Ghaati Movie: అనుష్క పవర్ ఫుల్ 'ఘాటి' - కర్ణాటకలో రిలీజ్ చేయనున్న స్టార్ హీరో మదర్
Ghaati Release: స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' మూవీని కన్నడలో స్టార్ హీరో తల్లి రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నారు.

Pushpa Arun Kumar To Release Ghaati In Karnataka: టాలీవుడ్ స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి'. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
కన్నడలో స్టార్ హీరో తల్లి ఆధ్వర్యంలో
ఈ మూవీని కర్ణాటకలో కన్నడ స్టార్, కేజీఎఫ్ లెజెండ్ యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం కన్నడ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఆమె తన కొత్త ప్రొడక్షన్ వెంచర్ పీఏ ఫిల్మ్స్ ద్వారా కొనుగోలు చేశారు. పుష్ప అరుణ్ కొత్తగా సినిమా పంపిణీలోకి అడుగుపెట్టగా... ఆమెకు కర్ణాటకలో ఇదే ఫస్ట్ రిలీజ్ కానుంది.
స్వీటీకి వీరాభిమాని...
స్వతహాగా స్వీటీ అనుష్కకు వీరాభిమాని అయిన పుష్ప అరుణ్ కుమార్... 'ఘాటి'లో అనుష్క పవర్ ఫుల్ లుక్స్, రోల్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చూసి మరింత ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని పవర్ ఫుల్ రోల్‌లో అనుష్క నటిస్తుండడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీతోనే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు తనకు సరైందని పుష్ప అరుణ్ కుమార్ భావించారట. దీంతో ఈ మూవీని కన్నడలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఈ మూవీలో అనుష్కతో పాటు చైతన్యరావు, విక్రమ్ ప్రభు, రవీంద్ర విజయ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఘాటి ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా ప్రధానాంశంగా సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. బస్ కండక్టర్ రోల్ చేస్తూనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్‌గా కనిపించారు స్వీటీ. ఫస్ట్ లుక్‌లో ఓ మనిషి పీక కోస్తూ భయపెట్టగా... ట్రైలర్ అంతకు మించి అనేలా ఆమె నట విశ్వరూపాన్ని చూపించారు.
అసలు 'ఘాటి' అంటే ఏంటి?
'ఘాటి' అంటే రెండు కొండల మధ్య ఎత్తైన మార్గం. కొండ ప్రాంతంలో గంజాయి సాగు, అక్రమ రవాణా... స్మగ్లర్లను పట్టుకోవాలని చేజ్ చేసే పోలీసులు, మాఫియా కోరల్లో చిక్కుకుని పోలీసులకు దొరక్కుండా సరుకును చేర్చే ఘాటీలు ఇదే స్టోరీ లైన్‌తో మూవీ సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. స్మగర్ల ముఠా నుంచి తనను నమ్ముకున్న వారిని ఓ సాధారణ మహిళ ఎలా ప్రాణాలకు తెగించి కాపాడారో అనేదే మూవీ స్టోరీ అని తెలుస్తోంది. ఓ సాధారణ మహిళ అసాధారణ పోరాటమే 'ఘాటి'. మరి ఆ పవర్ ఫుల్ యాక్షన్ చూడాలంటే సెప్టెంబర్ 5 వరకూ వెయిట్ చేయాల్సిందే.





















