆగిపోయిన సినిమాలకూ సిల్క్ పాట ప్రాణంపోసేది. ఆమె ఆటో.. పాటో లేకపోతే ప్రేక్షకులు నిరాశ చెందుతారని డిస్ట్రిబ్యూటర్లు... దర్శక నిర్మాతలపై ఒత్తిడి తెచ్చి సిల్క్ పాట పెట్టించేవారట.
హీరోయిన్ల కన్నా ఆమెకు ఎక్కువ పారితోషికం. నిర్మాతలూ అంతే ఆనందంగా ఇచ్చేవారు. షూటింగ్ అంతా పూర్తయినా స్మిత పాటకోసం ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూసిన సందర్భాలెన్నో. స్మిత ధాటికి తట్టుకోలేకపోయిన కొందరు హీరోయిన్లు ఆమెలా అందాలప్రదర్శనకు సిద్ధమయ్యారంటే... శృంగార తారగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బొడ్డు కిందకు చీరకట్టినా, నడుము చుట్టూ కొంగు బిగించినా, ఒళ్లు విల్లులా వంచినా సిల్క్ ది ఓ స్పెషల్ స్టైల్. ఓ రకంగా చెప్పాలంటే ఆమెకి మాత్రమే సొంతమైన కళ. ఇప్పటికీ టీవీలో సిల్క్ పాటొస్తోందంటే ఏవో గిలిగింతలు. తెలుగు తెరకు బికినీ పరిచయం చేసిందే సిల్కేనంటే ఆశ్చర్యం అవసరంలేదు.
స్మిత గొప్ప అందగత్తె కాదు. మనిషి చామనఛాయ. అయినా ఫొటోజెనిక్ ఫేస్ కావడం ఆమెకు కలిసొచ్చే పాయింట్. ముఖ్యంగా మత్తెక్కించే కళ్లు ఆమెకి ఎస్సెట్. తెలుగుతోపాటూ తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 450 చిత్రాల్లో నటించి అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించింది. ఎన్నో వైవిధ్య సినిమాల్లో నటించినా పరిశ్రమ మాత్రం సిల్క్ ని శృంగార తారగానే గుర్తించింది. 'సీతాకోకచిలుక' సినిమాలో సహజ నటనతో మెప్పించినా ఒకే రకమైన ముద్ర ఆమెకు మిగిలిపోయింది.తన కళ్ళముందే పనివాడి భార్యతో భర్త గదిలోకి వెళ్ళినప్పుడు- అదే సమయంలో వచ్చిన పనివాడు ముందు కన్నీళ్ళు దాచుకునే సన్నివేశాన్ని అద్భుతంగా చేసింది. కానీ సిల్క్ స్మిత పేరు చెప్పగానే – ఆమె నీలి కళ్ళు తప్ప, కళ్ళ నీళ్ళు గుర్తుకురాలేదెవ్వరికీ.
90ల్లో స్మిత హవా కాస్త నెమ్మదించింది. ఎలాంటి పాత్రలైనా చేయడానికి పెద్ద హీరోయిన్లు ఓకే అనడంతో ఆమె స్టార్ డమ్ తగ్గింది. జీవితం అనే వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కుతున్నా అనుకుంది. కానీ పక్కనే ఉన్ను పాములను గుర్తించలేకపోయింది. అ అద్భుత నటనతో మెప్పించినా డాన్సర్ గానే తప్ప నటిగా నిలదొక్కులేకపోయింది. అవకాశాలు తగ్గడం, కుదురుకోని జీవితం ఆమెను ఆటుపోట్లకు గురిచేసింది. తన ప్రవర్తన కారణంగా సాటి నటుల ఆదరాభిమానాలు పొందలేకపోయిన స్మిత కష్టాల్లో ఒంటరిగా మిగిలిపోయింది. వెలుగులో పక్కనే ఉన్నవాళ్లు చీకట్లో మాత్రం ఆమెను ఒంటరిగా వదిలేశారు. ఒంటరి జీవితం వ్యసనాలవైపు నడిపించింది. నమ్మక ద్రోహం, అప్పుల భారం ఆమెను ఆత్మహత్య కు పురిగొల్పాయి. ఇండియన్ మార్లిన్ మాన్రో గా గుర్తింపు తెచ్చుకున్న స్మిత 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని సొంతింట్లో ఫ్యాన్ కి ఉరేసుకుంది. జీవితంలో ఎదురవుతున్న వరుస వైఫల్యాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె రాసిన నోట్ పోలీసులకు దొరికింది. ‘నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నాను. అతను నన్ను మోసం చేశాడు’ అని ఆమెకి ఐదేళ్ళు పరిచయంఉన్న ఒకరి గురించి లేఖలో ప్రస్తావించింది. అభిమానించే వాళ్లు లేక పడిన బాధ, తననుంచి లబ్ది పొందిన వారు సైతం ముఖం చాటేసిన తీరు. అనుభవించిన కష్టాలపై అంతరంగాన్నిఅందులో ఆవిష్కరించింది. ఆమె మరణంపై మరెన్నో వార్తలు వాదనలు బయటకు వచ్చాయి. అవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. సిల్క్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'డర్టీ పిక్చర్' సూపర్ హిట్టైంది.
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: ‘అఖండ’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అఘోరా ఎంట్రీ చూస్తే పూనకాలేనట!
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిన షూటింగ్, సర్జరీ కోసం అమెరికాకు ప్రయాణం?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి