Sagileti Katha Trailer : సీమ సంస్కృతి, ఆచారాలే ప్రధానాంశంగా 'సగిలేటి కథ' - ఆ నవల ప్రేరణ మాత్రమే!
Sagileti Katha Movie Updates : నవదీప్ సమర్పణలో యూట్యూబర్ రవితేజ మహాదాస్యం హీరోగా రూపొందిన సినిమా 'సగిలేటి కథ'. రాయలసీమ సంస్కృతి, ఆచారాల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.
యూట్యూబ్ ఫిలిమ్స్ చూసే తెలుగు ప్రేక్షకులకు రవితేజ మహాదాస్యం (Ravi Teja Mahadasyam) పరిచయమే. ఆయన హీరోగా పరిచయమవుతున్న సినిమా 'సగిలేటి కథ' (Sagileti Katha Movie). ఇందులో విషిక కోట హీరోయిన్. రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. ఆయనే రచయిత, ఛాయాగ్రాహకుడు, ఎడిటర్ కూడా! ఈ సినిమాను హీరో నవదీప్ సి స్పేస్ సమర్పణలో అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ నిర్మించారు. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
సీమ సంస్కృతి, ఆచారాల నేపథ్యంలో...
Sagileti Katha Trailer Review : 'సగిలేటి కథ' ట్రైలర్ చూస్తే... రాయలసీమ సంస్కృతి, ఆచార వ్యవహారాల నేపథ్యంలో తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాలో జాతర కూడా కీలక పాత్ర పోషించింది.
'గంగాలమ్మ పుణ్యమా అని కొత్త గజ్జెలు తాకట్టు పెడితే గానీ నీకు కోడికూర తినే యోగం రాలేదు' అని ఓ మహిళ చెప్పే మాటతో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత జాతరలో మేకలు, కోళ్లను బలి ఇచ్చినట్లు చూపించారు. పల్లెటూరి వాతావరణాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఊరిలో మనుషులను, పరిస్థితులను చాలా సహజంగా చూపించారు. ఆ ఊరిలో హీరో హీరోయిన్లు రవితేజ, విషికల ప్రేమకథ ఏమిటి? ప్రస్తుతానికి సస్పెన్స్. జాతర ఎందుకు ఆగింది? 'జాతర జరగపోతే ఊరు అల్లకల్లోలం అవ్వడం ఖాయం' అని ఎందుకు చెప్పారు? అనేది వెండితెరపై చూడాలి. నేపథ్య సంగీతంలో సైతం పల్లెటూరి సంస్కృతి వినిపించింది.
Also Read : విజయ దశమికి రవితేజ 'టైగర్' వేట - వెనకడుగు వేసేది లేదు
'సగిలేటి కథ' నవల ప్రేరణ మాత్రమే!
ట్రైలర్ విడుదలైన సందర్భంగా రాజశేఖర్ సూద్మూన్ మాట్లాడుతూ ''మాది రాయలసీమ. నేను సీమ వ్యక్తిని. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు తెలుసు. 'సగిలేటి కథ' నవల నా సినిమాకు ప్రేరణ మాత్రమే. ఒరిజినల్ కథతో తీశా. రుచికరమైన కోడి మాంసం తినాలనేడి సినిమాలో ఓ కీలక పాత్ర లక్ష్యం. అందుకే కోడిని చూపించాం. సినిమాలో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేసే అంశాలు చాలా ఉన్నాయి'' అని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని నిర్మాతలు దేవి ప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి చెప్పారు.
Also Read : ఇదీ మహేష్ బాబు క్రేజ్ - గంటలో హౌస్‌ఫుల్ బోర్డ్స్
'సగిలేటి కథ' ట్రైలర్ ఆవిష్కరణకు హీరోలు నవదీప్, సోహైల్ అతిథులుగా హాజరు అయ్యారు. రామ్ గోపాల్ వర్మ వీడియో ద్వారా శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రవితేజ యాంకరింగ్ చేశారు. 'కనబడుటలేదు' తర్వాత షేడ్ స్టూడియోస్ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఎలా అయితే కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చారో... ఈ సినిమాలోనూ అదే విధంగా కొత్త తారలకు అవకాశం ఇచ్చారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని షేడ్ స్టూడియోస్ సంస్థ తెలిపింది.
'సగిలేటి కథ' సినిమాలో రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : నరేష్ బాబు మాదినేని, స్వరాలు : జశ్వంత్ పసుపులేటి, నేపథ్య సంగీతం సనల్ వాసుదేవ్, సాహిత్యం : వరికుప్పల యాదగిరి, రాజశేఖర్ సుద్మూన్, శశికాంత్ బిల్లపాటి, పవన్ కుందని.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial