Alia Bhatt: ఆలియాకు రాజమౌళి ఇచ్చిన సలహా ఇదేనట - మరి మన స్టార్స్ ఫాలో చేస్తారా?
Alia Bhatt: ఆలియా భట్ 'RRR' పాన్ ఇండియా సినిమా ద్వారా తెలుగులో పరిచయం అయిన నటి. సీతగా నటించి ఎంతోమంచి పేరు తెచ్చుకున్నారు ఆలియా.
Alia Bhatt About Rajamouli Advice: ‘RRR’ పాన్ ఇండియా సినిమా ద్వారా తెలుగుకు పరిచయం అయ్యారు బాలీవుడ్ కథానాయిక ఆలియా భట్. సీత క్యారెక్టర్ లో ఎంతోమంది మనసు దోచుకున్నారు ఆమె. సినిమాలో ఆమె క్యారెక్టర్ కొంచంసేపే ఉన్నప్పటికీ కొన్ని సీన్లలో ఆమెదే కీలక పాత్ర. ఇక బాలీవుడ్ లో దూసుకుపోతున్న ఈ నటి.. ఈ మధ్యే ఫోర్బ్స్ 30/50 సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె దర్శకుడు రాజమౌళి గురించి చెప్పారు. సినిమాలకు సంబంధించి ఆయన ఇచ్చిన సలహాల గురించి పంచుకున్నారు.
ప్రేమకు మించింది లేదు..
సినిమాల విషయంలో ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలా ఎంచుకోవాలని అని తాను నలిగిపోతున్న టైంలో రాజమౌళి గొప్ప సలహా ఇచ్చారని ఆమె చెప్పారు. “ ఎలాంటి సినిమాలు ఒప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది అని రాజమౌళితో చెప్పాను. అప్పుడు ఆయన గొప్ప సలహా ఇచ్చారు. ఏది ఎంచుకున్నా.. ప్రేమతో చేయమన్నారు. అప్పుడే సినిమా బాగలేకపోయినా, ఆడకపోయినా కూడా ప్రేక్షకులకు నీ కళ్లలో సినిమాపై ప్రేమ కనిపిస్తుందని చెప్పారు. అప్పుడు సినిమా కోసం నువ్వేం చేశావో వాళ్లకు అర్థం అవుతుంది. ప్రపంచంలో ప్రేమకు మించిది ఏదీ లేదు కదా అని చెప్పారు రాజమౌళి గారు” అని ఆలియా భట్ చెప్పారు. ఆలియా రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేసిన విషయం తెలిసిందే.
లక్ అనేది భారీ ఫ్యాక్టర్..
అదే ఇంటరాక్షన్ లో ఆమె మరిన్ని విషయాలు పంచుకున్నారు. ఈసందర్భంగా లక్ గురించి ప్రస్తావించారు ఆలియా భట్. “నేను చాలా లక్కీ. ప్రతీది లక్ వల్లే వస్తుందని కూడా చెప్పను. కానీ, లక్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నాకు బాగా గుర్తు.. మొదట్లో నన్ను వెతుకుంటూ వచ్చేదాన్నే నేను చూజ్ చేసుకునేదాన్ని. ఆ సినిమాలు ఒకదానికొకటి భిన్నంగా ఉండేవి. మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగివస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. ఇక నాకు ఏ విషయమైనా చాలా తొందరగా బోర్ కొట్టేస్తుంది. అందుకే, అన్ని మిక్స్ అప్ చేస్తూ నన్ను నేను ఎంటర్ టైన్ చేసుకుంటా” అని అన్నారు ఆలియా భట్.
ఆలియా భట్.. ఈ బాలీవుడ్ బ్యూటీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆలియా.. ‘RRR’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక ఆ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కి జోడీగా, సీత క్యారెక్టర్ లో నటించారు ఆలియా. ఇక ప్రస్తుతం ఆమె 'జిగ్రా' సినిమాలో నటిస్తున్నారు.
ఇక అలియా, రణబీర్ కపూర్ ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 14, 2022లో పెళ్లి చేసుకున్నారు. ఆ ఏడాది నవంబర్ 6న వాళ్లకు అమ్మాయి రహా జన్మించింది. బిడ్డ గర్భంలో ఉండగా... రణబీర్, ఆలియా జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర’ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ఇటీవల రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ భారీ హిట్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
Also Read: అకిరా నందన్‌ను నేనే లాంచ్ చేస్తా - పవర్ స్టార్ కొడుకు ఎంట్రీపై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్