Electoral Ink: చూపుడువేలుపై వేసే ఇంక్ బయట లభ్యమవుతుందా? అలా చేస్తే కఠిన చర్యలు - ఈసీ వార్నింగ్
Indelible Ink: ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
Mukesh Kumar Meena: ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేశారనేందుకు రుజువు.. వారి చూపుడు వేలు మీద ఎన్నికల సిబ్బంది వేసే సిరా గుర్తు. అందరూ తాము ఓటు వేశామని ఇలా చూపుడు వేలు చూపిస్తూ ఉండడం ఈ మధ్య ట్రెండింగ్ గా ఉంది. ఈ ఎన్నికల సిబ్బంది వాడే ఇంకు చాలా ప్రత్యేకమైనది. ఒక్కసారి ఆ సిరాను చూపుడు వేలుపై రాస్తే అది అస్సలు చెరిగిపోకుండా ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో ఓ ఫేక్ ప్రజారం జరుగుతోంది. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ దుష్ప్రచారంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండించారు.
చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
ఏపీ ఎన్నికల ముఖచిత్రం ఇదీ
ఏపీలో అసెంబ్లీ సీట్లు - 175
లోక్ సభ స్థానాలు - 25
మొత్తం ఓటర్లు- 4.14 కోట్ల మంది
పురుషులు - 2.3 కోట్లు; మహిళలు - 2.10 కోట్లు
థర్డ్ జెండర్ 3,421
సర్వీస్ ఓటర్లు 68,185
169 సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్
పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
ఆ సమయంలోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం