Bigg Boss Season 7 Telugu: అమర్ పేరుతో ప్రాంక్ చేసిన శివాజీ, శుభశ్రీ.. షాక్ అయిన కంటెస్టెంట్స్
శివాజీ, శుభశ్రీ కలిసి గౌతమ్, యావర్‌లపై అదిరిపోయే ప్రాంక్‌ను ప్లే చేశారు. ఇందులో శివాజీ నటన చూసి వారు ఈ ప్రాంక్‌ను నిజమని నమ్మారు.
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ విడుదల చేసే ప్రోమోలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అసలు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. మూడురోజుల క్రితం శుభశ్రీ, శివాజీ మధ్య గొడవ జరుగుతున్నట్టుగా ప్రోమో విడుదలయ్యింది. అందులో నా పేరు పోతే చచ్చిపోతా అంటూ శివాజీ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఆరోజు ఏమయ్యింది, ఎవరి వల్ల వీరిద్దరి మధ్య గొడవ మొదలయ్యింది అనేది ప్రోమోలో అర్థం కాలేదు. తాజాగా ఈ ప్రోమోకు సంబంధించి మరో ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్. ఆరోజు శుభశ్రీ, శివాజీ చేసిందంతా ప్రాంక్ అని, ఆ ప్రాంక్‌లో మరికొందరు కంటెస్టెంట్స్ కూడా ఉన్నట్టు ఈ ప్రోమోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు.
అమర్ పేరుతో ప్రాంక్..
ఇంతకు ముందు విడుదలయిన ప్రోమోలో శివాజీ.. శుభశ్రీపై వ్యాఖ్యలు చేశాడని, ఆ విషయం అమర్‌దీప్ వచ్చి శుభశ్రీకి చెప్పాడని, అదే విషయంపై శుభశ్రీ వచ్చి శివాజీని నిందించినట్టుగా ఉంది. అందుకే శుభశ్రీ, శివాజీల మధ్య వాగ్వాదం జరిగినట్టుగా చూపించారు. కానీ అదంతా ప్రాంక్ అని తాజాగా మరో వీడియో విడుదల చేశారు బిగ్ బాస్. ‘‘నేను నీ గురించి అలా మాట్లాడతానంటే నువ్వు నమ్మావా?’’ అంటూ ముందుగా శుభశ్రీని ప్రశ్నించాడు శివాజీ. ‘‘అది గౌతమ్ గాడు చెప్పాడా’’ అంటూ శివాజీని తిరిగి ప్రశ్నించింది శుభ. దానికి సమాధానంగా.. ‘‘గౌతమ్ చెప్పాడని నేను అన్నానా? వాళ్లు ఏదేదో మాట్లాడుకుంటున్నారు, అసలు నీ టాపికే రాలేదు. అమర్ గాడు’’ అని అన్నాడు శివాజీ. ‘‘నాకు తెలుసు అమర్‌కు ప్రాబ్లెమ్ ఉంది అని’’ అంటూ శివాజీ మాటలకు ఒప్పుకుంది శుభశ్రీ. వీరిద్దరి మధ్య ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే పల్లవి ప్రశాంత్ డోర్ దగ్గర నిలబడి బయట ఉన్న యావర్, గౌతమ్, సందీప్.. ఇదంతా వింటున్నారా లేదా అని గమనిస్తూ ఉన్నాడు. అక్కడే ఇదంతా ప్రాంక్ అని ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది.
సందీప్‌ను నమ్మించిన శివాజీ..
బయట వారు ఉన్నారని తెలుసుకున్న తర్వాత వారిని లోపలికి రప్పించడం కోసం శుభశ్రీపై మరింత గట్టిగా అరవడం మొదలుపెట్టాడు శివాజీ. అనుకున్నట్టుగానే వారి ప్లాన్ వర్కవుట్ అయ్యి బయట నిలబడి ఉన్న యావర్, గౌతమ్, సందీప్ లోపలికి వచ్చారు. ఆ తర్వాత టేస్టీ తేజ కూడా వచ్చి ఈ ప్రాంక్‌లో జాయిన్ అయ్యాడు. శివాజీ అరుపులకు శుభశ్రీ ఏడుస్తున్నట్టుగా నటించింది. మధ్యలో వచ్చిన సందీప్.. ‘‘నాకైతే సంబంధం లేదు. నా పేరుతో తీయొద్దు మధ్యలో’’ అంటూ అరవడం మొదలుపెట్టాడు. నీ పేరు తీయడం లేదు అంటూ శివాజీ క్లారిటీ ఇచ్చాడు. అమర్‌దీప్ తనను ఏదో అన్నాడని నమ్మినట్టుగా శుభశ్రీ అందరినీ నమ్మించింది. అంతే కాకుండా నామినేషన్స్ సమయంలో కూడా ఎప్పుడూ తననే టార్గెట్ చేస్తాడనే మాట చెప్పేసరికి మిగిలిన వారు కూడా ఈ సంభాషణ అంతా నిజమని నమ్మారు.
శుభశ్రీని ఓదార్చిన గౌతమ్, యావర్..
ప్రాంక్‌లో జాయిన్ తేజ.. శివాజీ, శుభశ్రీకి మధ్య జరుగుతున్న గొడవను ఆపినట్టుగా నటించాడు. అమర్ దగ్గరికి వెళ్లి మాట్లాడదామని ఇద్దరినీ తీసుకెళ్లబోయాడు. కానీ ప్రాంక్‌లో లీనమయిపోయిన శివాజీ మరింత గట్టిగా అరుస్తూ.. నేను రాను అంటూ తేజ చేతిని వదిలించుకున్నాడు. శివాజీ చేస్తున్న నటనకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని శుభశ్రీ ఏడుస్తున్నట్టుగా నటించింది. గౌతమ్, యావర్.. తనను బయటికి తీసుకెళ్లిపోయి ఓదార్చే ప్రయత్నం చేశారు. చివరికి వారిద్దరికీ కూడా ఇదంతా ప్రాంక్ ఏమో అనే అనుమానం వచ్చింది.
Also Read: బిగ్ బాస్ హౌజ్‌లోకి గౌతమ్ రీఎంట్రీ - ప్యాంట్ విప్పడం ఎంటర్‌టైన్మెంట్ కాదంటూ శివాజీపై ఫైర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial