Akhanda Review 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Nandamuri Balakrishna's Akhanda Review: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్. 'అఖండ'తో మరో హిట్ అందుకుని హ్యాట్రిక్ సాధించారా?
Boyapati Srinu
Balakrishna, Pragya Jaiswal, Srikanth and Others
రివ్యూ: అఖండ
రేటింగ్: 3.25/5
ప్రధాన తారాగణం: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పూర్ణ, జగపతి బాబు తదితరులు
ఎడిటర్: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు
కెమెరా: సి. రామ్ ప్రసాద్
మాటలు: ఎం. రత్నం
సంగీతం: ఎస్. తమన్
నిర్మాణ సంస్థ: ద్వారకా క్రియేషన్స్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల తేదీ: 02-12-2021
నట సింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్. 'సింహ', 'లెజెండ్' సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. మరి, 'అఖండ'తో మరో హిట్ అందుకుని హ్యాట్రిక్ సాధించారా? నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు బాలకృష్ణను ఎలా చూడాలని కోరుకుంటారో... ఆ విధంగా చూపిస్తారని పేరు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి, ఈ సినిమాలో బాలకృష్ణను ఎలా చూపించారు? సినిమా ఎలా ఉంది?
కథ: మురళీ కృష్ణ (బాలకృష్ణ) అనంతపురంలో రైతు. అక్కడి ప్రజలను ఫ్యాక్షన్ నుంచి ఫార్మింగ్ (వ్యవసాయం) వైపు నడిపిస్తూ ప్రజల్లో పేరు తెచ్చుకుంటారు. స్కూల్స్, హాస్పిటల్స్ కట్టిస్తారు. ప్రజలకు మంచి చేస్తుంటారు. అనంతపురం జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ శ్రావణి (ప్రగ్యా జైస్వాల్)కు మురళీ కృష్ణ ఆశయాలు నచ్చుతాయి. అతడికి ఆమె పద్దతి నచ్చుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఓ సారి నల్లమల దగ్గరలో ఓ ఊరి ప్రజలు అంతుచిక్కని వ్యాధులతో మురళీకృష్ణకు చెందిన ఆస్పత్రిలో చేరతారు. వరదరాజులు (శ్రీకాంత్) చేస్తున్న మైనింగ్ అందుకు కారణం అని తెలుస్తుంది. వరదరాజులకు మురళీ కృష్ణ వార్నింగ్ ఇస్తాడు. వెంటనే ఆస్పత్రిలో బాంబ్ బ్లాస్ట్ జరిగి ఓ కేంద్ర మంత్రి భరత్ రెడ్డి (సుబ్బరాజు), నల్లమల ప్రాంత వాసులు మరణిస్తారు. ఆస్పత్రి మురళీ కృష్ణ కట్టించినది కావడంతో అతడిని ఎన్.ఐ.ఏ అధికారులు అరెస్ట్ చేస్తారు. బాంబ్ బ్లాస్ట్‌కు కారణం ఎవరు? వరదరాజులు వెనుక ఉన్నది ఎవరు? మురళీ కృష్ణ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు కాపాడిన అఖండ రుద్ర సికిందర్ ఘోరా (బాలకృష్ణ) ఎవరు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: బాలకృష్ణ, బోయపాటి సినిమా అంటే అభిమానులతో పాటు ప్రేక్షకులు ముందుగా ఆలోచించేది... బాలకృష్ణ పాత్ర ఎలా ఉంది? బాలకృష్ణను బోయపాటి ఎలా ప్రజెంట్ చేశారు? అని! 'సింహ', 'లెజెండ్' సూపర్ సక్సెస్‌లు సాధించడంతో పాటు అందులో క్యారెక్టర్లు సూపర్ హిట్ అవ్వడంతో ఈసారి ఎలా చూపించారు? అనే ఆసక్తి మొదలైంది. అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడంలో బోయపాటి శ్రీను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. మురళీ కృష్ణగా బాలకృష్ణ క్యారెక్టర్ మాసీగా ఉంటుంది. అటువంటి క్యారెక్టర్లలో ఆయన్ను ప్రేక్షకులు గతంలో చూశారు. అయితే... మురళీ కృష్ణ ఇంట్రడక్షన్ ఫైట్ అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చుతుంది. అటు మాసీగానూ, ఇటు క్లాసీగానూ తీశారు. బసవన్నలు (ఎద్దులు) రావడం... ఆ తర్వాత ఫైట్ అంచనాలకు తగ్గట్టు ఉంటుంది. సినిమాలో మిగతా ఫైట్స్, యాక్షన్ సీన్స్‌నూ బోయపాటి శ్రీను బాగా డిజైన్ చేయించుకున్నారు. రామ్ - లక్ష్మణ్ మాస్టర్లు, స్టన్ శివ యాక్షన్ కొరియోగ్రఫీ మాస్ కమర్షియల్ సినిమాకు తగ్గట్టు ఉంటుంది. అఖండ ఇంట్రడక్షన్ ఫైట్, క్లైమాక్స్‌లో టెంపుల్ ఫైట్ డిఫరెంట్‌గా ఉంటాయి.
అఖండగా బాలకృష్ణ మాత్రమే నటించగలరు అన్నంతగా ఆయన నటన ఉంది. శివుడు, ప్రకృతి, దైవం గురించి చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. అఖండగా హావభావాల పరంగానూ వైవిధ్యం చూపించారు. అవసరమైన చోటు సెటిల్డ్‌గా నటించారు. యాక్షన్ దృశ్యాల్లో రుద్రతాండవం చేశారు. రెండు పాత్రల్లో యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ పరంగా వేరియేషన్ చూపించారు. హీరోగా సినిమాకు హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశారు. బాలకృష్ణ అభిమానులకు ఈ సినిమా పండగ అని చెప్పాలి. బాలకృష్ణకు జంటగా నటించిన ప్రగ్యా జైస్వాల్ అందంగా, హుందాతనంగా కనిపించారు. ఇద్దరి జోడీ బావుంది. అయితే... వాళ్ల కథను ఓ పాటకు పరిమితం చేశారు. విలన్‌గా శ్రీకాంత్ గెటప్ కొత్తగా, కొంత క్రూరంగా ఉంది. నటుడిగా అంత కన్వీన్సింగ్‌గా లేదు. జగపతిబాబు స్వామిజీగా కనిపించారు. పూర్ణ, సుబ్బరాజ్, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
బాలకృష్ణ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తర్వాత సినిమాకు హైలైట్ ఎస్.ఎస్. తమన్ సంగీతం. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. పాటల్లో 'అడిగా... అడిగా', 'భం... భం... అఖండ' బావున్నాయి. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. యాక్షన్ దృశ్యాలను బోయపాటి శ్రీను అభిమానులు, ప్రేక్షకులు కోరుకున్నట్టు తీసినా... ఒక దశకు వచ్చేసరికి మోతాదు పెరిగినట్టు అనిపిస్తుంది. హింస ఎక్కువైనట్టు ఉంటుంది. యాక్షన్ దృశ్యాల మధ్యలో కథను తక్కువ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. బోయపాటి శ్రీను ఎంపిక చేసుకున్న కథాంశం బావుంది. ఓ తల్లికి పుట్టిన కవలల్లో ఒకరు జన్మించిన మరుక్షణం స్వామీజీల చెంతకు చేరి అఖండగా మారడం అనేది కొత్త పాయింట్. అయితే... అఖండ ఎంట్రీ తర్వాత కథను చెప్పడంలో కొంత అస్పష్టత ఉంది. పంచభూతాలు సైతం అఖండకు తల వంచుతాయని డైలాగుల్లో చెప్పారు. కానీ, ఆ యాంగిల్ ఇంకా ఎలివేట్ చేస్తే బావుండేది. మరింత కొత్తగా ఉండేది. అఖండ తన కుమారుడు అని తెలిసిన తర్వాత మదర్ సెంటిమెంట్ యాంగిల్ తీసుకొచ్చారు. అది అంతగా పండలేదు. అయితే... అఖండకు, పాపకు మధ్య సన్నివేశాల్లో ఎమోషన్ పండింది. ముఖ్యంగా ఎండింగ్ సీన్! అది సీక్వెల్‌కు ఆస్కారం ఉందనే హింట్ ఇచ్చింది. కథ, ఎమోషన్స్ పరంగా 'సింహ', 'లెజెండ్' సినిమాలతో పోలిస్తే... 'అఖండ'లో కొంత తక్కువ అని చెప్పాలి. కథ, లాజిక్కుల గురించి బోయపాటి శ్రీను సినిమా నుంచి ఆశించడం అత్యాశే అవుతుంది.
ఓవరాల్‌గా చూస్తే... 'అఖండ' పక్కా కమర్షియల్ సినిమా. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆశించే సినిమా. మాస్ జాతర... బాలకృష్ణ మాస్ జాతర. ఈ సినిమాకు బాలకృష్ణ యాక్టింగ్, ఆయన వన్ మ్యాన్ షో హైలైట్.