హిందీలో చరణ్‌ను తక్కువ చేసి మాట్లాడారు, ఇప్పుడు ప్రపంచమంతా తనవైపు చూస్తోంది: నాగబాబు
మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగా అభిమానులు అంతా కలసి మార్చి 26 సాయంత్రం హైదరాబాద్ లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాగబాబు హజరయ్యారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీతో ఆయన గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ్ చరణ్ పేరు వినిపిస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. తన అభిమాన హీరో పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నారు మెగా అభిమానులు. ఈ సదర్బంగా మెగా అభిమానులు అంతా కలసి మార్చి 26న సాయంత్రం హైదరాబాద్ లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాగబాబు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ.. తమ ఇంట్లో మెగా బ్రదర్స్ అండ్ సిట్టర్స్ మొదటి కొడుకు రామ్ చరణ్ అని అన్నారు. చరణ్ అన్నయ్య చిరంజీవి కొడుకే అయినా తనకూ, కళ్యాణ్ కు అలాగే తమ చెల్లెళ్లకు కూడా కొడుకు లాంటి వాడేనన్నారు. రామ్ చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్ గా కోపంగా ఉండేవాడని కానీ ఎదిగేకొద్దీ చాలా మెచ్యూరిటీ వచ్చిందని అన్నారు. రామ్ చరణ్ లో తనకు నచ్చే విషయమిదేనని చెప్పారు. ప్రతీ ఇంటికీ ఇలాంటి కొడుకు ఉండాలనే విధంగా చరణ్ పేరు తెచ్చుకున్నాడని పేర్కొన్నారు. తమ తోబుట్టువులందరికీ చిరంజీవి ఎలా పెద్దగా ఉంటారో తమ తర్వాత తరం వారికి చరణ్ అలా అన్నగా అండగా ఉంటాడని అన్నారు. వాళ్లకి ఏ సమస్య వచ్చినా ముందు రామ్ చరణ్ వద్దకే వెళ్తారని చెప్పారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలో చరణ్ మేజర్ పార్ట్ అవ్వడం, ఆస్కార్ వేదికపై రామ్ చరణ్ బొమ్మ కనిపించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో చరణ్ ను తక్కువ చేసి మాట్లాడారని, అయితే ఇప్పుడు బాలీవుడ్ అంతా చరణ్ వైపు చూస్తోందని అన్నారు.
ఇక ‘ఆరెంజ్’ సినిమాను చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేశామని, రెండు రోజుల పాటు సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయని అన్నారు. ఒక జనసేన పార్టీ కార్యకర్తగా ఏం చేద్దాం అని ఆలోచించినపుడు తనకు ఈ ఐడియా వచ్చిందని, ‘ఆరెంజ్’ సినిమాను రీ రిలీజ్ చేసి ఆ వచ్చిన డబ్బును జనసేనకు విరాళంగా ఇస్తున్నామని అన్నారు. అప్పుడు సినిమాను యావరేజ్ అన్నారని, కానీ ఇప్పుడు చాలా బాగుంది అంటున్నారంటే అది రామ్ చరణ్ వల్లనే అని చెప్పారు. ఆ సినిమాను ఒక తరం ముందే తీశామని, అదే ఇప్పుడు తీసి ఉంటే హిట్ అయ్యేదేమోనని వ్యాఖ్యానించారు నాగాబాబు. ఇక వేదికపై నాగబాబు మాట్లాడుతున్నంతసేపూ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. వారిని తన చిరునవ్వుతోనే కట్టడి చేసే ప్రయత్నం చేశారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ను సీఎం, సీఎం అని అరిస్తే సరిపోదని, ఓట్లు వేసి గెలిపించాలని, అదే పవన్ కూడా అన్నారని గుర్తుచేశారు.
Also Read: వేసవిలో వినోదం - సమ్మర్‌లో సందడి చేయనున్న సినిమాలివే, మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికీ?