Sita Ramam Teaser: కశ్మీర్ కొండల్లో ఒంటరి సైనికుడికి ప్రేమలేఖ - ఎవరా అజ్ఞాత ప్రేయసి?
Watch Sita Ramam Telugu Movie Teaser Here: దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'సీతా రామం' సినిమా టీజర్ విడుదలైంది
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం 'సీతా రామం' (Sita Ramam Telugu Movie). యుద్ధంతో రాసిన ప్రేమకథ... అనేది ఉపశీర్షిక. 'అందాల రాక్షసి', 'పడి పడి లేచె మనసు' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రమిది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
'సీతా రామం' టీజర్ విషయానికి వస్తే... ''లెఫ్టినెంట్ రామ్! నిన్నే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి ఒక పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది'' అని నేపథ్యంలో నటి రోహిణి చెబుతున్న మాటలు వినిపిస్తుంటే, స్క్రీన్ మీద రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్‌ను పరిచయం చేశారు. మంచు కొండల్లో హీరో పహారా కాయడం, తోటి సైనికులతో నవ్వుతూ సరదాగా ఉండటం చూపించారు. అయితే... రోహిణి మాటలను రేడియోలో విన్న చాలా మంది ఉత్తరాలు రాస్తారు. అందులో ఒక అమ్మాయి ఉత్తరం ఉంటుంది. అది చదివి రామ్ సైతం ఆశ్చర్యానికి లోనవుతాడు.
''డియర్ రామ్! నీకు ఎవరూ లేరా? ఈ అబద్దాలు ఎక్కడ నేర్చున్నావయ్యా కొత్తగా! ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని పూర్తిగా మర్చిపోయినట్టున్నావ్. నిన్నే గుర్తు చేసుకుంటూ... నీ భార్య సీతా మహాలక్ష్మి'' అని ఒక ఉత్తరంలో ఉంటుంది. 'సీత... ఎవరు నవ్వు?' అని ఆలోచించడం రామ్ వంతు అయ్యింది. ఆ తర్వాత దుల్కర్, మృణాల్ జంటను చూపించారు. ఈ సీతారాముల కథ తెలియాలంటే ఆగస్టు 5 వరకూ ఎదురు చూడాలి.
'సీతా రామం' సినిమాను ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
Also Read : సూపర్ హిట్ 'డీజే టిల్లు'కు సీక్వెల్, క్రేజీ అప్‌డేట్ ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయిక. రష్మికా మందన్న కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?