Amardeep: నాకేమైనా పర్లేదు, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి వస్తాను - అమర్ ఎమోషనల్ వీడియో
Bigg Boss Amardeep : బిగ్ బాస్ సీజన్ 7లో రన్నర్‌గా నిలిచిన అమర్‌దీప్ కారుపై రాళ్ల దాడి చేశారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. దానిపై స్పందిస్తూ ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేశాడు అమర్.
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్‌గా నిలిచాడు అమర్‌దీప్. తమ అభిమాన కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ గెలిచినా కూడా అమర్‌పై కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం పెంచుకున్నారు. అందుకే ఫైనల్స్ అయిపోయి.. తను బయటికి రాగానే తన కారుపై దాడి చేశారు. ఈ దాడిలో కారు వెనక అద్దం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఇది జరిగి రెండురోజులు అవుతున్నా కూడా ఇంకా అమర్ స్పందించడం లేదని తన ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. అందుకే తాజాగా దీనిపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు అమర్. అందులో తన కుటుంబానికి ఏమైనా జరిగుంటే ఎలా అనే విషయంపై బాధపడ్డాడు. ఎమోషనల్‌గా మాట్లాడాడు.
బాధాకరమైన విషయం..
ముందుగా ఫ్యాన్స్‌గా తనకు సపోర్ట్ చేస్తూ.. ఓట్లు వేసినవారికి థ్యాంక్స్ చెప్పుకున్నారు అమర్. గెలవాలి అనుకున్నవాడిని గెలుపు వరకు తీసుకెళ్లారు, గెలిపించారు అని తెలిపాడు. ‘‘బాధాకరమైన విషయం ఏంటంటే.. చాలామంది అడుగుతున్నారు. నేను దానిగురించి పెద్దగా చెప్పాలి అనుకోలేదు. ఆ బాధలో ఉండిపోయాను. చాలా బాధపడ్డాను. కారు అద్దాలు పగలగొట్టారు. బయటికి రా.. నీ అంతు చూస్తా అన్నారు. నేను ఒక్కడినే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకేం భయం లేదు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం’’ అంటూ వాపోయాడు అమర్‌దీప్.
నా కుటుంబాన్ని బాధపెట్టారు..
‘‘అద్దాలు పగలగొట్టారు. పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మ మీద పడ్డాయి, తేజూ మీద పడ్డాయి. ఎవ్వరికీ ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరగరానిది జరిగుండుంటే.. ఆ రాళ్ల వల్ల తల పగిలి ఎవరికైనా ఏమైనా జరిగుండుంటే నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవాడినో నాకు తెలియదు. ఇలాంటివి ఇంకెప్పుడూ ఎవరికీ జరగకూడదు. చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి పడతాను. కామెంట్లు పెట్టండి చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు. నా కుటుంబాన్ని బాధపెట్టారు. అయినా నేను ఏదీ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే నేను నమ్ముకునే నా హీరో, నా గురువు మాస్ మహారాజా రవితేజ వచ్చి నాకు అవకాశం ఇచ్చినరోజే నేను గెలిచాను. ఆ గెలుపులోనే బయటికి వచ్చాను’’ అని అన్నాడు అమర్.
మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేము..
‘‘గెలిచి ఒక ఆనందంతో బయటికి వస్తాను అనుకున్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టారు. అది చాలా బాధేసింది. పర్లేదు నన్ను ప్రేమించేవాళ్లు, అభిమానించే వాళ్లు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూశాడు కాబట్టి మా అమ్మకు, నా భార్యకు ఏం కాలేదు. నాకేమైనా పర్లేదు. మన ఇంట్లో ఆడవాళ్లు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. కప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేము. చాలా రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. దయజేసి ఇలా ఎప్పుడూ, ఎవరి దగ్గర చేయకండి. ఇప్పటికీ నా మీద మీకు కోపం ఉంటే ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అక్కడికి వస్తాను. మీ ఇష్టం. కానీ ఎవ్వరికీ ఇలా ఎప్పుడూ చేయకండి’’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడుతూ వీడియోను విడుదల చేశాడు అమర్‌దీప్.
Also Read: నా బిడ్డ గెలిచాడు, అలా అనుకోవడం పరమ బూతు - బిగ్ బాస్‌పై శివాజీ వ్యాఖ్యలు