Ganesh Chaturthi 2024: బొజ్జ గణపయ్య మీద వచ్చిన పాటలే కాదు, సినిమాలూ బ్లాక్ బస్టర్ హిట్టే- ఇంతకీ అవేంటో తెలుసా?
గణపతి పండుగ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. చిన్నా పెద్దా కలిసి అట్టహాసంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. బొజ్జ గణపతి పేరుతో వచ్చిన సినిమాలతో పాటు పాటలూ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇంతకీ అవేంటంటే..
Ganesh Chaturthi 2024: వినాయక చవితి వచ్చిందటే చాలు, ఊరూ వాడా సంబురాలతో మార్మోగుతుంది. గల్లీ గల్లీకో వినాయకుడు వెలుస్తాడు. తొమ్మిది రోజుల పాటు బొజ్జ గణపయ్య ఘనంగా పూజలందుకుంటాడు. తెలుగు సినిమాల్లోనూ గణనాథుడికి మాంచి క్రేజ్ ఉంది. ఆయన పేరుతో వచ్చిన సినిమాలతో పాటు పాటలూ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆయా సినిమాల్లోని పాటలు ఇప్పటికీ గణేషుడి మండపాల్లో మార్మోగుతుంటాయి. ఇంతకీ గణపతి పేరుతో వచ్చిన సినిమాలు, పాటలు ఏవో ఇప్పుడు చూద్దాం..
*గం గం గణేశా
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ ప్రధాన పాత్రలో ‘గం గం గణేశా‘ సినిమా తెరకెక్కింది. ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించిన ఈ సినిమా గణపతి చుట్టూ తిరుగుతుంది. మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏడు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రం దాచిన వినాయక విగ్రహం కేంద్రంగా నడుస్తుంది. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే ఆనంద్ దేవరకొండ, పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. అందులో భాగంగానే రూ. 7 కోట్ల విలువైన వజ్రాన్ని దొంగతనం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆనంద్ దొంగతనం చేసిన వజ్రం అనుకోకుండా వినాయకుడి విగ్రహంలో పడిపోతుంది. ఆ వజ్రాన్ని గణేష్ విగ్రహం నుంచి ఎలా కొట్టేస్తాడు? ఆ కొట్టేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? అనేది ఈ సినిమాలో చూపించారు.
*వినాయక చవితి
తెలుగు సినిమా పరిశ్రమలో వినాయకుడి కథతో వచ్చిన తొలి సినిమా ‘వినాయక చవితి. సముద్రాల రాఘవాచార్య తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల కీలక పాత్రలు పోషించారు. కె. గోపాలరావు నిర్మాతగా వ్యవహరించారు. 1957 ఆగస్టు 22న విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. వినాయక చతుర్ధి రోజున శ్రీకృష్ణుడు పాలలో చంద్రుడిని చూస్తాడు. దీంతో శమంతకమణిని దొంగిలించాడనే అపవాదు పడుతుంది. ఆ తర్వాత కృష్ణుడు వినాయక వ్రతం చేసి, ఆ పఖ్యాతి నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమాలో చూపించారు.
*భూకైలాస్
కె శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భూ కైలాస్’. 1985 మార్చి 20న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ రావణుడిగా, ఏఎన్నార్ నారదుడిగా కనిపిస్తారు. గొప్ప శివభక్తుడు అయిన రావణుడు, తల్లి కోరిక మేరకు ఆత్మలింగాన్ని తెస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆత్మలింగం సాధించి అమరుడిగా మిగలాలని తపస్సు మొదలు పెడతాడు. ఆయన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు రావణుడికి ఆత్మలింగాన్ని అందిస్తాడు. కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ నేల మీద పెట్టకూడదంటాడు. ఈ ఆత్మలింగంతో రావణుడు భూలోకాన్ని నాశనం చేస్తాడని భావించిన నారదుడు, ఎలాగైనా ఆత్మలింగాన్ని లంకకు చేరకుండా అడ్డుకోవాలని వినాయకుడి వేడుకుంటాడు. రావణుడు సంధ్యావందనం చేసే సమయంలో ఆత్మలింగం నేల మీద పడేలా చేస్తాడు వినాయకుడు. భూలోకాన్ని కాపాడుతాడు.
*శ్రీ వినాయక విజయం
పూర్తి వినాయకుడి కథతో తెరకెక్కిన తొలి తెలుగు సినిమా ‘శ్రీ వినాయక విజయం’. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. కృష్ణం రాజు, వాణిశ్రీ జంటగా నటించారు. 1979 డిసెంబరు 22న ఈ సినిమా విడుదల అయ్యింది. ఇందులో కృష్ణం రాజు, వాణిశ్రీ శివపార్వతుల పాత్రలు పోషించారు. శివ వ్రతాన్ని చేసేందుకు పార్వతీదేవి స్నానమాచరించాలని భావిస్తుంది. అప్పుడు పిండితో ఓ బాలుడిని తయారు చేసి, దానికి ప్రాణం పోస్తుంది. ఎవరినీ లోపలికి రాకుండా కాపలా ఉంచుతుంది. అదే సమయంలో శివుడు అక్కడికి వస్తాడు. ఎంతకీ లోపలికి అనుమతించకపోవడంతో బాలుడి తల ఖండిస్తాడు. పార్వతి బాలుడి మరణాన్ని తట్టుకోలేదు. ఎలాగైనా ప్రాణం పోయాలని కోరుకుంటుంది. అప్పుడు ఏనుగు తలను తీసుకొచ్చి బాలుడికి అమర్చి ప్రాణం పోస్తాడు. అప్పుడు ఆ బాలుడు గణనాథుడిగా మారి తొలి పూజలు అందుకుంటాడు.
మంచి ప్రేక్షకాదరణ పొందిన గణపతి పాటలు ఇవే..
తెలుగు సినిమాల్లో గణేషుడిపై బోలెడు పాటలు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా ‘కూలీ నెంబర్ 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాట ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. ఇప్పటికీ ప్రతి గణపతి మండపంలో ఈ పాట మార్మోగుతుంది. ఇక చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ సినిమాలోని ‘జై జై గణేషా.. జైకొడతా గణేషా..’ అనే పాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘డిక్టేటర్’ మూవీలోని ‘గం గం గణేషా..’ ‘భగవంత్ కేసరి’ సినిమాలోని గణేష్ ఆంథమ్ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘దేవుళ్లు’ సినిమాలోని ‘జయ జయ శుభకర వినాయక..’ ఆల్ టైమ్ హిట్ గా చెప్పుకోవచ్చు. రామ్ హీరోగా నటించిన ‘గణేష్’ మూవీలో ‘రాజా మహరాజా’ అంటూ సాగే వినాయకుడి పాట మంచి హిట్ అయ్యింది. వీటితో పాటు తెలుగులో తెరకెక్కిన మరికొన్ని పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Read Also: వినాయక చవితి జీవిత పాఠాలు నేర్పే వెబినార్- గణేషుడు నేర్పే లెసెన్స్ ఇవే!