TFCC: షూటింగ్స్ బంద్ - టాలీవుడ్ ఫిలిం చాంబర్ సంచలన నిర్ణయం
Telugu Film Chamber: వేతనాలు పెంచాలన్న ఫిలిం ఫెడరేషన్ డిమాండ్‌పై తెలుగు ఫిలిం చాంబర్ స్పందించింది. ఆ నిర్ణయం సరి కాదని... ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతకు ఉందని తెలిపింది.

TFCC Key Decision On Cine Workers Strike: తమకు 30 శాతం వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో షూటింగ్స్ బంద్ చేసిన టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ వైఖరిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినీ కార్మికుల వేతన పెంపును ప్రొడ్యూసర్స్ వ్యతిరేకించినట్లు టీఎఫ్‌సీసీ తెలిపింది. గత కొద్ది రోజులుగా వేతనాల పెంపుపై ఫెడరేషన్, చాంబర్ మధ్య చర్చలు జరుగుతుండగా... తాజాగా నిర్వహించిన సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది.
వారితో షూటింగ్
ఈ మేరకు టీఎఫ్‌సీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. నిర్మాతలు ఇవ్వగలిగే వేతనానికి పని చేస్తే ఓకే. లేకుంటే ఆ వేతనానికి పని చేయాలనుకున్న వర్కర్స్... యూనియన్‌లో లేకున్నా వారితో షూటింగ్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఎంతోమంది ఔత్సాహిక నిపుణులు/కార్మికులు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా... యూనియన్లలో చేర్చుకునేందుకు రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నారని... ఇండస్ట్రీలోకి వచ్చేందుకు వారికి అడ్డు తగులుతున్నారని పేర్కొంది. ఇది ఎంతోమంది కార్మికుల పొట్ట కొట్టడమేనని... ప్రాజెక్టు అవసరాలు, వ్యక్తుల సామర్థ్యం ఆధారంగా కార్మికులతో పని చేసే స్వేచ్ఛ నిర్మాతలకు ఉన్నట్లు వెల్లడించింది.
Also Read: రూ.100 కోట్ల క్లబ్‌లో 'మహావతార్: నరసింహ' - సక్సెస్ ట్రైలర్‌లో విజువల్ వండర్ చూశారా!
చర్చల స్ఫూర్తిని దెబ్బతీస్తుంది
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పటికే ఇబ్బందులో ఉందని... వేతనాలు పెంచకుంటే షూటింగ్స్ బంద్ అంటూ ఫిలిం ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవడం సరి కాదని ఫిలిం చాంబర్ తెలిపింది. నిజాయతీతో కూడిన చర్చలు స్ఫూర్తిని ఇది దెబ్బ తీస్తుందని చెప్పింది. ఈ పెంపు ప్రొడ్యూసర్స్ భరించే స్థాయిలో లేదని... అందుకే నిర్మాతలందరూ పెంపు నిర్ణయాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించినట్లు చెప్పారు. ఇతర చలన చిత్ర పరిశ్రమల్లో ఇచ్చే వేతనాల కంటే తెలుగు రాష్ట్రాల్లో పని చేసే కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నట్లు ఫిలిం చాంబర్ పెద్దలు వెల్లడించారు.
ఎవరైనా ఔత్సాహిక నిపుణులు/కార్మికులు సినీ రంగంలో పని చేయాలనుకుంటే వారితో పని చేయించుకోవాలని నిర్మాతల మండలి నిర్ణయించినట్లు తెలిపింది. సభ్యత్వం కోసం రూ.లక్షలు ఇవ్వాల్సిన పని లేదని... నైపుణ్యం ఉన్న కార్మికులకు పని కల్పించడమే తమ ధ్యేయమని వెల్లడించింది. నిర్మాత లేనిదే పరిశ్రమ లేదని... ఇండస్ట్రీ మనుగడ కోసం నిర్మాత శ్రేయస్సు ముఖ్యమని కార్మిక సంఘాలు గుర్తించాలని సూచించింది.





















