Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?
ముంబై అటల్ సేతు బ్రిడ్జిపై ప్రశంసలు కురిపించిన నటి రష్మిక మందన్నకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ముంబై వాసులు ఈ బ్రిడ్జిని ఎంత మంది ఉపయోగిస్తున్నారో తెలుసా? అంటూ ప్రశ్నించింది.
Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతుందని వెల్లడించిన ఆమె, అభివృద్ధికి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చింది.ట
రష్మికకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
అటల్ సేతుపై ప్రశంసలు కురిపించిన రష్మిక మందన్నకు కేరళ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఇప్పటి వరకు పెయిడ్ యాడ్స్, సర్రోగేట్ యాడ్స్ మాత్రమే చూశామని, ఇప్పుడు ఈడీ డైరెక్షన్ లో వచ్చిన యాడ్ ను చూస్తున్నామంటూ ఎద్దేవా చేసింది. “మీరు షేర్ చేసిన వీడియోలో అటల్ సేతు ఖాళీగా ఉన్నట్లు గమనించాం. కేరళ నుంచి వచ్చాం కాబట్టి, ముంబైలో ట్రాఫిక్ తక్కువగా ఉందని భావించాం. ఇదే విషయాన్ని ముంబై కాంగ్రెస్ మిత్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అటల్ సేతుతో పోల్చితే రాజీవ్ గాంధీ బాంద్రా-వర్లీ సీ లింక్ ను వాహనదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే ఈ వీడియో చూడండి. వీడియో ఒక్కటే కాదు, కొంత డేటా కూడా పరిశీలించాం. రూ.1,634 కోట్ల వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన 5.6 కి.మీ బాంద్రా-వర్లీ సీ లింక్‌ను 2009లో ప్రారంభించారు. ఎలాంటి షో ఆఫ్ లేకుండా ప్రారంభం అయిన ఈ సీ లింక్ ద్వారా ఎక్కువగా ప్రయాణించేందుకు వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. బాంద్రా-వర్లీ సీ లింక్ ను ఉపయోగించేందుకు ప్రతి కారుకు కేవలం రూ.85 వసూలు చేస్తున్నారు.
అటల్ సేతును రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఒక్క ట్రిప్‌కు ఒక్కో కారుకు రూ. 250 టోల్ వసూళు చేస్తున్నారు. ఈ రేటు సామాన్య వాహనదారుడు భరించే పరిస్థితిలో లేదు. జనవరి 12న ఈ బ్రిడ్జి ప్రారంభం కాగా, ఏప్రిల్ 23 వరకు రూ.22.57 కోట్లు టోల్ వసూళు అయ్యింది. అంటే నెలకు రూ. 6.6 కోట్లు వసూళు అవుతుంది. ఈ రేటు ప్రకారం రూ. 17,840 కోట్ల పెట్టుబడిని తిరిగి పొందేందుకు 225 సంవత్సరాలు పడుతుంది. వడ్డీకి లెక్క లేదు. వాస్తవానికి అటల్ సేతు నుంచి నెలకు రూ. 30 కోట్లు వస్తుందని భావించారు. కానీ, ఇప్పుడు అంత రావడం లేదు. ముంబై వాసులు ఈ బ్రిడ్జిని ఎందుకు ఉపయోగించట్లేదో ఓ వీడియో చేస్తే బాగుంటుంది” అంటూ రాసుకొచ్చింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. రష్మిక పోస్ట్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్‌కు బదులుగా కేరళ కాంగ్రెస్ పార్టీ స్పందించడం. దీంతో ముంబయిలో లేని మీరు.. అక్కడి వంతెనపై కామెంట్స్ చెయ్యడం హాస్యస్పందమని నెటిజన్స్ కౌంటర్లు వేస్తున్నారు.
Dear Rashmika Mandanna Ji,
— Congress Kerala (@INCKerala) May 17, 2024
The nation has seen paid ads and surrogate ads before. This is the first time we are seeing an ED-directed ad. It came out well. Good job!
We noticed that the Atal Setu appears practically empty from your ad. Being from Kerala, we initially thought… pic.twitter.com/7pciuNRPVT
దేశంలో సముద్రంపై నిర్మించిన అతి పెద్ద బ్రిడ్జి
అటల్ సేతు బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ - ఎంటీహెచ్ఎల్ కలుపుతూ నిర్మించారు. 6 లేన్లుగా 21.8 కిలోమీటర్ల పొడవు ఈ వంతెన ఉంది. ఈ బ్రిడ్జి 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉంది. అంతేకాదు, భారత్ లో సముద్రంపై నిర్మించిన అతి పొడవైన సముద్ర వంతెనగా ఈ అటల్ సేతు బ్రిడ్జి గుర్తింపు తెచ్చుకుంది. ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.