Crime News: దారుణం.. వివాహితను బంధించి, కడుపు మాడ్చటంతో ఎముకల గూడులా మారి మృతి
Domestic Violence | భారీగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసినా అల్లుడు బుద్ధి చూపించాడు. రెండేళ్ల తరువాత అల్లుడి నుంచి ఫోన్ వస్తే వెళ్లిన అత్తామామలు షాకయ్యారు. ఎముకల గూడుగా మారి కూతురు చనిపోయింది.

Bhadradri Kothagudem district | అశ్వారావుపేట: గత రెండు సంవత్సరాలుగా తమ కుమార్తెను చూడలేకపోయారు ఆ తల్లిదండ్రులు. ఒక్కసారిగా అల్లుడి ఫోన్ కాల్‌తో షాక్‌కి గురయ్యారు. మెట్లపైనుంచి జారి పడిపోయింది, ఆసుపత్రిలో చేర్పించాం అని చెప్పడంతో ఏం జరిగిందోనని కూతుర్ని చూడబోతున్నామని తొందరగా అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడ తమ కళ్ల ముందే ఎముకల గూడుగా మారి, ప్రాణం లేని కుమార్తె కనిపించడంతో వారు జీర్ణించుకోలేకపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
మూడేళ్ల కిందట అక్కా బావ ఇంటికి మకాం..
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరం పంచాయతీ పరిధిలోని విశ్వన్నాథంపురం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న (33)ను 2015లో అదే మండలం ఖాన్‌ఖాన్‌పేటకు చెందిన పూల నరేశ్‌బాబుకు ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడాది తరువాత దంపతులకు ఒక కుమార్తె పుట్టింది. మొదట 6 సంవత్సరాల పాటు లక్ష్మీప్రసన్న తన భర్తతో కలిసి అత్తమామల ఇంట్లోనే ఉన్నది. నరేశ్ బాబు మూడేళ్ల కిందట తన భార్య, బిడ్డతో పాటు అశ్వారావుపేటకు వచ్చి అక్క, బావ ఇంట్లో ఉంటూ వచ్చారు.
మెట్లపై నుంచి జారి పడిందని అత్తామామలకు ఫోన్
నరేశ్ బాబు శనివారం నాడు లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పాడు. మెట్లపై నుంచి జారి పడిపోయవడంతో లక్ష్మీప్రసన్నకు గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాం అని తెలిపాడు. అల్లుడి నుంచి ఫోన్ వచ్చిన వెంటనే బయలుదేరి ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు అప్పటికే కూతురు చనిపోయినట్లు గుర్తించారు. అంతేకాదు శరీరం ఎముకల గూడుగా మారడం.. పలుచోట్ల ఎన్నో గాయాలు కనిపించడంతో వారి ఆవేదన వర్ణణాతీతం. రెండేళ్ల తరువాత కుమార్తెను చూస్తున్నామని వెళ్లిన తల్లిదండ్రులు మృతదేహంగా, అది కూడా దారుణమైన స్థితిలో చూసేసరికి తట్టుకోలేకపోయారు.
అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదు
లక్ష్మీప్రసన్నను అదనపు కట్నం కోసం ఆమె భర్త నరేశ్ బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క భూలక్ష్మి, బావ శ్రీనివాసరావు తీవ్రంగా హింసించారని మృతురాలి తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీప్రసన్న వివాహ సమయంలో 2 ఎకరాల మామిడి తోట, అర ఎకరం పొలంతో పాటు రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షల బంగారం వరకట్నంగా ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. అశ్వారావుపేటకు వచ్చిన మొదటి ఏడాది వరకు కుమార్తెను చూశాం, ఆమె తమతో మాట్లాడేదని వెంకటేశ్వరరావు చెప్పారు. కానీ గత 2 సంవత్సరాలుగా లక్ష్మీప్రసన్నను తమతో మాట్లాడనివ్వలేదని, ఫోన్ చేసినా వేరే చోట ఉందని అబద్ధాలు చెబుతూ వచ్చాడన్నారు. అదనపు కట్నం కోసం గృహ నిర్బంధం చేసి తిండి పెట్టకుండా హింసించి తన కుమార్తెను చంపేశారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.
అయితే మృతురాలి భర్త నరేశ్ బాబు బావ మాత్రం.. లక్ష్మీప్రసన్నకు రక్తహీనత, థైరాయిడ్ లాంటి అనారోగ్య సమస్యలు ఉండేవన్నారు. లక్ష్మీప్రసన్నను వారి తల్లిదండ్రులకు మేం చూపించలేదు, మాట్లాడించలేదు అనడంలో నిజం లేదన్నారు.






















