YVS Chowdary: ఆయనకు జూ.ఎన్‌టీఆర్ ఇష్టమైన మనవడు కాదు, మహేశ్‌లో ఆ లక్షణాలు ఉన్నాయి - వైవీఎస్ చౌదరీ
YVS Chowdary: సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరీ తన అప్‌కమింగ్ మూవీ కోసం ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. అందులో ఎన్‌టీఆర్ కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
YVS Chowdary: టాలీవుడ్‌లో సీనియర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వైవీఎస్ చౌదరీ గత కొన్నాళ్లుగా అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. మళ్లీ చాలాకాలం తర్వాత సీనియర్ ఎన్‌టీఆర్ మునిమనవడు ఎన్‌టీఆర్‌ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. హరికృష్ణ మనవడు, జానకి రామ్ కుమారుడు అయిన నందమూరి తారక రామారావుతో మూవీ చేయడానికి వైవీఎస్ చౌదరీ సిద్ధమయ్యారు. తాజాగా ఈ మూవీ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నందమూరి కుటుంబం గురించి, తను పరిచయం చేసిన హీరోల గురించి, సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైవీఎస్ చౌదరీ.
సర్టిఫికెట్ ఇవ్వొద్దు..
సీనియర్ ఎన్‌టీఆర్‌కు ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్‌టీఆర్ అని వ్యక్తి వ్యాఖ్యలు చేయగా.. దానిపై ఘాటుగా స్పందించారు వైవీఎస్ చౌదరీ. ‘‘ఆయనకు ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు? నేనొకటి చెప్తాను, రేపు అది పెద్ద ప్యారాతో ప్రింట్ చేస్తారా? ఎన్‌టీఆర్‌కు ఈయనే ఇష్టమైన మనవడు అంటే మిగతా మనవళ్లు ఇష్టం లేదనా? మీరు ప్రశ్నించేటప్పుడు సర్టిఫికెట్ ఇవ్వకండి. జూనియర్ ఎన్‌టీఆర్ కూడా ఆయనకు నేనొక్కడినే ఇష్టమైన మనవడిని ఎప్పుడూ చెప్పలేదు. సీనియర్ ఎన్‌టీఆర్‌కు అందరూ సమానమే’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు వైవీఎస్ చౌదరీ. తను పరిచయం చేసిన హీరోల గురించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
నా హృదయంలో ఉంటారు..
‘‘నేను హీరోలుగా పరిచయం చేసిన రామ్, ఆదిత్య ఓం, సాయి ధరమ్ తేజ్, హరికృష్ణ.. వీరందరూ నా హృదయంలో టాటూలాగా ఉంటారు. రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ బ్లాక్‌బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా రూమ్‌మేట్ రవితేజ కూడా నా హృదయంలో ఉంటాడు. అతని సినిమా కూడా హిట్ అవ్వాలి. రవితేజ ఎంత కష్టపడి పైకొచ్చాడో నాకు తెలుసు. అతడు పడిన ప్రతీ కష్టం వెనకాల నేను కూడా ఉన్నాను. ప్రత్యక్ష, పరోక్ష సాక్షిగా ఉన్నాను. నేను, రవితేజ ఎనిమిదేళ్లు రూమ్‌మేట్స్‌గా ఉన్నాం’’ అని గుర్తుచేసుకున్నారు వైవీఎస్ చౌదరీ. తనకు దగ్గరయిన రామ్, రవితేజ.. ఇద్దరి సినిమాలు హిట్ అవ్వాలని వైవీఎస్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు.
మహేశ్‌లో ఆ లక్షణాలు..
మహేశ్ బాబుతో చేసిన ‘యువరాజు’ సినిమా జ్ఞాపకాలను వైవీఎస్ గుర్తుచేసుకున్నారు. ‘‘ఘట్టమనేని వారసుడిగా మహేశ్ బాబు వచ్చి సూపర్ స్టార్ అవుతాడని చాలామంది ఊహించారు. నాతో యువరాజు సినిమా చేయడానికి మహేశ్ ఒప్పుకోవడం నేను అదృష్టంగా ఫీలయ్యాను. తనకోసం ఎన్నో సినిమాలు రెడీగా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఒక రిస్క్‌తో ఉన్న ఎలిమెంట్‌ను ఒప్పుకోవడం గొప్పగా ఫీలయ్యాను. కృష్ణుడి పాత్ర చేయాలంటే మీసాలు లేకుండా చిరునవ్వుతో అందంగా కనిపించాలి. పెదవుల దగ్గర బాగుండాలి. అలాంటి లక్షణాలు మహేశ్ బాబుకు చాలా ఉన్నాయి. అందుకే నేను పట్టుబట్టి యువరాజు సినిమాలో ఆయనను ఒప్పించి కృష్ణుడి గెటప్‌లో చూసుకున్నాను. ఇప్పుడు మహేశ్ బాబు కృష్ణుడి పాత్ర చేస్తే చూడాలని అనుకుంటున్నాం అని సోషల్ మీడియా హల్‌చల్ అవుతోంది’’ అని తెలిపారు.
Also Read: ‘మురారి’ చూస్తూ థియేటర్‌లోనే పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు అభిమాని - వీడియో వైరల్