Mohan Babu: 'నేను నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు' - పాలిటిక్స్ తనకు సెట్ కావన్న మోహన్ బాబు
Mohan Babu Comments: తనకు పాలిటిక్స్ సెట్ కావని ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. ట్రోలింగ్స్ చేయడం వల్ల ఏం ఆనందం వస్తుందో అర్థం కావడం లేదని.. వాటిని పట్టించుకోనని తెలిపారు.

Mohan Babu About His Career And Politics: సినిమా ఫెయిల్యూర్ వేరని.. నటుడిగా ఫెయిల్ కావడం వేరని ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohanbabu) అన్నారు. ఓ యాక్టర్‌గా తాను ఎప్పుడూ ఫెయిల్ కాలేదని తెలిపారు. తన బాల్యం, కెరీర్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ట్రోలింగ్స్, పాలిటిక్స్, కన్నప్ప సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'అలాంటి వారిని పట్టించుకోను'
తాను ట్రోలింగ్స్ పట్టించుకోనని.. పక్కవారు నాశనం కావాలని ఎప్పుడూ కోరుకోకూడదని, అలా కోరుకుంటే వారి కంటే ముందు మనమే నాశనం అవుతామని మోహన్ బాబు అన్నారు. 'ఒకరిని మార్చాలని ఎప్పుడూ భావించకూడదు. అందరూ క్షేమంగా ఉండాలనే నేను కోరుకుంటాను. నేను ఏ విషయంలోనూ ఎవరినీ నిందించను. ట్రోలింగ్ చేసే వారి గురించి నేను పట్టించుకోను. అలా చేయడం వల్ల వారికి ఏం ఆనందం వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.' అని తెలిపారు.
'పాలిటిక్స్ నాకు సెట్ కావు'
రాజకీయాలు తనకు సెట్ కావని మోహన్ బాబు అన్నారు. దేవుని దయ వల్ల తాను కోరుకున్నవన్నీ జరిగాయని.. ఆయన ఆశీస్సులతో మంచి పాత్రలు వస్తే నటిస్తూ.. పిల్లలతో సరదాగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. 'నేను నటుడిగా ఎప్పుడూ ఓడిపోలేదు. నా కెరీర్‌లో 560 సినిమాలు చేశాను. ఇప్పుడు నా పిల్లలు నటిస్తున్నారు. నేను అరుదుగా చేస్తున్నా. నాకు ఆవేశం ఎక్కువే. గతాన్ని తవ్వుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నన్ను ఎంతోమంది మోసం చేశారు. అప్పటి నుంచే ఆవేశం వచ్చింది. అదే నాకు నష్టాన్ని కలిగించింది.' అని అన్నారు.
Also Read: 'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
మొండిగా వెళ్లా.. సక్సెస్ అయ్యా..
తాను చిన్నతనంలో ఎవరికీ చెప్పకుండా 4 కి.మీ నడుచుకుంటూ వెళ్లి 'రాజమకుటం' సినిమా చూశానని మోహన్ బాబు చెప్పారు. 'దాసరి నారాయణరావు నాకు సినిమాల్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. 1975లో వచ్చిన స్వర్గం - నరకం సినిమాతో విలన్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. అప్పటి నుంచీ ఇప్పటివరకూ 550కి పైగా సినిమాల్లో నటించాను. 'ప్రతిజ్ఞ' సినిమాతో నిర్మాతగా మారాను. నా బ్యానర్ 'లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్'ను సీనియర్ ఎన్టీఆర్ ప్రారంభించారు. అదే బ్యానర్‌పై ఆయన హీరోగా 'మేజర్ చంద్రకాంత్' సినిమా తీశాను. ఎన్టీఆర్ వద్దని వారించినా మొండిగా ఆ సినిమా తీశాను. సక్సెస్ అందుకున్నాను.' అని తెలిపారు.
'కన్నప్ప' సినిమాపై..
భగవంతుని ఆశీస్సులతోనే 'కన్నప్ప' సినిమాను నిర్మిస్తున్నామని మోహన్ బాబు తెలిపారు. 'ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడ్డాం. దేవుని దయతోనే కన్నప్ప సినిమా పూర్తైంది. నా దృష్టిలో ప్రజలే దేవుళ్లు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.' అని అన్నారు.
అయితే, కన్నప్ప సినిమాలో 'మహాదేవశాస్త్రి'గా మోహన్ బాబు నటిస్తున్నారు. ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాని కారణంగా విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీ ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

