Kajol Political Leaders Comments: రాజకీయ నేతల విద్యార్హతలపై కాజోల్ వివాదాస్పద వ్యాఖ్యలు, ఆమె అన్నది నిజమే కానీ...
బాలీవుడ్ నటి కాజోల్.. ఈ మధ్య ఎక్కువగా వివాదాలతో సావాసం చేస్తున్నారు. తాజాగా రాజకీయ నేతలపై ఆమె చేసి వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆమె అన్నది నిజమే కానీ...
ప్రముఖ బాలీవుడ్ నటి, అజయ్ దేవగన్ భార్య కాజోల్ తాజాగా రాజకీయ నాయకులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అయితే, ఆమె చేసిన కామెంట్లలో వాస్తవం ఉన్నా.. కొన్ని వర్గాలకు మాత్రం అది మింగుడు పడటం లేదు. ఆమె కామెంట్స్ యావత్ భారతీయ రాజకీయ నాయకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు ఆమెపై మండిపడుతున్నారు. దీంతో ఆమె.. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఎవరినీ కించపరడం తన ఉద్దేశం కాదని కాజోల్ స్పష్టం చేశారు.
కాజోల్ చేసిన వ్యాఖ్యలేమిటీ?
కాజోల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘ఏదైనా దేశం అభివృద్ధి చెందాలంటే బాగా చదువుకున్న నాయకులు రాజకీయ రంగంలో ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా భారతదేశం వంటి దేశంలో పురోగతి చాలా నెమ్మదిగా ఉంది. ఎందుకంటే మనం మన సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాం. మన ఆలోచనా విధానాలు ఇంకా అలాగే ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా అక్షరాస్యత లేని రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారు. చదువులేని నాయకులు ప్రజలను పాలిస్తున్నారు. వారిలో చాలామందికి కనీసం నిర్దిష్ట ఆలోచన ఉండదు. అదే చదువుకున్న నేతలైతే విభిన్న దృక్కోణంతో పనిచేస్తారు’’ అని అన్నారు. కాజోల్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు కాజోల్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాజోల్ ట్వీట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.
నా ఉద్దేశం అది కాదు: కాజోల్
కాజోల్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ట్విట్టర్‌లో ఇలా స్పందించారు. ‘‘నేను విద్య, దాని ప్రాముఖ్యత గురించి మాత్రమే ఆ విషయాన్ని లేవనెత్తాను. అంతేగానీ.. రాజకీయ నాయకులను కించపరచడం నా ఉద్దేశం కాదు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే గొప్ప నాయకులు మనకు ఉన్నారు’’ అని వెల్లడించారు. కాజోల్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చదువులేని రాజకీయ నేతలు వల్లే దేశానికి ఈ పరిస్థితి పట్టిందంటూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ సపోర్టర్లు మాత్రమే తమ నేతలపైనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ భుజాలు తడుముకుంటున్నారని అంటున్నారు. చదువుకున్న నేతలకు ఒక విజన్ ఉంటుందని.. రౌడీలకు, గుండాల చేతికి అధికారం ఇస్తే పురోగతి నత్తనడక నడుస్తుందని అంటున్నారు. మరి, కాజోల్ వ్యాఖ్యలపై మీరు ఏమంటారు?
కాజోల్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’లోని పాత్రకు ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమాలో ఆమె అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందించిన ఒక ఎపిసోడ్(లఘు చిత్రం)లో కుముద్ మిశ్రాకు జంటగా నటించారు. ఇందులోని మిగిలిన మూడు ఎపిసోడ్స్‌కు కొంకణ సెన్‌శర్మ, ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇది కాకుండా కాజోల్ ‘ది ట్రయల్ షో’లో జిషు సేన్‌గుప్తా, షీబా చద్దా, కుబ్రా సైత్‌లతో కలిసి నటిస్తున్నారు. ‘ది ట్రయల్’ సీరిస్‌ను అమెరికన్ పొలిటికల్-లీగల్ డ్రామా.. ‘ది గుడ్ వైఫ్’ స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ జూలై 14 నుంచి OTT ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఇటీవల ఈ వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసం కాజోల్.. సోషల్ మీడియాకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. అయితే, అది ప్రమోషన్ కోసం చేశారని తెలియడంతో నెటిజనులు కాజోల్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అలా కాజోల్.. ఈ మధ్య వివాదాలతో సావాసం చేస్తున్నారు.
Also Read: మీకు Project K టీ షర్ట్ ఉచితంగా కావాలా? ఇదిగో ఇలా బుక్ చేసుకోండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial