(Source: ECI/ABP News/ABP Majha)
AP Political Trend : బాబును మళ్లీ రప్పిద్దాం నినాదం - సైలెంట్‌గా ప్రజల్లో చర్చకు పెట్టిన టీడీపీ !
Andhra Politics : మళ్లీ చంద్రబాబును సీఎం చేద్దాం నినాదాన్ని టీడీపీ ప్రజల్లో చర్చకు పెట్టింది. అభివృద్ది, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో ఐదేళ్లు ఏర్పడిన పరిస్థితుల్నే ప్లస్‌గా మార్చుకున్నారు.
Babu Nu Malli Rappiddam Slogan : రాజకీయాల్లో ఒక్క స్లోగన్ ప్రజల్లోకి వెళ్తే అది రాజకీయ పార్టీకి పెద్ద ఆస్తి. ఆ స్లోగన్ ప్రజల్లోకి పంపాలంటే క్యాచీగా ఉంటే సరిపోదు. అందులో ఉన్న సబ్జెక్ట్ అందర్నీ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఈ విషయంలో ఈ సారి తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవల్‌లో " బాబును మళ్లీ రప్పిద్దాం " అనే స్లోగన్ ను హైలెట్ చేసింది. సోషల్ మీడియాలో.. మీడియాలో చేసే ప్రచారానికి ఈ స్లోగన్ ను పెద్దగా హైలెట్ చేయలేదు. కానీ క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్య, కేడర్ తో చర్చకు పెట్టింది. చంద్రబాబును మళ్లీ ఈ రాష్ట్రానికి సీఎంను చేయాలి.. ఎందుకు చేయాలి అన్న అంశాలపై చర్చకు పెట్టారు. మెల్లగా ప్రారంభమైన ఈ అంశం.. అన్ని గ్రామాలు, పట్టణాలు, రచ్చబండలు, టీ దుకాణాల వల్ల ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా చేయగలిగారు. ఇదే అంశం ఇప్పుడు గేమ్ ఛేంజర్ గా మారిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
జగన్ పాలనలో మైనస్‌లే ప్రచారాస్త్రాలు !
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి కేంద్రీకరించారు. సంక్షేమం అంటే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం. ఈ పథకాలు ప్రాధాన్యత ఇవ్వడం అర్హతల పేరుతో చాలా మందికి పథకాలు అందకపోవడం మైనస్ అయింది. అదే సమయంలో చిన్న చిన్న అభివృద్ధి పనులు చేయకపోవడంపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగింది. ఈ అంశాన్ని హైలెట్ చేసుకున్న టీడీపీ నేతలు .. చంద్రబాబు ట్రాక్ రికార్డును బట్టి అదే విషయాల్లో ప్రజల అసంతృప్తిని.. పాజిటివ్ గా టీడీపీ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు హయాంలో సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. అవి ఇప్పుడు బాబును మళ్లీ రప్పిద్దాం అనే నినాదానికి బలం ఇస్తున్నాయని భావిస్తున్నాయి.
టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున రోడ్లు, ప్రాజెక్టుల పనులు
తెలుగుదేశం పార్టీ ఉన్న ఐదేళ్లలో ఏపీలో పెద్ద ఎత్తన రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ఊరూరా సిమెంట్ రోడ్లు వేశారు. అలా రోడ్లు వేసినందునకే.. టీడీపీ నేతలు కమిషన్లు తీసుకున్నారని వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని అందుకే ఓడించారని ఓ సందర్భంలో టీడీపీ కీలక నేత చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో నిజం ఉందో లేదో కానీ.. రోడ్లు, ఇతర ప్రాజెక్టుల పనులు మాత్రం శరవేగంగా సాగాయి. అమరావతి నిర్మాణం రేయింబవళ్లు జరిగేది. ఇలా మౌలిక సదుపాయలు, ప్రాజెక్టుల, టిడ్కో ఇళ్లు వంటి నిర్మాణాలతో ఎప్పుడూ ఏదో ఓ పని జరుగుతూ ఏపీలో హడావుడి ఉండేది. కానీ ఐదేళ్లలో వీటికి కేటాయించిన నిధులన్నీ సంక్షేమానికి మళ్లించడంతో ప్రజలకు ఆ లోటు కనిపించింది. మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే రోడ్లు.. ఇతర పనులు ముందుకు సాగుతాయని ప్రజల్లో చర్చ పెట్టారు. మెల్లగా ఇది అందిర మధ్య హాట్ టాపిక్ అయింది. బాబును మళ్లీ రప్పిద్దామంటూ చర్చలు జోరుగా సాగడానికి కారణం అయింది.
పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కూడా !
తెలుగుదేశం హయాంలో అనేక పరిశ్రమలు వచ్చాయి. సాఫ్ట్ వేర్ రంగంలో విజయవాడలో హెచ్‌సీఎల్ అనంతపురంలో కియా ..విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటివి వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకూ వెనక్కి పోయాయి. ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీలు మాత్రం కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం కొనసాగించిన ఒరవడి కొనసాగించడంలో విఫలం కావడం సీఎం జగన్ పెట్టుబడుల ఆకర్షణకు పెద్దగా ప్రయత్నించకపోవడం ఇబ్బందికరంగా మారింది. పెద్దగా ఉపాధి లభించని సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సంస్థలకు వేల ఎకరాలు కేటాయించడం మినహా పెద్దగా ఉపాది అవకాశాలు రాలేదన్న అభిప్రాయం ఉంది. తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు. ఏపీలోనే రావాలంటే.. బాబును మళ్లి రప్పిద్దామంటూ.. జరుగుతున్న చర్చలు టీడీపీ వ్యూహాన్ని బలపరిచాయని అనుకోవచ్చు.
ఎలాంటి టాపిక్ అయినా ప్రజల్లో చర్చ జరిగితేనే అది రాజకీయ అంశంగా మారుతుంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పూర్తి స్థాయిలో ప్రజల్లో చర్చ పెట్టేలా టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అనుకోవచ్చు. అందుకే బాబును మళ్లీ రప్పిద్దాం అనే కాన్సెప్ట్.. ప్రజల్లోకి చొచ్చుకుపోయిందని అనుకోవచ్చు.