అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన
టాలీవుడ్ సీనియర్ నటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన సినీ, వ్యక్తిగత జీవితాల గురించి చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ లో సీనియర్ నటి సన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సినిమా అయినా సీరియల్ అయినా వేదిక ఏదైనా తనదైన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది సన. కేవలం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 600 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ సినిమాలు, సీరియల్స్ లలో నటిస్తూనే ఉంది. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తాండ’ సినిమాలో కూడా నటించింది సన. ఆమెకు అవకాశాలు అంత సులువుగా రాలేదు. అందరి లాగే కెరీర్ ప్రాంభంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొంది. తరువాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది సన. ఈ సందర్భంగా తన సినీ, వ్యక్తిగత జీవితాల గురించి చెప్పుకొచ్చింది.
దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాతో సినీ కెరీర్ ను ప్రారంభించింది సన. ఆ తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇతర భాషల్లోనూ నటించింది. సన పూర్తి పేరు షానూర్ సన బేగమ్. ఆమె పదో తరగతి వరకూ చదివింది. ఆ తరువాత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. సనకు చిన్నతనం నుంచీ మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ గా ఉండేది. అది గుర్తించిన అత్తమామలు ఆమెలో ఉన్న ప్రతిభను ప్రోత్సాహించారు. అండగా నిలబడ్డారు. దీంతో సన ఆశలకు కొత్త చిగురులు తొడిగాయి. అలా మోడలింగ్ నుంచీ, టీవీ, యాంకరింగ్, తర్వాత సినిమాలు ఇలా అన్నీ వరుసగా జరిగిపోయాయి.
సన తల్లి ముస్లిం, తండ్రి క్రిస్టియన్.. అయినా ముస్లిం సాంప్రదాయాల్లోనే ఎక్కువగా పెరిగింది సన. వాస్తవానికి ఇలాంటి వాతావరణంలో తాను సినీ ఫీల్డ్ కు వెళ్తాను అంటే ఒప్పుకోరేమోనని భయపడిందట సన. ముందు అత్తయ్యకు చెప్తే ఒప్పుకోలేదని, తర్వాత మళ్లీ అడిగితే ఆలోచించుకొని ఓకే చేశారట. అలా ఇండస్ట్రీ వైపు తన అడుగులు పడ్డాయని చెప్పింది సన. తన టాలెంట్ చూసి అత్తమామలు ప్రోత్సాహించారని అంది. అయితే బురఖా వేసుకోలేకపోతే చుట్టుపక్కల వాళ్లు సూటిపోటి మాటలనేవారని గుర్తు చేసుకుంది. అవన్నీ భరించి తన అత్తమామలు తనను నిలబెట్టారని చెప్పింది.
కెరీర్ మొదట్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చేవని, కానీ పెళ్లై, పిల్లలు ఉన్నారని చెప్పొద్దు అనేవారని చెప్పింది. కానీ అబద్దం చెప్పి చేయాల్సిన అవసరం ఏముంది అని.. నిజమే చెప్పేదాన్ని అని, అలా హీరోయిన్ ఛాన్స్ మిస్ అయిందని చెప్పింది. హీరోయిన్ చాన్స్ కావాలి అంటే ఎక్స్‌పోజింగ్ చేయాలని, స్విమ్ సూట్ లు ధరించాలని చెప్పారని, తాను అందుకు అంగీకరించకపోవడంతో హీరోయిన్ గా తీసేసారని చెప్పింది. కానీ తానేమీ బాధపడలేదని, తన పని తాను చేసుకుంటూ వచ్చానని తెలిపింది. తాను మొదట ఇండియన్ ను అని తర్వాతే ముస్లిం అని చెప్పింది. తన పిల్లల్ని కూడా అలాగే పెంచానని చెప్పింది. తాను ఎన్నో పాత్రలు చేశానని అమ్మవారి పాత్రలు కూడా తనకు ఎంతో గుర్తింపు తెచ్చాయని చెప్పుకొచ్చింది సన.
Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు





















