Balakrishna At Turkey : టర్కీలో నందమూరి బాలకృష్ణ & శృతి హాసన్
ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ టర్కీలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇప్పుడు టర్కీలో ఉన్నారు. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఆయన ఒక సినిమా (NBK107) చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళారు. ఒక విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగులు పునః ప్రారంభం కావడానికి ఈ సినిమా కారణం అని ఫిల్మ్ నగర్ ఖబర్. ఎట్టి పరిస్థితుల్లో చిత్రీకరణ ఆలస్యం చేయవద్దని బాలకృష్ణ నిర్మాతలపై ఒత్తిడి చేయడంతో చర్చల్లో వేగం పెరిగి, ఒక నిర్ణయం తీసుకున్నారని టాక్. ఆ సంగతి పక్కన పెట్టి, ఈ సినిమా విషయానికి వస్తే...
టర్కీలో సాంగ్ షూటింగ్
ఆగస్టు 24 తర్వాత NBK107 యూనిట్ టర్కీ వెళ్ళింది. ప్రస్తుతం బాలకృష్ణ, హీరోయిన్ శ్రుతీ హాసన్ (Shruti Hassan) మీద పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. శ్రుతీ హాసన్‌కు నీరజా కోన స్టైలింగ్ చేస్తున్నారు. సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేశారని తెలిసింది.
సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు!
శ్రుతీ హాసన్ కాకుండా ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మలయాళ భామ హానీ రోజ్ ఒకరు. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తమిళ అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు.
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు సినిమా!
ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని సమాచారం. అందువల్ల, చిరంజీవి సినిమా వెనక్కి వెళ్ళనుంది. బాలకృష్ణ 107వ సినిమాతో పాటు చిరంజీవి 154 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలయ్య రాకతో సంక్రాంతి బరి నుంచి మెగా154 తప్పుకోవచ్చని ఇండస్ట్రీ గుసగుస.
మూడు టైటిల్స్‌లో బాలకృష్ణ ఓటు దేనికి?
NBK107 చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 'జై బాలయ్య', 'అన్న గారు' (Balakrishna Annagaru Movie), 'రెడ్డి గారు' టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఈ మూడింటిలో బాలకృష్ణ దేనికి ఓటు వేస్తే... దాన్ని అధికారికంగా వెల్లడించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని టాక్.
Also Read : హిందీ నటుడు, విమర్శకుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై NBK 107 తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశంతో అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారు. బాలకృష్ణ పాత్రను కూడా వైవిధ్యంగా తీర్చిద్దిదారట.
Also Read : 'బిగ్ బాస్' వల్ల తాగుడుకు బానిస కాలేదు - పుకార్లపై తేజస్వి