Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Telugu States CMs: మాజీ ప్రధాని మన్మోహన్ పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. దేశం ఓ గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Chandrababu And Revanth Reddy Final Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు (CM Chandrababu), రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఆయన మృతితో దేశం ఓ గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మన్మోహన్ మరణం బాధాకరమని.. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని.. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, శబరి.. మన్మోహన్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు గారు నివాళి అర్పించారు. మన్మోహన్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని, ఆధార్, ఉపాధి హామీ సహా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ గారికి దక్కుతుందని, దూరదృష్టితో… pic.twitter.com/LkHt4THmLa
— Telugu Desam Party (@JaiTDP) December 27, 2024
అటు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం మన్మోహన్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. బెళగావి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన సీఎం.. అక్కడి నుంచి మన్మోహన్ నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి అంజలి ఘటించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు ఎంపీలు, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు… pic.twitter.com/3rWqjHN347
— Telangana CMO (@TelanganaCMO) December 27, 2024
మన్మోహన్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు
అటు, మన్మోహన్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించనున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని.. ఆయనతో తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 'తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకూ మన్మోహన్ అందించిన సహకారం తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సమయంలో ప్రతీ సందర్భంలోనూ మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగింది. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో ఆయన అందించిన సహకారం మరువలేనిది. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్‌కు బీఆర్ఎస్ తరఫున ఘన నివాళులు.' అని కేసీఆర్ పేర్కొన్నారు.