Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!
టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్ విడుదలైంది. ఇందులో చివరి స్టంట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు.
Mission: Impossible - Dead Reckoning Trailer | మిషన్ ఇంపాజిబుల్’(MI) సినిమా సీరిస్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమాల్లో హీరో టాక్ క్రూజ్ చేసే విన్యాసాలు ఒళ్లుగగూర్పాటుకు గురిచేస్తాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే MI సినిమాకు ఏడో సీరిస్ త్వరలోనే విడుదల కానుంది. ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్- పార్ట్ వన్’గా ఈ సినిమా థియేటర్లో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ థ్రిల్లింగ్ ట్రైలర్‌ను వదిలారు.
59 ఏళ్ల వయస్సులోనూ టామ్ క్రూజ్.. కుర్రాడిలా స్టంట్స్ చేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటీవలే ‘టాప్‌గన్’ మూవీలో యుద్ధ విమానాలతో విన్యాసాలు చేసిన టామ్.. ఇప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్’లో కూడా రోమాలు నిక్కబొడుచుకొనే యాక్షన్ సీన్స్‌లో నటించాడు. చిన్న కారులో ఇరుకు వీధుల్లో డ్రైవింగ్, రైలుపై ఫైటింగ్ సీన్స్ తప్పకుండా సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ట్రైలర్ చివరిలో బైకుతో సహా ఎత్తైన కొండపై నుంచి లోయలోకి దూకే సీన్ చూస్తే.. ఔరా అనకుండా ఉండలేరు. మొత్తానికి టామ్ క్రూజ్.. ఈసారి కూడా మెస్మరైజ్ చేసి, తన విన్యాశాలతో ఈలలు వేయించుకోవడం ఖాయమనిపిస్తోంది.
Also Read: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్
హాలీవుడ్‌లో ‘జేమ్స్ బాండ్’ సినిమా తరహాలోనే ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాకు కూడా మాంచి డిమాండ్ ఉంది. 1996 సంవత్సరంలో ఈ ‘మిషన్ ఇంపాజిబుల్’ ఈ మూవీ సీరిస్ మొదలైంది. అప్పటి నుంచి నిర్విరామంగా ఈ చిత్రానికి సంబంధించి ఆరు మూవీ సీరిస్‌లు విడుదలయ్యాయి. ఇప్పుడు విడుదల కాబోయే ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్’ ఏడవ సీరిస్. ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ రచన, దర్శకత్వం వహించారు. సైమన్ పెగ్, రెబెక్కా ఫెర్గూసన్, వింగ్ రేమ్స్, వెనెస్సా కిర్బీ, హేలీ అట్‌వెల్, పోమ్ క్లెమెంటీఫ్, క్యారీ ఎల్వెస్, ఇందిరా వర్మ, షియా విఘమ్, రాబ్ డి మోరల్స్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. కరోనా వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. 2023లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ట్రైలర్‌లో ప్రకటించారు. తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!