Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?
విజయ్ దేవరకొండ, రష్మిక జోడీగా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళకు ఓ గుడ్ న్యూస్. మళ్ళీ ఈ జోడీ ఓ సినిమాలో నటిస్తుందట. శ్రీ లీల ఎగ్జిట్ అందుకు కారణం అని టాక్.
'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే, రష్మికా మందన్నా (Rashmika Mandanna)కు కూడా! ఆమెను నేషనల్ క్రష్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. వీళ్ళిద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే, ఈ జోడీకి కూడా ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళకు ఓ గుడ్ న్యూస్.
మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా విజయ్ దేవరకొండ, రష్మికది సూపర్ హిట్ జోడీ. వాళ్ళిద్దరూ జంటగా నటించిన తొలి సినిమా 'గీత గోవిందం' భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్లు సాధించింది. తర్వాత నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రానికి కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మరో సినిమాలో జంటగా నటిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'మళ్ళీ రావా', 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అందులో నాయికగా శ్రీ లీల (Sreeleela)ను ఎంపిక చేశారు. సినిమా పూజా కార్యక్రమాలకు కూడా ఆమె హాజరయ్యారు. అయితే... ఇప్పుడు సినిమా నుంచి శ్రీ లీల తప్పుకొన్నారని టాక్.
ప్రజెంట్ శ్రీ లీల చాలా బిజీ. ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఒక్కో రోజు మూడు సినిమాల షూటింగ్స్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయని ఇండస్ట్రీలో జోక్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. రీసెంట్ 'స్కంద' ఇంటర్వ్యూలో ఎప్పుడైనా సెట్‌కు లేటుగా వెళ్ళారా? అని సుమ కనకాల ప్రశ్నిస్తే... ''లేటుగా వెళ్ళదు కానీ వేరే సెట్‌కు వెళ్లి ఉంటుంది'' అని రామ్ జోక్ చేశారు కూడా! డేట్స్ అడ్జస్ట్ చేయలేక విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకొన్నారట.
శ్రీ లీల పోయే... రష్మిక వచ్చే!
శ్రీ లీల సినిమా చేయలేనని చెప్పడంతో రష్మికా మందన్నాను దర్శక నిర్మాతలు సంప్రదించడం... ఆమె ఓకే చెప్పడం వెంట వెంటనే జరిగాయని టాక్. విచిత్రం ఏమిటంటే... నితిన్, వెంకీ కుడుముల సినిమా నుంచి రష్మిక తప్పుకొంటే, ఆ సినిమాను శ్రీ లీల చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకొంటే... రష్మిక ఓకే చేస్తున్నారని టాక్.
Also Read : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' పాయల్, అజయ్ భూపతి సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పుడు రష్మిక చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. హిందీలో రణబీర్ కపూర్ జోడీగా నటిస్తున్న 'యానిమల్' షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2', తెలుగు - తమిళ బైలింగ్వల్ సినిమా 'రెయిన్ బో' షూటింగ్స్ చేస్తున్నారు. హిందీలో అనీష్ బజ్మీ సినిమా చేయడానికి ఓకే చెప్పారని టాక్. అది కాకుండా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చర్చలో ఉందట.
Also Read : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా హీరోగా ఆయనకు 12వ సినిమా (VD 12 Movie). ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార సంస్థలో గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ' తీశారు. 'జెర్సీ'కి సంగీతం అందించిన రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మరోసారి గౌతమ్ తిన్ననూరి, సితార సంస్థతో కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు : నవీన్ నూలి, ఛాయాగ్రహణం : గిరీష్ గంగాధరన్, కళా దర్శకత్వం : అవినాష్ కొల్లా.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial