Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు
నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ ఎప్పటినుంచి మొదలవుతాయో త్వరలోనే తెలియజేస్తామని అన్నారు దిల్ రాజు.
ఆగస్టు 1నుంచి సినిమా షూటింగులు బంద్ అయిన సంగతి తెలిసిందే. అయితే రెండు, మూడు రోజులుగా సినిమా షూటింగ్స్ మొదలుకానున్నాయని.. ఆగస్టు 22నుంచి అన్ని సినిమాలు షూటింగులు జరుపుకోనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. కాసేపటి క్రితం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ ఎప్పటినుంచి మొదలవుతాయో త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. ఆగస్టు 1నుంచి షూటింగులు ఆపేసి కమిటీలు వేసుకున్నామని.. నిర్మాతలంతా కలిసి తీసుకున్న నిర్ణయమిది అని చెప్పారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై గత 18 రోజులుగా వివిధ విభాగాలతో జరుగుతున్న చర్యలు ఓ కొలిక్కి వస్తున్నాయని.. నిర్మాతలుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.
ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు:
ఓటీటీల విడుదలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు దిల్ రాజు. థియేట్రికల్ రిలీజ్ తరువాత ఎనిమిది వారాలకు లేదంటే 50 రోజుల తరువాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే ఓటీటీలతో అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలను ఈ రూల్ వర్తించదని వెల్లడించారు. మిగిలిన సినిమాల విషయంలో ఈ రూల్ కచ్చితంగా పాటించాల్సిందేనని తెలిపారు.
టికెట్ రేట్లు తగ్గిస్తాం:
కొన్నాళ్లుగా సినిమా టికెట్ రేట్లు పెంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెనింగ్స్ తగ్గడానికి కూడా పెరిగిన టికెట్ రేట్లే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కూడా గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో చర్చలు జరిపినట్లు తెలిపారు దిల్ రాజు. సినిమా టికెట్ రేట్లు, అలానే ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గించాలని థియేటర్ యాజమాన్యాలను రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలపై కూడా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Dil Raju about Telugu film industry Problems: నిర్మాణ ఖర్చులు వృధాపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో, ఛాంబర్ తో ఒప్పందం కుదిరిందని.. దర్శకులు, ఇతర విభాగాలతో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మరో నాలుగు రోజులపాటు వరుసగా మీటింగ్స్ కొనసాగుతాయని చెప్పారు. ఫెడరేషన్ తో మరో రెండు మీటింగ్స్ ఉన్నట్లు తెలిపారు. కార్మికుల జీతాలు పెంచడానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ వర్కింగ్ కండీషన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు చెప్పారు.
ఇదే సమయంలో హిందీ సినిమా ఇండస్ట్రీ సౌత్ సినిమా ఇండస్ట్రీల వైపు చూస్తుందని.. మనం తీసుకున్న నిర్ణయాలను వారు అధ్యయనం చేసి.. తమ ఇండస్ట్రీలో ఆ రూల్స్ ను తీసుకురావాలని అనుకుంటున్నాయని చెప్పారు. సినిమా షూటింగ్స్ ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. అన్ని సమస్యలకు పరిష్కారం దొరికిన తరువాత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.
Also Read: తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?
Also Read: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?