Acharya Update: సిద్ధాగా రామ్ చరణ్ తేజ్.. అప్‌డేట్ కోసం అభిమానులు వెయిటింగ్..
ఆచార్య సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. చిరంజీవితో కలిసి నటిస్తున్న రామ్ చరణ్ ఇందులో సిద్ధగా ఆకట్టుకోనున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆచార్య. . చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్దే ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2022, ఫిబ్రవరి 4వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్.. పాటలు మాత్రమే విడుదలయ్యాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘లాహే లాహే’, ‘నీలాంభరి’ పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ‘ఆచార్య’ చిత్రం యూనిట్ తాజాగా మరో అప్‌డేట్‌ను వదిలనుంది. ఇందులో రామ్ చరణ్ సిద్ధా పాత్రను పరిచయం చేయనున్నట్లు తెలిసింది. ఈ అప్‌డేట్‌ను బుధవారం ఉదయం 10.08 గంటలకే విడుదల చేస్తామని చెప్పారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతుందని ప్రకటించారు. దీంతో అభిమానులు అప్‌డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
వాస్తవానికి ‘ఆచార్య’ మే నెలలో విడుదల కావాలి. కానీ కరోనా వైరస్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో చిత్రం రిలీజ్ డేట్‌పై రకరకాల వార్తలు షికారు చేశాయి. 2022 జనవరి ఏడో తేదీన సినిమా విడుదల అవుతుంది.. ప్రకటన రావడమే తరువాయి అనే రేంజ్‌లో లీకులు వచ్చాయి. ఇంతలో ఆ డేట్‌ను ఆర్ఆర్ఆర్ తీసేసుకుంది. దీంతో ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన వస్తుందని, పుష్ప వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పుష్ప, ఆచార్య పోటీ పడతాయని.. రెండూ ఒకేరోజు విడుదల అవుతాయని.. ఇలా రకరకాల పుకార్లు వినిపించాయి. ఇప్పుడు ఈ అధికారిక ప్రకటనతో పుకార్లన్నిటికీ తెర పడింది.
2018లో భరత్ అనే నేను విడుదల అయ్యాక.. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి సైరా షూటింగ్‌లో బిజీ కావడం, ద్వితీయార్థంలో వచ్చే ముఖ్యమైన పాత్రకు ఏ హీరోను తీసుకోవాలో అనే విషయంలో తర్జనభర్జనల కారణంగా మరింత ఆలస్యం అయింది. ఈ పాత్ర నిడివి 15 నిమిషాలు మాత్రమేనని, మహేష్ బాబు ఈ పాత్ర చేస్తాడని వార్తలు వచ్చాయి. తర్వాత రామ్ చరణ్‌ను తీసుకున్నాక పాత్ర నిడివి కూడా పెరిగిందని, కొరటాల ఒక సందర్భంలో చెప్పారు. సెకండాఫ్ పూర్తిగా సిద్ధ పాత్ర ఉంటుందని తెలిపాడు.
కరోనావైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో టాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. తెలుగులో మొదట విడుదల కానున్న పెద్ద చిత్రం ‘పుష్ప’. ఇది డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. జనవరి 7వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’, 14వ తేదీన ‘రాధేశ్యామ్’ విడుదల కానుంది. జనవరి 12వ తేదీన ‘భీమ్లా నాయక్’, 13వ తేదీన సర్కారు వారి పాట విడుదల కావాల్సి ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’ ఎంట్రీతో ఇవి రెండూ వేరే తేదీకి షిఫ్ట్ అవ్వనున్నాయని సమాచారం.