Balakrishna Daughter Tejaswini : బాలకృష్ణ ఇంటి నుంచి మరో నిర్మాత - పెట్టుబడి & వాటా?
నట సింహం నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచి మరో నిర్మాత, అదీ బాలకృష్ణ రెండో కుమార్తె రానున్నారని సమాచారం. కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య 369' సీక్వెల్, ఆ తర్వాత సినిమాల నిర్మాణంలో ఆమె భాగస్వామి కానున్నారట.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా! నందమూరి తారక రామారావు కథానాయకుడిగా పరిశ్రమలోకి వచ్చినప్పటికీ... తర్వాత రచన, దర్శకత్వం, నిర్మాణంలో కూడా ప్రతిభ చూపించారు. స్టూడియో స్థాపించారు. పరిశ్రమకు అండగా నిలిచారు. తండ్రి అడుగుజాడల్లో కుమారుడు బాలకృష్ణ కూడా నడుస్తున్నారు.
'ఆదిత్య 999'తో రచయితగా, దర్శకుడిగా...
బాలకృష్ణ కెరీర్‌లో స్పెషల్ సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో 'ఆదిత్య 369'ది మరీ మరీ స్పెషల్ ప్లేస్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. దానికి 'ఆదిత్య 999 మాక్స్' టైటిల్ ఖరారు చేశారు. ఆ చిత్రానికి బాలకృష్ణ స్వయంగా కథ రాశారు. అంతే కాదు... దర్శకత్వం కూడా ఆయన చేయనున్నారు. విశ్వక్ సేన్ 'ధమ్కీ' ప్రచార కార్యక్రమాల్లో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
'ఆదిత్య 999'తో నిర్మాతగా బాలకృష్ణ కుమార్తె
ఇప్పుడు బాలకృష్ణ సినిమా వ్యవహారాలు అన్నీ ఆయన రెండో కుమార్తె తేజస్విని చూస్తున్నారు. తండ్రితో పాటు ఎక్కువ కనిపిస్తున్నారు. 'ఆదిత్య 999'తో ఆమెను నిర్మాతగా పరిచయం చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారట. ఆ సినిమాతో ఆమె నిర్మాణంలో అడుగు పెడతారని రెండు మూడు నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఆ ఒక్క సినిమా మాత్రమే కాదు... ఆ తర్వాత బాలకృష్ణ నటించే సినిమాల్లో కూడా తేజస్విని నిర్మాణ భాగస్వామి కానున్నారని టాక్.
తేజస్విని భర్త, గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్ కూడా సినిమా నిర్మాణంలో అడుగు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నారట. 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సినిమా రానుందని టాక్. ఆ సినిమాలో కొంత పెట్టుబడి పెట్టడంతో పాటు లాభాల్లో వాటా తీసుకోవడానికి శ్రీ భరత్, తేజస్విని దంపతుల నుంచి ప్రతిపాదనలు వెళుతున్నాయట. ఇది ఎంత వరకు నిజం? ప్రపోజల్ మెటీరియలైజ్ అవుతుందా? లేదా? అనేది త్వరలో తెలుస్తుంది.
Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?
ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన 'వీర సింహా రెడ్డి' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 12న ఆ సినిమా విడుదల. ప్రస్తుతం ఆ సినిమాలో సాంగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అలాగే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అది కూడా 2023లో విడుదల కానుంది. వచ్చే ఏపీ ఎన్నికలకు ముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోయే సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.
వచ్చే ఏడాది సెట్స్ మీదకు
వచ్చే ఏడాది 'ఆదిత్య 999 మాక్స్' సెట్స్ మీదకు వెళ్లనుందని, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని బాలకృష్ణ వెల్లడించారు. మరో నాలుగు నెలల తర్వాత... ఫిబ్రవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన 'ఆదిత్య 369'కు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. అందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో అద్భుతంగా నటించారు. ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయలు ఆహార్యంలో ఆయన నటన అద్భుతం.
Also Read : బాలకృష్ణ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ - ముగ్గురు హీరోయిన్లు ఏం చెప్పారంటే?