NTR statue of sri Krishna: తక్కెళ్లపాడులో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం, రాత్రికి రాత్రే మార్చి ట్విస్ట్ ఇచ్చిన నిర్వాహకులు
NTR statue at Takkellapadu in Guntur District | కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతో బీసీవై పార్టీ అధ్యక్షుడు ఛలో తక్కెళ్లపాడుకు పిలుపునివ్వగా, రాత్రికి రాత్రే నిర్వాహకులు విగ్రహాన్ని మార్చారు.

NTR statue Issue In Guntur District | పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం వివాదానికి తెరపడింది. శ్రీ కృష్ణుని రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్వాహకులు తొలగించారు. ఆ విగ్రహం స్థానంలో ఎన్టీఆర్ మామూలు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం ముగిసింది. శ్రీ కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో మనిషిని దేవుడి రూపంలో ఎలా ప్రతిష్టిస్తారని యాదవ సంఘాలు, బీసీసీఐ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. నేడు ఛలో తక్కెళ్లపాడుకు పిలుపునివ్వడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేయాలని రామచంద్ర యాదవ్ అన్నారు.
వివాదానికి దారితీసిన శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం
శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదానికి దారితీసింది. గుంటూరు పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో చెరువు కట్టపై ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్టించారు. ఆదివారం జరిగే విగ్రహావిష్కరణకు ముందే, శనివారం భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రయాదవ్ అక్కడకు వెళ్లారు. యాదవులు, హిందువులు ఆరాధ్యదైవంగా భావించే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై బీసీవై ప్రతినిధులు, అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు పెదకాకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నిర్వాహకులు రాత్రి ఆలస్యంగా చర్చలు జరిపి, విగ్రహంలో మార్పులు చేశారు. చివరికి ప్లూటు, కిరీటంలో నెమలి పింఛం లేకుండా టీడీపీ నాయకులు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఆదివారం సాయంత్రం బీసీవై పార్టీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు రశీదు తీసుకున్నారు. అక్కడినుంచి తక్కెళ్లపాడుకు వెళ్తున్నారని సమాచారం రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మైక్ ద్వారా నటి కరాటే కల్యాణి వస్తారని ప్రకటించడంతో సుమారు 300 మంది అక్కడ చేరుకున్నారు. ఈ క్రమంలో బీసీవై నాయకులు, విగ్రహావిష్కరణ కమిటీ ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని బీసీవై ప్రతినిధులను అక్కడి నుంచి తరలించారు.

అయితే సోమవారం ఉదయం 11 గంటలకు అదే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని బీసీవై అధినేత పిలుపునివ్వడంతో ఈ వివాదం మరింత తీవ్రంగా మారింది. అయితే నిర్వాహకులు, స్థానికులు రాత్రికి రాత్రే ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలోని విగ్రహాన్ని తొలగించి, సాధారణ రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం ముగిసింది.






















