Kannappa: నేనూ బ్రాహ్మణుడినే - సినిమా చూసి మాట్లాడండి.. 'కన్నప్ప' వివాదంపై డైలాగ్ రైటర్ ఆకెళ్ల క్లారిటీ
Akella Siva Prasad: 'కన్నప్ప' మూవీపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం తెలుపుతున్న వేళ.. రైటర్ ఆకెళ్ల శివప్రసాద్ స్పందించారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని.. సినిమాపై దుష్ప్రచారం చెయ్యొద్దని చెప్పారు.

Akella Siva Prasad Reaction About Kannappa Movie Controversy: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీపై పలు బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం తెలుపుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో రెండు క్యారెక్టర్ల పేర్లు తమ మనోభావాలు దెబ్బ తీశాయని.. ఆ పేర్లను తొలగించకుంటే మూవీని అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాయి. తాజాగా.. ఈ అంశంపై 'కన్నప్ప' రైటర్ ఆకెళ్ల శివప్రసాద్ స్పందించారు.
క్లారిటీ ఇచ్చేశారుగా..
'కన్నప్ప' మూవీపై జరుగుతున్న దుష్ప్రచారం తనకు చాలా ఆవేదన కలిగిస్తుందని ఆకెళ్ల తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఈ సినిమాకు మాటల రచయితగా పని చేసిన నాకు ఆ దుష్ప్రచారం ఆవేదన కలిగించింది. ఈ మూవీ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్, నేను కూడా బ్రాహ్మణులమే. సినిమాలో బ్రాహ్మణులని కానీ, ఏ కులాన్ని కానీ కించపరచలేదు. ఇదివరకు వచ్చిన 'శ్రీకాళహస్తి మహత్యం', 'భక్త కన్నప్ప' చిత్రాల్లో గుడిలో ప్రధాన పూజారి మహదేవశాస్త్రి పాత్రను గుడిలో దేవుని నగలు తీసుకెళ్లి వేరే వారికి ఇచ్చినట్లుగా చూపించారు.
కానీ మంచు విష్ణు గారు.. ఈ పాత్రను ధూర్జటి 16వ శతాబ్దంలో రచించిన 'శ్రీకాళహస్తి మహత్యం' గ్రంధం ఆధారంగా మోహన్ బాబు గారి రోల్ మహా శివభక్తుడిగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. రేపు సినిమా చూశాక ఈ విషయం అందరికీ అర్థమవుతుంది.' అని తెలిపారు.
అలా చేయాల్సిన అవసరం లేదు
'ఈ మూవీ స్టోరీ రాస్తున్నప్పుడే కాకుండా.. పూర్తి చేశాక కూడా శ్రీకాళహస్తి దేవస్థానం ప్రధానార్చకులకి చూపించాం. వారు దీన్ని చూసి ఎంతో ఉన్నతంగా ఉందని ప్రశంసించారు. మోహన్ బాబు, విష్ణులని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి గారితో సహా ఎందరో బ్రహ్మాణులు వివిధ శాఖల్లో పని చేశారు.
ఓ వర్గం వారినో కించ పరచడానికి రూ.కోట్లు ఖర్చు పెట్టి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మూవీ నిర్మించాల్సిన అవసరం ఎవరికీ లేదు. 'కన్నప్ప' విడుదల కాకుండానే ఏవేవో రూమర్స్ పుట్టించి దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం కూడా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు.' అంటూ రాసుకొచ్చారు ఆకెళ్ల.
Also Read: డేంజరస్ డైనోసార్స్ మళ్లీ వచ్చేస్తున్నాయ్ - 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్' ట్రైలర్ చూశారా?
అసలు వివాదం ఎక్కడంటే?
సినిమాలో పిలక, గిలక అనే క్యారెక్టర్ల పేర్లపైనే అసలు వివాదం మొదలైంది. పిలక రోల్‌లో బ్రహ్మానందం, గిలక రోల్‌లో సప్తగిరి నటించారు. ఓ చెట్టు చాటు నుంచి వీరిద్దరూ చూస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆ పేర్లతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కన్నప్పను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆందోళన నిర్వహించగా.. మంచు విష్ణు సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. మూవీ రిలీజ్ అయ్యేంత వరకూ ఆగాలని.. ముందే ఓ నిర్ణయానికి రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. తాజాగా.. ఇదే అంశంపై ఆకెళ్ల సైతం క్లారిటీ ఇచ్చారు.
ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా ఆకట్టుకుంటోంది. సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















