Samantha: సమంతకు షూటింగులో గాయాలు... దెబ్బలు తగలకుండా యాక్షన్ స్టార్ అవ్వొచ్చా?
హీరోయిన్ సమంత షూటింగ్ లో గాయపడింది. తాజాగా ఆమె నటిస్తున్న ఓ మూవీలో యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తుండగా గాయపడినట్లు తెలుస్తోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.
Samantha Gets Injured: ఓవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే, మరోవైపు సినిమాలు చేస్తోంది నటి సమంత. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సినిమా షూటింగ్ లో గాయపడింది. యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసే సమయంలో ఆమెకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె గాయాలకు చికిత్స తీసుకుంటున్నది. తన ట్రీట్మెంట్ కు సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటో మీద క్రేజీ క్యాప్షన్ పెట్టింది. ‘‘దెబ్బలు తగలకుండా నేను యాక్షన్ స్టార్ అవ్వొచ్చా?” అని రాసింది.
అభిమానుల ఆందోళన, గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్..
అటు ఈ ప్రమాదానికి సంబంధించి సమంతా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె ఏ సినిమాలో నటిస్తున్నది? ఎక్కడ షూటింగ్ లో పాల్గొన్నది? ఎప్పుడు గాయపడింది? ఎలా గాయపడింది? అనే వివరాలేవీ బయటకు చెప్పలేదు. అయితే, ఈ ఫోటోను చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత
సమంత గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నది. ‘శాకుంతలం’ సినిమా తర్వాత కొంతకాలం పాటు ఆమె సినిమాలకు విరామం ప్రకటించింది. పూర్తిగా ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టింది. ‘మయోసైటిస్’ కు చికిత్స తీసుకుంది. వ్యాధి నుంచి కాస్త కోలుకున్న సమంత.. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత సమంత సినిమాలకు సంబంధించి పెద్దగా అప్ డేట్స్ లేవు.
విడుదలకు రెడీ అవుతున్న‘సిటాడెల్: హనీ బన్నీ’
సమంత నటించిన తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ నటుడు వరుణ్ థావన్ తో కలిసి నటిస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ తెరకెక్కింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక రీసెంట్ గా సమంత ‘బంగారం’ అనే సినిమాను ప్రకటించింది. ఈ సినిమాతో ఆమె నిర్మాతగా మారింది.