సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘దసరా’ డైరెక్టర్!
'దసరా' మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. ఆయన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల్లో ఒకరైన శ్రీకాంత్ ఓదెల తాజాగా 'దసరా' సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నాచురల్ స్టార్ నానిని మునుపెన్నడూ లేని రీతిలో ఊర మాస్ రోల్ లో చూపించి మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా. తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా ఆఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకురి ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇక తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొదటి సినిమాతోనే దర్శకుడు శ్రీకాంత్ ఇండస్ట్రీలో భారీ గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఇక ఈ దర్శకుడి తర్వాతి సినిమా ఏ హీరోతో ఉండబోతుంది అనే చర్చ జరుగుతున్న సమయంలో సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ ఇంటి వాడయ్యాడు. అతను ఎవరిని వివాహం చేసుకున్నాడు అనే విషయమై క్లారిటీ లేదు కానీ తన సొంతూరైన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో అతని వివాహ వేడుక జరిగింది. ఇక ఈ వివాహ వేడుకకు దర్శకుడు సుకుమార్ దంపతులతో పాటు సుకుమార్ శిష్యులు అందరూ హాజరైనట్లుగా సమాచారం. తాజాగా శ్రీకాంత్ ఓదెల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు శ్రీకాంత్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే శ్రీకాంత్ ఓదెల వివాహం చేసుకున్న యువతి గురించి ఎలాంటి వివరాలు ఇంకా బయటికి రాకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతానికైతే శ్రీకాంత్ ఇతర హీరోలతో సినిమాలు ఏమీ చేయడం లేదని 'పుష్ప2' షూటింగ్లో సుకుమార్ కి సహకారంగా ఉంటున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది.
తాజాగా ఇప్పుడు అతని వివాహం కూడా జరగడంతో కొన్నాళ్లపాటు 'పుష్ప2' షూటింగ్ కూడా బ్రేక్ తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. మరోవైపేమో శ్రీకాంత్ ఓదెల తన తదుపరి చిత్రాన్ని అక్కినేని అఖిల్ తో చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అఖిలే కాదు మెగాస్టార్ చిరంజీవితో కూడా శ్రీకాంత్ ఓ సినిమా చేస్తున్నాడని ఆయనకు ఇటీవలే ఓ కథను వినిపించగా ఆ కథ మెగాస్టార్ కి బాగా నచ్చి ఆయనకు ఛాన్స్ ఇచ్చారని వార్తల కూడా వైరల్ అయ్యాయి. మరి శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు? అనే విషయంపై అతనే స్వయంగా క్లారిటీ ఇచ్చే వరకు ఈ వార్తలకు బ్రేకులు పడే అవకాశం కనిపించడం లేదు.
Thank you so much annnnaaa ❤️❤️ https://t.co/QEcgui6cgD
— srikanth odela (@odela_srikanth) May 31, 2023
Also Read: వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్?