Mallareddy : కాంగ్రెస్‌లోకి కోవర్టుల్ని పంపించా - మరోసారి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana Politics : కాంగ్రెస్ లోకి కోవర్టుల్ని పంపించానని మల్లారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ చేరిన 30 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ కోసం పని చేస్తారని చెప్పుకొచ్చారు.
Elections 2024 : మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా ఆయన పార్టీ సమావేశంలో అంతర్గతంగా మాట్లాడుతున్న ఓ వీడియో వైరల్ అయింది. మేడ్చల్ జిల్లా లో పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తానే కాంగ్రెస్ లోకి పంపించానని అందులో చెప్పుకున్నారు. వాళ్లంతా తన మనుషులేనని... కోవర్టులుగా పని చేసేందుకే తాను కాంగ్రెస్ లోకి పంపానని ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు. వాళ్ళంతా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కోసమే పనిచేస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత వారంతా మళ్లీ బీఆర్ఎస్ లో చేరతారన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని కార్పొరేటర్లతో చెప్పానని అన్నారు. అయితే తాము కాంగ్రెస్‌లో ఉండలేకపోతున్నామని కార్పొరేటర్లు చెబుతున్నారని మల్లారెడ్డి అన్నారు. హస్తం పార్టీలోని సీనియర్ నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు ప్రతి రోజూ తనకు ఫోన్లు చేస్తున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. మల్లారెడ్డి వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత స్థానిక సంస్థలకు చెందిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరిపోయారు. మేడ్చల్ జిల్లాకు చెందిన వారు జీహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్లు, మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు, నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మేడ్చల్ నుంచి చాలా మంది కాంగ్రెస్ లో చేరినా ఆపలేదని ఆయనపై పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఓ సందర్భంలో మల్లారెడ్డి కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరిగింది. బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తోనూ చర్చించారు. అయితే తన కుమారుడికి ఎంపీ టిక్కెట్ అడిగినట్లుగా చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడంతో చేరిక ఆగిపోయిందని చెబుతున్నారు.
మరో వైపు ఆయన బీజేపీ నేతల్ని కూడా మచ్చిక చేసుకుంటూ ఉంటారు. ఆఫ్ ది రికార్డ్ తాను బీఆర్ఎస్ లో ఉంబోనని కాంగ్రెస్ లేకపోతే బీజేపీలో చేరుతానని చెబుతూ ఉంటారు. కానీ మళ్లీ బీఆర్ఎస్ లో హడావుడి చేస్తూంటారు. ఇటీవల మల్కాజిగిరి ఎంపీగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ను కలిసి మీదే గెలుపని ప్రకటించారు. ఈ విషయం వివాదాస్పదమయింది. మామూలుగా అన్నానని ఈటల కూడా బీఆర్ఎస్ లలోనే పెరిగారని ఆయన చెప్పుకొచ్చారు.
అనేక రకాల వ్యాపారాలు ఉన్న మల్లారెడ్డి తీవ్రమైన ఒత్తిడిపరిస్థితుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఆయన వ్యాపారాలకు .. పదవులు అడ్డం వస్తున్నాయి. రాజీనామా చేయలేరు.. అలాగని అధికార పార్టీతో ఇబ్బందులు లేకుండా రాజకీయం చేయలేరు. ఈ క్రమంలో ఆయన ఎవరు ఎదురుపడితే వాళ్లకు మద్దతు ప్రకటిస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.