Raviteja: మాస్ మహారాజా తగ్గేదేలే, మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా రవితేజ - చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ మాంచి ఊపు మీదున్నాడు. ఒకదాని తర్వాత మరొక ప్రాజెక్ట్ ప్రకటించకుంటూ వెళ్తున్నాడు. గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ, మోస్ట్ బిజీయెస్ట్ టాలీవుడ్ హీరో అనిపించుకుంటున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరో ఎవరంటే మాస్ మహారాజా రవితేజ అనే చెప్పాలి. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలను రిలీజ్ చేసిన ఆయన.. రెండు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. లేటెస్ట్ గా ఒక కొత్త ప్రాజెక్ట్ కు అనౌన్స్ మెంట్ ఇచ్చారు. వచ్చే నెలలో ఇంకో సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందంటున్నారు. ఇవే కాకుండా మరో మూడు కథను ఓకే చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇలా ఒకేసారి అర డజనుకు పైగా సినిమాలను లైన్ లో పెట్టారంటేనే, మాస్ రాజా ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలలో ''టైగర్ నాగేశ్వరావు'' ఒకటి. 70వ దశకంలో స్టూవర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ.. రాబిన్ హుడ్ తరహాలో కొనియాడబడిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, రేణూ దేశాయ్ కీలక పాత్ర పోషిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా 2023 అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు.
మాస్ మహారాజా నటిస్తున్న మరో సినిమా 'ఈగల్'. ధమాకా, డిస్కో రాజా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన కార్తీక్ ఘట్టమనేని, ఈ యాక్షన్ థ్రిల్లర్ తో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.
లేటెస్టుగా రవితేజ - డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో #RT4GM ప్రాజెక్ట్ కు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి విజయవంతమైన సినిమా తర్వాత వీరి కలయికలో రాబోతున్న నాలుగో చిత్రమిది. అందుకే ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా చుండూరు గ్రామం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఇకపోతే 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుంది. అలానే 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ చెప్పిన కథకు మాస్ రాజా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం.
ఇదే క్రమంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ అంగీకారం తెలిపినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. 'షాక్' 'మిరపకాయ్' సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ జరిగే విధానాన్ని బట్టి, హరీష్ - రవితేజ మూవీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇవే కాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అభిషేక్ నామా నిర్మాణంలో మాస్ రాజా సినిమాలు కమిటైనట్లు టాక్. సో రవితేజ ఈ ప్రాజెక్ట్స్ తో ఏడాది పొడవునా బిజీగా గడపబోతున్నారు. మధ్యలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఓకే చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Also Read: మహేష్ బాబుకు మూడు నెలల ట్రైనింగ్ - రాజమౌళి సినిమా అంటే ఆమాత్రం ఉండాలిగా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial