Ap Elections 2024: ఓటు వేయడానికి వెళ్తున్నారా? - ఈ రూల్స్ పాటించాలి, గుర్తుంచుకోండి!
Vote Casting: ఓటు వేసేందుకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓటర్లు పోలింగ్ బూత్ వద్ద నిబంధనలు పాటించాలని.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు.
Rules Follow When Casting Your Vote: ఓట్ల పండుగ మొదలైంది. ఐదేళ్ల పాటు తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే, తాము మెచ్చే, తమకు మంచి చేసే నాయకున్ని ఎన్నుకునే 'ఓటు' అనే దివ్యాస్తాన్ని సంధించేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. అయితే, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లే వారు పోలింగ్ కేంద్రంలో కొన్ని నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. లేకుంటే చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేటప్పుడు రూల్స్ పాటించాలని స్పష్టం చేస్తున్నారు. మరి ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందామా.!
పోలింగ్ బూత్ వద్ద..
- పోలింగ్ బూత్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. బూత్ దగ్గర ఎలాంటి ప్రచారం చేయకూడదు.
- పోలింగ్ బూత్ లోకి మొబైల్, కెమెరాలు తీసుకెళ్లకూడదు. గొడవలు, అల్లర్లు సృష్టించకూడదు.
- పోలింగ్ బూత్ లో ఎన్నికల అధికారి విధులకు ఆంటకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
- ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు మీ వెంట ఈసీ సూచించిన ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
- మద్యం తాగి పోలింగ్ బూత్ లోకి వెళ్లకూడదు. ఇతరుల ఓటు వేయడానికి ప్రయత్నించకూడదు.
ఓటింగ్ ప్రక్రియ ఇలా..
- ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డు మీ వెంట తీసుకెళ్లాలి.
- పోలింగ్ బూత్ లో మొబైల్స్ తీసుకెళ్లకూడదు. ఒకవేళ పొరపాటున మర్చిపోయి తీసుకెళ్లినా స్పిచ్చాఫ్ చేసి అక్కడ ఎన్నికల అధికారులకు ఇవ్వాలి.
- ఎన్నికల సిబ్బంది జాబితాలో మీ పేరు చెక్ చేసుకుని మీకు ఓటు వేసేందుకు అనుమతిస్తారు.
- ఆ తర్వాత ఎడమచేతి చూపుడు వేలిపై ఇంక్ పూస్తారు.
- అనంతరం పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసే ఛాంబర్ కు వెళ్లాలి. పోలింగ్ అధికారి బటన్ నొక్కి బ్యాలెట్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మీరు మీకు నచ్చిన వారికి ఓటు వేసిన అనంతరం ఈవీఎంలో 'బీప్' శబ్దం వస్తుంది. అనంతరం మీ ఓటు నమోదవుతుంది.
- అక్కడ ఓటు వేసిన అనంతరం అసెంబ్లీ అభ్యర్థి ఛాంబర్ లో మీ ఓటు వేయాలి.
- మీ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వెంటనే పోలింగ్ బూత్ నుంచి బయటకు రావాలి.
- మీరు ఎవరికి ఓటు వేశారో బయట పెట్టడం కూడా నేరమే. అలాగే, మీరు ఓటు వేసేటప్పుడు ఎవరైనా ఫోటో, వీడియో తీసినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
దొంగ ఓట్లు వేస్తే..
- ఓటరు జాబితాలో పేరు ఉన్న వ్యక్తి మాత్రమే ఓటు వేయాలి. జాబితాలో పేరున్న వ్యక్తికి బదులు వేరే వ్యక్తి ఓటు వేస్తే వారిపై కేసు నమోదు చేస్తారు.
- అలాగే, ఒక వ్యక్తి రెండు ఓట్లు వేయడం కూడా నేరమే. ఒక వ్యక్తి ఒక ఓటు మాత్రమే వేయాలి.
- ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే ఒకటి మాత్రమే వినియోగించుకోవాలి. రెండు చోట్ల ఓటు వేస్తే వారిపై చర్యలు తీసుకుంటారు.
ఏర్పాట్లు పూర్తి
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న (సోమవారం) పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఓటర్లు నిబంధనలు పాటిస్తూ.. తమ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Electoral Ink: చూపుడువేలుపై వేసే ఇంక్ బయట లభ్యమవుతుందా? అలా చేస్తే కఠిన చర్యలు - ఈసీ వార్నింగ్