Vijay Devarakonda: సమంత పేరు మీద ఇడ్లీ స్టాల్ పెట్టాలని ప్లాన్ చేశాం, కానీ..: విజయ్ దేవరకొండ
తాజాగా ‘ఖుషి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఒకవేళ సమంత లేకపోయింటే ‘ఖుషి’ ఎలా ఉండేది అన్న విషయంపై ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పందించాడు.
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషీ’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ పెయిర్ చాలా రిఫ్రెషింగ్‌గా, క్యూట్‌గా అనిపిస్తోందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సారి వీరిద్దరు కచ్చితంగా హిట్ కొడతారని అంటున్నారు. ట్రైలర్ రిలీజ్‌లో భాగంగా విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఒకవేళ సమంత లేకపోయింటే ‘ఖుషి’ ఎలా ఉండేదో చెప్పాడు.
‘ఖుషి’ షూటింగ్ ప్రారంభమయినప్పటి నుంచి అసలు సమంత ఈ సినిమాను పూర్తి చేస్తుందా లేదా అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే అప్పుడే సామ్‌కు మాయాసిటీస్ ఉందనే విషయం బయటపెట్టింది. అది క్యూర్ అవ్వాలంటే తనకు చికిత్స అవసరమని కూడా చెప్పింది. దీంతో సమంత ఇక ‘ఖుషి’లో భాగం కాకపోవచ్చని అందరూ సందేహం వ్యక్తం చేశారు. మధ్యమధ్యలో ‘ఖుషి’ షూటింగ్ ఆగిపోయిందని కూడా రూమర్స్ వచ్చాయి. దానికి మూవీ టీమ్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందరి సందేహాలకు చెక్ పెడుతూనే ఉంది. కానీ ఎంతైనా సమంత కోసం ‘ఖుషి’ టీమ్ కొంతవరకు షూటింగ్ నిలిపివేసి వెయిట్ చేసింది అన్నది నిజమే. మరి సమంత కోసం ఎందుకు వెయిట్ చేశారని ఈవెంట్‌లో విజయ్‌కు ప్రశ్న ఎదురయ్యింది. దానికి తను చాలా సరదాగా సమాధానం చెప్పాడు.
పదేళ్లయినా సరే..
‘మాకు వెయిట్ చేయడం ఓకే. మాకేం కంగారులేదు. తను సినిమాకు ఎంత ప్రాణం పోస్తుందో మాకు తెలుసు. అందుకే ఆరు నెలలు కాదు.. సంవత్సరం కాదు.. అవసరమైతే పదేళ్లయినా వెయిట్ చేద్దామని నేను డైరెక్టర్ శివతో అన్నాను. సమంత బ్రేక్ తీసుకొని హెల్త్‌పై ఫోకస్ చేయాలి అనుకునే సమయానికి ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయ్యింది. ఇక సెకండ్ హాఫ్‌ను 10 ఏళ్ల తర్వాత షూట్ చేసి డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిద్దామా అని సరదాగా మాట్లాడుకునేవాళ్లం. జోక్‌లు వేసి నవ్వుకునేవాళ్లం. అంతే కాకుండా ఇలాగే కొన్నాళ్లు కొనసాగితే.. విజయవాడ హైవే మీద సమంత ఇడ్లీ స్టాల్ అని పెడదాం. దానివల్ల అయినా డబ్బులు వస్తాయి అని ఐడియాలు కూడా వేసుకునేవాళ్లం’ అని విజయ్ దేవరకొండ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.
ట్రైలర్‌లోనే మొత్తం కథ..
శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఖుషి’ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో వ్యూస్, లైక్స్ విషయంలో దూసుకుపోతోంది. శివ నిర్వాణ లవ్ స్టోరీని తెరకెక్కించాడంటే.. అది చాలావరకు యూత్‌కు కనెక్ట్ అయిపోతుంది. ‘ఖుషి’ ట్రైలర్ చూస్తుంటే.. ఇది కూడా అలాంటి ఒక లవ్ స్టోరీ అనే అనిపిస్తోంది. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన స్టోరీ దాదాపుగా ట్రైలర్‌లోనే రివీల్ అయిపోయింది. రెండు వేర్వేరు కులాలకు చెందిన ప్రేమికులు.. ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ప్రతీ కపుల్‌లాగానే గొడవపడడం.. ఇదంతా ట్రైలర్‌లో క్లియర్‌గా చూపించారు. కాకపోతే ఇందులో విజయ్, సమంత జోడీకి మాత్రం నూటికి నూరు శాతం మార్కులు పడుతున్నాయి. సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు మరెన్నో ఇతర భాషల్లో కూడా విడుదలకు ‘ఖుషి’ సిద్ధమవుతోంది.
Also Read: ధనుష్ సినిమా కోసం భారీ ప్లాన్ - సౌత్ ఇండియాలో 3500 థియేటర్లలో...
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial