Sr NTR 75 Years Event: ఎన్టీఆర్ మొదటి సినిమాకు 75 ఏళ్ళు... నందమూరి నట మహోత్సవం - భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన ఫ్యాన్స్
Balakrishna 50 Years Event: తెలుగు వెండితెర వేల్పు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మొదటి సినిమా విడుదలై నేటికి 75 ఏళ్ళు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు.
శ్రీరామచంద్రుని పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే రూపం ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao). కృష్ణుడు అని చెప్పినా గుర్తుకు వచ్చేది ఆయనే. తెలుగు వెండితెర వేల్పు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా పేరొందిన నందమూరి తారక రామారావు మొదటి సినిమా విడుదలై నేటికి 75 ఏళ్ళు.
'మన దేశం' విడుదలైనది ఈ రోజే!
నవంబర్ 24... ఈ తేదీకి తెలుగులో ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు తెరపై ఓ నక్షత్రం ఉదయించిన రోజు ఇది. నందమూరి తారక రామారావు తెలుగు చలన చిత్రసీమకు పరిచయమైన రోజు ఇది. 'మన దేశం'తో ఆయన తెలుగు తెరపై అడుగు పుట్టినది ఈ రోజే.
బెంగాలీ నవల, ప్రముఖ రచయిత శరత్ బాబు రాసిన 'విప్రదాస్' స్ఫూర్తితో 'మన దేశం' (Mana Desam Movie) తెరకెక్కించారు. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. దేశభక్తుడు నారాయణ రావును అరెస్ట్ చేసే పాత్రలో ఆయన నటించారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి కొన్ని రోజుల ముందు ఈ సినిమా తీయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఆగస్టు 15, 1947లో విడుదల చేయాలని చూసినా కుదరలేదు. ఆ తర్వాత రెండేళ్లకు... నవంబర్ 24, 1949న, సరిగ్గా 75 ఏళ్ళ క్రితం సినిమా విడుదలైంది.
ఎన్టీఆర్ @ 75, బాలకృష్ణ @ 50...
నందమూరి నట మహోత్సవం!
చిత్రసీమలోకి సీనియర్ ఎన్టీఆర్ అడుగుపెట్టి 75 ఏళ్ళు, ఆయన వారసుడిగా వచ్చి అగ్ర కథానాయకుడిగా ఎదిగిన బాలకృష్ణ వచ్చి 50 ఏళ్ళు పూర్తి కావడంతో 'నందమూరి నట మహోత్సవం' పేరుతో అభిమానులు భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని బాలకృష్ణ సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేశారు.
''నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్ళకు నమస్సుమాంజలి. నేను అనునిత్యం స్మరించే పేరు, నా గురువు, నా దైవం, నా స్ఫూర్తి మా నాన్న ఎన్టీఆర్ గారు. 'మన దేశం' చిత్రంతో వెండితెరపై ఆయన దర్శనమిచ్చి ఈ నవంబర్ 24కు 75 ఏళ్ళు. నాన్నగారి 'వజ్రోత్సవం' జరుపుకుంటున్న ఈ సంవత్సరమే కళామతల్లి సేవలో హీరోగా నేను 50 ఏళ్ళు నిర్విరామంగా, దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం, 'స్వర్ణోత్సవం' జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాన్న గారి నుంచి నన్ను... నా కుటుంబ సభ్యులను ఆదరిస్తున్న నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్ళకు, నా సినిమా ప్రయాణంలో నాకు అడుగడుగునా సహకరించిన తోటి కళాకారులకు, దర్శక నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, పంపిణీ దారులకు, థియేటర్స్ యాజమాన్యాలకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, అన్ని విభాగాల సినీ కార్మికులకు, నా ఉన్నతిని కోరే ఆత్మీయ శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను'' అని ఫేస్ బుక్‌లో బాలకృష్ణ పేర్కొన్నారు. 'తాతమ్మ కల' సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.