Kerala Theaters: మలయాళీ సినిమాలకు కష్టాలు - థియేటర్లు బంద్, ఆ మూవీ కలెక్సన్స్‌కూ బ్రేక్!
కేరళ థియేటర్ల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ్టి(ఫిబ్రవరి 22) నుంచి మలయాళీ సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
Sensational Decision Of The Owners Of Kerala Theaters: కేరళ సినిమా పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్ల యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మలయాళీ సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఫిబ్రవరి 22 నుంచి మాలీవుడ్‌కు చెందిన సినిమాల ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEOUK) కీలక ప్రకటన చేసింది. థియేటర్ యజమానులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆ సినిమాలను ప్రదర్శించబోమని తేల్చి చెప్పింది.
సినిమాల ప్రదర్శన నిలిపివేతకు కారణం ఏంటంటే?
గత కొంత కాలంగా కేరళలో ఓటీటీల వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో థియేటర్లలో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పనిలో పనిగా ఫిల్మ్ మేకర్స్ సైతం సినిమా థియేటర్లలో విడుదలయ్యాక నెల రోజుల్లోనే ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. దీంతో థియేటర్ యాజమాన్యాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాస్తవానికి థియేటర్ల యాజమాన్యాలు, సినీ నిర్మాతలకు మధ్య ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి కీలక ఒప్పదం జరిగింది. ఒక సినిమా థియేటర్ లో విడుదలయ్యాక 42 రోజుల తర్వాతే ఓటీటీలకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే చాలా మంది సినీ నిర్మాతలు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. నెల రోజుల్లోనే తమ సినిమాలను ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (KFPA) వైఖరికి వ్యతిరేకంగా థియేటర్ యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. ఫిబ్రవరి 22 నుంచి మలయాళీ సినిమాలను ప్రదర్శించబోమని తేల్చి చెప్పాయి.
థియేటర్ యాజమాన్యాల తీరును ఖండించిన ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్
మలయాళ సినిమాలను నిషేధిస్తూ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEOUK) తీసుకున్న నిర్ణయాన్ని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) తీవ్రంగా ఖండించింది. సినిమా పరిశ్రమ, సినిమా ఉద్యోగులు, సినీ ప్రియులతో పాటు సమాజం పట్ల ధిక్కార ధోరణిగా అభివర్ణించింది. FEOUK నిర్ణయం తీవ్ర అభ్యంతరకరమైనదిగా వెల్లడించింది. థియేటర్ యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం పట్ల మలయాళీ సినిమా పరిశ్రమతో పాటు, దాని సాంకేతిక నిపుణులు, కళాకారులు, ఇతర ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇది మలయాళీ సినిమా పరిశ్రమను అవమానించినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ చిత్రాలను ప్రదర్శించకూడదనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEOUK)ని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) కోరింది. అయితే, తమ సమస్యలను కూడా అర్థం చేసుకోవాలని FEOUK చెప్పింది. సినీ నిర్మాతల ధోరణికి విసుగు చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదే విషయాన్ని నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తే బాగుంటుందని వెల్లడించింది.
Read Also: నెలకు రూ.35 లక్షలు - ఆ ఛాన్సు వదులుకొని అష్టకష్టాలు పడ్డా: ‘12Th ఫెయిల్’ హీరో ఆవేదన